సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి టెట్‌ను నిర్వహించాల్సి ఉన్నా అది అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలో టెట్ నిర్వహించి దాదాపు ఏడాది కావస్తుం డటంతో మళ్లీ టెట్ ఎప్పుడు నిర్వహిస్తారా అని నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురు కులాల్లో కలిపి మరో 10 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలకు సాధారణ ఎన్నికలకంటే 6 నెలల ముందే మళ్లీ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు టెట్ నిర్వహించాలని ప్రభు త్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం టెట్ నిర్వహిస్తే సులభంగా సిద్ధం కావచ్చని, టెట్, టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టులను సమీప తేదీల్లో నిర్వహిస్తే రెండింటికీ సిద్ధం కావడం కష్టమని చెబుతున్నారు.
పరీక్షలున్నాయనే దృష్టిపెట్టలేదు..
ప్రతి ఆరు నెలలకోసారి టెట్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ గురుకులాల్లో టీచర్ పోస్టులు, పాఠశాలల్లో టీఆర్‌టీ పోస్టులకు పరీక్షలు జరుగుతున్నందున దానిపై దృష్టి పెట్టలేదని అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉన్నందున గతంలో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కూడా స్కోర్ పెంచుకునేందుకు మళ్లీ టెట్ రాసే అవకాశముంటుందని పేర్కొంటున్నారు. నియామకాల పరీక్షలప్పుడు టెట్ పెడితే అభ్యర్థులు ఇబ్బంది పడతారనే ఆ దిశగా ఆలోచించలేదం టున్నారు. ప్రస్తుతం ఆయా పోస్టుల రాత పరీక్షలు పూర్తి కావడం, మరోవైపు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల ఫైనల్ ఇయర్ పరీక్షలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో టెట్ నిర్వహణపై యోచిస్తామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. వీలైతే ఈ నెలలో ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపిస్తామని చెప్పారు. ప్రభుత్వం అంగీకరిస్తే వచ్చే నెలాఖరుకు టెట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు.
గతేడాది అర్హత సాధించిన లక్ష మంది..
రాష్ట్రంలో గతేడాది జూలై 23న విద్యాశాఖ టెట్ నిర్వహించింది. ఆ టెట్‌లో పేపర్–1 రాసేందుకు 1,11,647 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 98,848 మంది హాజరయ్యారు. హాజరైన వారిలో 56,708 మంది (57 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే దరఖాస్తు చేసిన వారి సంఖ్యతో పోలిస్తే సగం మందే అర్హత సాధించారు. ఇక పేపర్–2 రాసేందుకు 2,56,265 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,30,932 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో కేవలం 45,055 మందే (19.51 శాతం) అర్హత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment