TET examination
-
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
-
రేపట్నుంచే ఏపీలో టెట్ పరీక్షలు
సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి 6వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. రెండు సెషన్లలో టెట్ పరీక్షల నిర్వహణ ఉంటుందని ఏపీ విద్యాశాఖ ఇదివరకే ప్రకటించింది. పొద్దున 9గం.30. నుంచి 12గం. దాకా.. అలాగే మధ్యాహ్నాం 2గం.30ని. నుంచి సాయంత్రం 5గం. దాకా మరో సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు అరగంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. టెట్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉండనుంది. మొత్తం 2,67,559 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 120 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయడం గమనార్హం. తెలంగాణాలో మూడు, కర్ణాటకలో నాలుగు, తమిళనాడులో రెండు, ఒడిశా రాష్ట్రంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల పర్యవేక్షణకు 26 మంది సీనియర్ అధికారుల్ని నియమించారు. పరీక్షా కేంద్రాల తనిఖీలకి 29 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశారు. గర్బిణీ అభ్యర్ధులకి సమీప పరీక్షా కేంద్రాలలో హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. ఇక.. విద్యాశాఖ ముందస్తుగానే రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 10వ తేదీన ప్రాథమిక కీ.. 14వ తేదీన తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
TS: ప్రారంభమైన టెట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రారంభమైంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా హల్స్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పాఠశాల విద్యాశాఖ. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 1,139 పరీక్ష కేంద్రాల్లో ఉదయ, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ పేపర్–1, పేపర్–2 జరుగుతుంది. ► ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపర్–1 పరీక్షకు 1,139 కేంద్రాలు ఏర్పాటు చేయ గా, 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ► మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్–2 పరీక్షకు 913 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,08,498 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, వాటిలో పొరపాట్లు తలెత్తితే సరిచేసుకునే సూచనలు సైతం వెల్లడించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో... టెట్ జరిగే కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్ష తీరును పర్యవేక్షిస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యాకే అభ్యర్థులను కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. -
టెన్త్ విద్యార్థులకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతిలో 11 ప్రశ్నపత్రాలకు బదులు ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష విద్యా బోధన లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఏప్రిల్/మేలో నిర్వహించే టెన్త్ పరీక్షల్లో ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేస్తామని ప్రతిపాదించింది. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో రెండు పేపర్ల చొప్పున ఉండగా హిందీ మాత్రం ఒకే పేపర్ ఉంది. ఇకపై సబ్జెక్టుకు ఒక పేపరే ప్రశ్నపత్రం ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఇక ఇంటర్ పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించాలని యోచిస్తోంది. ముందుగా 9, 10 తరగతులకు... పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు. ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించాలని భావించినా ప్రస్తుత చలికాలంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ప్రత్యక్ష విద్యా బోధనపై నిర్ణయం తీసుకోలేదన్నారు. జనవరి మొదటి వారంలో లేదా సంక్రాంతి తర్వాత 9వ తరగతి నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని, దీనిపై సీఎం కేసీఆర్‌తో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. 9, 10 తరగతుల వారికి కనీసం మూడు నెలలపాటు ప్రత్యక్ష బోధన ఉండేలా చూస్తామన్నారు. వాటితోపాటు జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి చర్యలు చేపడతామన్నారు. ఆ తరువాత దశలవారీగా కింది తరగతుల వారికి ప్రత్యక్ష బోధనకు నిర్ణయం తీసుకోనున్నారు. యూనివర్సిటీల వీసీల నియామకాలకు సంబం ధించిన ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో∙నియామకాలు చేపడతామన్నారు. (చదవండి: 33 సార్లు ఫెయిల్.. కరోనాతో పాస్) ఆన్లైన్లో టెట్? టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అంతకంటే ముందుగానే టెట్ నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే ఈసారి టెట్‌ను ఆన్లైన్లో నిర్వహించేలా సీఎం ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపామన్నారు. -
అవనిగడ్డలో ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు నూతనంగా ప్రవేశపెట్టిన టెట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో పీఈటీ అభ్యర్థులు ఆదివారం వాటర్ ట్యాంకు ఎక్కారు. పరీక్షను రద్దుచేస్తామని హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి దిగేది లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అభ్యర్థులను నచ్చజెప్పి కిందకు దించే ప్రయత్నాలు చేస్తున్నారు. టెట్ పరీక్షలో చెన్నై కేంద్రంగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెన్నైలో కొన్ని ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు ప్రత్యేక పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయించుకున్నారని అభ్యర్థులు పేర్కొన్నారు. పీఈటీ అభ్యర్థుల నుంచి వేల రుపాయలు వసూలు చేసి.. పేపర్ లీకేజీ చేయించేందుకే ఈ ఏర్పాట్లు చేశారని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని పీఈటీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు కిందకు దిగి రావాలని కోరుతున్నారు. -
సెంటర్ ఎటెట్టా
సాక్షి, బద్వేలు : టెట్ పరీక్ష అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. పరీక్షా కేంద్రాలు ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం అభ్యర్థులకు శ్రమతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడేలా చేస్తోంది. జిల్లాలోని అభ్యర్థులకు సరిపోయే స్థాయిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దాదాపు మూడు వేల మంది ఇతర జిల్లాలకు వెళ్లి పరీక్ష రాయాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఈ నెల 10 నుంచి 19 వరకు జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ... జిల్లావ్యాప్తంగా 25 వేల మంది టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సరిపోయే స్థాయిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. మొదట దరఖాస్తు అనంతరం గత నెల 25 నుంచి 29 వరకు పరీక్షా కేంద్రాల ఎంపికకు అవకాశం కల్పించారు. మొదటి రోజు మధ్యాహ్నం లోపే డీఎడ్ అభ్యర్థులకు జిల్లాలో కేటాయిం చిన పరీక్షా కేంద్రాలన్నీ భర్తీ అయ్యాయి. సాయంత్రానికి మిగిలిన స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను తప్పని సరి పరిస్థితుల్లో ఇతర జిల్లా పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిం ది. కేంద్రాల మార్పునకు అవకాశం కల్పిస్తారని ఆశించినా వారి ఆశలపై అధికారులు నీళ్లు జల్లారు. గతంలో మాదిరే... టెట్–2017లో దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షా కేంద్రాల కేటాయింపులో ప్రభుత్వం చుక్కలు చూపింది. వారు కోరుకున్న కేంద్రాలను ఇవ్వకుండా చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ప్రస్తుత టెట్‌లో అలాంటి పరిస్థితి రాదని చెప్పిన అధికారులు తీరా దగ్గరికి వచ్చేసరికి చెతులేత్తాశారు. మరోసారి అలాంటి పరిస్థితే కల్పించి నిరుద్యోగులతో చెలగాటం అడుతున్నారు. జిల్లాలో పది కేంద్రాలే... జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేట పట్టణాలలో పది కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. గత నెల 29వ తేదీ తరువాత పరీక్షా కేంద్రాల మార్పునకు అవకాశం కల్పిస్తారని ఆశిం చినా మీడియం, సబ్జెక్టు మార్పునకు మాత్రమే అవకాశం కల్పించారు. దీంతో అభ్యర్థులు తీవ్రనిరాశకు గురవుతున్నారు. ∙పరీక్షా కేంద్రం మార్పు చేయాలంటూ ఫిర్యాదులు పెరుగుతుండటంతో ఈ అంశం తమ పరిధిలో లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పేపరు–1 ఎస్జీటీకి 13 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ పేపరు–2కు ఎనిమిది వేల మంది, భాష పండిత పరీక్షకు మూడు వేల మంది, పీఈటీకి 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మంగళవారం నుంచి హాల్‌టిక్కెట్ డౌన్లోడు చేసుకోవచ్చు. ఆందోళనలో గర్భిణులు, దివ్యాంగులు.. టెట్ దరఖాస్తు చేసుకున్న వారిలో గర్భిణులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కేంద్రాలు ఆన్లైన్లో మొదటి రోజే పూర్తి కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర జిల్లా కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు. రెండో రోజు నుంచి చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పట్టణాలలోని కేంద్రాలు మాత్రమే కనిపించాయి. తరువాతైనా కేంద్రాల మార్పునకు అవకాశం ఇస్తారని భావించినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు మాత్రం కనిపించడం లేదు. వందల కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష రాయాలంటే ఎలా అని గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. ఇతర జిల్లాలకు వెళ్లాలంటే రూ.వేలలో ఖర్చు ప్రస్తుతం ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయాలంటే రూ.వేలల్లో ఖర్చు పెట్టుకోవాల్సిందే. కేటాయించిన కేంద్రాలు కనీసం రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ముందురోజే వెళ్లాలి. బస్సుచార్జీలకు కనీసం రూ.వెయ్యి వెచ్చించాల్సిందే. అక్కడ వసతి, భోజనాలు, ఆటో ఖర్చులకు మరో రూ.వెయ్యికి పైగా కావాలి. గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులకు మరోకరు తోడు ఉండాలి. వీరికి కనీసం రూ.5 వేలు కావాల్సిన పరిస్థితి. -
టెట్ ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి టెట్‌ను నిర్వహించాల్సి ఉన్నా అది అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలో టెట్ నిర్వహించి దాదాపు ఏడాది కావస్తుం డటంతో మళ్లీ టెట్ ఎప్పుడు నిర్వహిస్తారా అని నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురు కులాల్లో కలిపి మరో 10 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలకు సాధారణ ఎన్నికలకంటే 6 నెలల ముందే మళ్లీ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు టెట్ నిర్వహించాలని ప్రభు త్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం టెట్ నిర్వహిస్తే సులభంగా సిద్ధం కావచ్చని, టెట్, టీచర్ రిక్రూట్మెంట్ టెస్టులను సమీప తేదీల్లో నిర్వహిస్తే రెండింటికీ సిద్ధం కావడం కష్టమని చెబుతున్నారు. పరీక్షలున్నాయనే దృష్టిపెట్టలేదు.. ప్రతి ఆరు నెలలకోసారి టెట్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ గురుకులాల్లో టీచర్ పోస్టులు, పాఠశాలల్లో టీఆర్టీ పోస్టులకు పరీక్షలు జరుగుతున్నందున దానిపై దృష్టి పెట్టలేదని అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉన్నందున గతంలో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కూడా స్కోర్ పెంచుకునేందుకు మళ్లీ టెట్ రాసే అవకాశముంటుందని పేర్కొంటున్నారు. నియామకాల పరీక్షలప్పుడు టెట్ పెడితే అభ్యర్థులు ఇబ్బంది పడతారనే ఆ దిశగా ఆలోచించలేదం టున్నారు. ప్రస్తుతం ఆయా పోస్టుల రాత పరీక్షలు పూర్తి కావడం, మరోవైపు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల ఫైనల్ ఇయర్ పరీక్షలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో టెట్ నిర్వహణపై యోచిస్తామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. వీలైతే ఈ నెలలో ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపిస్తామని చెప్పారు. ప్రభుత్వం అంగీకరిస్తే వచ్చే నెలాఖరుకు టెట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు. గతేడాది అర్హత సాధించిన లక్ష మంది.. రాష్ట్రంలో గతేడాది జూలై 23న విద్యాశాఖ టెట్ నిర్వహించింది. ఆ టెట్‌లో పేపర్–1 రాసేందుకు 1,11,647 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 98,848 మంది హాజరయ్యారు. హాజరైన వారిలో 56,708 మంది (57 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే దరఖాస్తు చేసిన వారి సంఖ్యతో పోలిస్తే సగం మందే అర్హత సాధించారు. ఇక పేపర్–2 రాసేందుకు 2,56,265 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,30,932 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో కేవలం 45,055 మందే (19.51 శాతం) అర్హత సాధించారు. -
టెట్ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత
♦ పేపర్-1లో 40.89 శాతం ♦ పేపర్-2లో 22.15 శాతం ♦ జిల్లాకు ఐదు, పదో ర్యాంకులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. రెండు పేపర్లలోనూ నిరాశాజనకమైన ఫలితాలు రావడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా టెట్ పరీక్షకు 29,193 మంది హాజరు కాగా.. 7,524 మంది అర్హత సాధించారు. పేపర్-1 కేటగిరీ నుంచి 5,644 మంది పరీక్ష రాయగా.. 2,308 మంది మాత్రమే క్వాలిఫై అయి 40.89 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో రాష్ట్రంలో జిల్లా ర్యాంకు పదో స్థానానికి పడిపోయింది. అదేవిధంగా పేపర్-2 కేటగిరీలో 23,549 మంది పరీక్ష రాయగా.. 5,216 మంది పాసై 22.15శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో జిల్లా ర్యాంకు తొమ్మిదిలో నిలిచింది. జిల్లాకు 5, 10 ర్యాంకులు టెట్ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు మెరిశారు. పేపర్-1లో మందె శివరామకృష్ణ 131 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి లో ఐదో ర్యాంకు, గంగుల గౌతమ్‌కుమార్‌రెడ్డి 128 మార్కులు సాధిం చి 10వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. పేపర్-2లో తూము స్రవంతి 122 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు దక్కించుకున్నారు. -
‘టెట్’లో అర్హత సాధిస్తామోలేదోనని..
- వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య - సోమవారం ‘కీ’ చూసుకొని మనస్తాపం - మృతుల్లో ఒకరు ఎంపీటీసీ సభ్యురాలు తాండూరు/వనపర్తి/అలంపూర్: టెట్‌లో అర్హత సాధిస్తామోలేదోనని మనస్తాపంతో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు ఎంపీటీసీ సభ్యురాలు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరులోని శ్రీభావిగి భద్రేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన పూజారి నాగభూషణం, వీరమణి దంపతుల కూతురు శ్వేత (20) స్థానిక శాలివాహన డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీ) సెకండియర్ చదువుతోంది. ఆమె గతం లో డీఈడీ పూర్తి చేసింది. ఆదివారం నిర్వహించిన టెట్ పరీక్షకు పూజారి ముగ్గురు కూతుళ్లు శిరీష, మౌనిక, శ్వేత, కొడుకు రాజు హాజ రయ్యారు. నగరంలోని బేగంబజార్‌లో తోటి స్నేహితులతో కలసి పరీక్ష రాసింది. సోమవా రం ఉదయం వివిధ దినపత్రికల్లో వచ్చిన టెట్ కీ పేపర్ చూసి ఆందోళనకు గురయ్యారు. తక్కువ మార్కులు వస్తాయేమోననే స్టడీ రూంలో ఉరేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ మండలం బుక్కాపురానికి చెందిన సతీష్, స్వరూప (25) దంపతులు కొంతకాలంగా వనపర్తిలోని నందీహిల్స్‌లో నివాసముంటున్నారు. స్వరూప ఆదివారం టెట్ పరీక్ష రాసింది. అర్హత సాధిస్తానో.. లేదోనని సోమవారం మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్వరూప కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యురాలు. -
టెట్ టెన్షన్..
కేంద్రాల్లో సౌకర్యాల లేమి.. దొరకని చిరునామా జంటజిల్లాల్లో పేపర్-1కు 80 శాతం, పేపర్-2కు 90.84 శాతం హాజరు సిటీబ్యూరో: టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారుల పుణ్యమాని పట్టపగలు చుక్కలు చూశారు. కొన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేకపోగా.. మరికొన్ని ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల చిరునామా దొరక్క తంటాలు పడ్డారు. ఇంకొన్ని చోట్ల పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అభ్యర్థులు ఆవే దన వ్యక్తం చేశారు. అంతేగాక గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి పంపిస్తామని చెప్పినప్పటికీ.. చాలాచోట్ల అమలుకు నోచుకోలేదు. కేవలం అరగంట ముందుగానే అందరినీ ఒకేసారి పంపించినట్లు అభ్యర్థులు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో కేంద్రం ముందు పడిగాపులు తప్పలేదు. అంతేగాక మహిళలు తమ బ్యాగులు పెట్టుకునేందుకూ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో.. తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని కేంద్రాల వద్ద సిబ్బందితో అభ్యర్థులు వాగ్వాదానికి కూడా దిగారు. తీవ్ర ఇబ్బందులు గౌలిదొడ్డిలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఐటీజోన్ సమీపంలో కేంద్రం ఉన్నప్పటికీ సకాలంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో అందరూ ఆటోలనే ఆశ్రయించారు. ఆయా పరిసర ప్రాంతాల్లో కనీసం నీడ కూడా లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడ్డారు. భార్యలు పరీక్ష రాయడానికి వెళ్లగా.. వారి భర్తలు తమ చంటి పిల్లలతో నిరీక్షించిన దృశ్యాలు చాలాచోట్ల కనిపించాయి. అమ్మల పరీక్ష పూర్తయ్యే వరకు.. పిల్లల ఆలన పాలన తండ్రులే చూసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఆలస్యంగా వెళ్లడంతో రాయదుర్గం, కుత్బుల్లాపూర్‌లో ఒకరు చొప్పున పరీక్షకు దూర మయ్యారు. 25 నిమిషాలు ఆలస్యంగా... రాంకోఠిలోని నవజీవన్ బాలికల విద్యాలయంలోని కేంద్రంలో అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టాయి. ఒక్కపక్క సౌకర్యాలు లేకపోగా.. మరోపక్క ఉర్దూ మీడియం అభ్యర్థులకు తెలుగు మీడియం ప్రశ్నాపత్రాలు అందజేశారు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన పడ్డారు. తిరిగి సక్రమంగా ఇచ్చే సరికి 25 నిమిషాల సమయం గడిచిపోయింది. నష్టపోయిన తమకు అదనంగా 25 నిమిషాలు ఇవ్వాలని అభ్యర్థులు పట్టుబట్టడంతో.. అధికారులు దిగొచ్చారు. అలాగే ఇక్కడ ఇరుకైన గదుల్లో పరీక్ష రాయాల్సి వచ్చింది. కేంద్రం మొత్తంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో.. లైట్లు వెలగలేదు.. ఫ్యాన్లు తిరగలేదు. పేపర్-2కి అధిక శాతం హాజరు... జంట జిల్లాలో పేపర్-1కు 80 శాతం, పేపర్-2 పరీక్షకు 90.84 శాతం అభ్యర్థులు హాజరయ్యారని హైదరాబాద్ డీఈఓ సోమిరెడ్డి, రంగారెడ్డి డీఈఓ రమేష్‌లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో పేపర్ -1కు 11,779 మందకిగాను 9,836 మంది, రంగారెడ్డి జిల్లాలో 7,580 మందికిగాను 5,648 మంది పరీక్ష రాశారు. అలాగే పేపర్-2 కు హైదరాబాద్ జిల్లాలో 36,764 మందికిగాను 34,412 మంది, రంగారెడ్డి జిల్లాలో 27,041 మందికి 23,551 మంది హాజరయ్యారు. పాపం.. శంకర్ వరంగల్ జిల్లా డోర్నకల్ సమీపంలోని మారుమూల ప్రాంతమైన భూక్యాతాండకు చెందిన గుగులోత్ శంకర్‌కు పేపర్-2 పరీక్ష కేంద్రం గచ్చిబౌలిలోని జెడ్పీహెచ్ స్కూల్. పరీక్ష కోసం శనివారమే నగరానికి వచ్చాడు. తెలిసిన వారు శంషాబాద్‌లో ఉండడంతో రాత్రి అక్కడే బస చేశాడు. ఉదయం అక్కడి నుంచి బయలుదేరి గచ్చిబౌలికి, అక్కడి నుంచి ఆటోలో లింగంపల్లికి చేరుకున్నాడు. అక్కడ కేంద్ర చిరునామా కనుక్కోని విప్రో సర్కిల్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి గౌలిదొడ్డి రావడానికి ఆటో డ్రైవర్ నిరాకరించడంతో ఓ సహృదయుడు తన బైక్‌పై పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. అప్పటికే 2.36 గంటలయింది. దీంతో పరీక్షా కేంద్రం గేటుకు తాళం వేశారు. బతిమిలాడినా.. ససేమిరా అన్నారు. దీంతో కన్నీళ్ల పర్యంతమవుతుండగా.. అక్కడున్నవారు సర్దిచెప్పి ఇంటికి పంపించి వేశారు. -
ఎక్కడా ఇబ్బందులు రావొద్దు
► పకడ్బందీగా టెట్ నిర్వహించాలి ► అధికారులతో సమీక్షించిన ఏజేసీ మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఈనెల 22న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలని ఏజేసీ బాలాజీ రంజిత్‌ప్రసాద్ అదికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్సు హాల్లో టెట్ నిర్వహణకు ఎంపిక చేసిన రూట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 171పరీక్ష కేంద్రాల్లో 64,828 మంది అభ్యర్థులు టెట్ రాస్తున్నారని, రెండు పేపర్లకు జరిగే ఈ పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకరోజు ముందుగానే కేటాయించిన కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పరీక్షకు పోలీస్స్టేషన్ల నుంచి పేపర్లను తీసుకెళ్లి పరీక్ష అనంతరం పేపర్లను తిరిగి డీఈఓ కార్యాలయంలో సమర్పించే వరకు బాధ్యతగా ఉండాలని సూచించా రు. మొదటి పేపర్ పూర్తి కాగానే వెంటనే సంబంధిత రూట్ అధికారులు పేపర్లను సెంటర్ల వారీగా సేకరించి ఎస్కార్ట్ సహాయం తో డీఈఓ కార్యాలయానికి చేర్చాలన్నారు. రెండో పేపర్‌కు సంబంధించిన బాధ్యతను కూడా తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ వనజాదేవి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఈఓ విజయలక్ష్మీబాయి, నాగర్‌కర్నూల్ డిప్యూటీ ఈఓ రవీందర్ పాల్గొన్నారు. ఠాణాలకు టెట్ ప్రశ్నపత్రాలు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్ష పత్రాలను జిల్లా కోషాధికారి కార్యాలయం నుంచి పరీక్షకేంద్రాలు ఏర్పాటుచేసిన ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లకు శుక్రవారం తరలించారు. అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలి ఈ నెల 22న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరె న్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఇన్విజిలేటర్ల, ప్రత్యేకాధికారుల, రూట్ అధికారుల నియామకం వంటి విషయాలపై చర్చించారు. -
22న టెట్‌కు ఏర్పాట్లు
* ఇంకా నాలుగు రోజులే.. * ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ * పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే.. నిజామాబాద్ అర్బన్ : ఈనెల 22న టెట్ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ విద్యా కేంద్రాల్లోనే పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నారు. టెట్ పేపర్-1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. 39 సెంటర్లను ఏర్పాటు చేయగా 8,961 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 21,078 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 91 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 91 మంది సెంటర్లెవల్ అబ్జర్వర్లు, 91 మంది డిపార్టమెంటల్ ఆఫీసర్లు, 15 మంది రూట్ ఆఫీసర్లు , 275 మంది హాల్ సూపరింటెండెంట్లు, 1,036 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పేపర్-1,2 పరీక్షలు రాసే అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఖలీల్‌వాడి పాఠశాలలో సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. -
టెట్‌కు పక్కా ఏర్పాట్లు చేయండి
అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: మే 1న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు జిల్లాల్లో పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులను పాఠశాల విద్య ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆదేశించారు. మధ్యాహ్న భోజనం, టెట్ ఏర్పాట్లు తదితర కార్యక్రమాలపై మంగళవారం జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,200 పైగా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేసవి సెలవుల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి జిల్లా స్థాయిలో ప్రచారం కల్పించాలని ఆదేశించారు.