ఎక్కడా ఇబ్బందులు రావొద్దు
► పకడ్బందీగా టెట్ నిర్వహించాలి
► అధికారులతో సమీక్షించిన ఏజేసీ
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఈనెల 22న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలని ఏజేసీ బాలాజీ రంజిత్‌ప్రసాద్ అదికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో టెట్ నిర్వహణకు ఎంపిక చేసిన రూట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 171పరీక్ష కేంద్రాల్లో 64,828 మంది అభ్యర్థులు టెట్ రాస్తున్నారని, రెండు పేపర్లకు జరిగే ఈ పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకరోజు ముందుగానే కేటాయించిన కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పరీక్షకు పోలీస్‌స్టేషన్ల నుంచి పేపర్లను తీసుకెళ్లి పరీక్ష అనంతరం పేపర్లను తిరిగి డీఈఓ కార్యాలయంలో సమర్పించే వరకు బాధ్యతగా ఉండాలని సూచించా రు.
మొదటి పేపర్ పూర్తి కాగానే వెంటనే సంబంధిత రూట్ అధికారులు పేపర్లను సెంటర్ల వారీగా సేకరించి ఎస్కార్ట్ సహాయం తో డీఈఓ కార్యాలయానికి చేర్చాలన్నారు. రెండో పేపర్‌కు సంబంధించిన బాధ్యతను కూడా తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ వనజాదేవి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఈఓ విజయలక్ష్మీబాయి, నాగర్‌కర్నూల్ డిప్యూటీ ఈఓ రవీందర్ పాల్గొన్నారు.
ఠాణాలకు టెట్ ప్రశ్నపత్రాలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్ష పత్రాలను జిల్లా కోషాధికారి కార్యాలయం నుంచి పరీక్షకేంద్రాలు ఏర్పాటుచేసిన ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లకు శుక్రవారం తరలించారు.
అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలి
ఈ నెల 22న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరె న్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఇన్విజిలేటర్ల, ప్రత్యేకాధికారుల, రూట్ అధికారుల నియామకం వంటి విషయాలపై చర్చించారు.