టెట్ టెన్షన్.. | TET tension ... | Sakshi
Sakshi News home page

టెట్ టెన్షన్..

Published Sun, May 22 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

టెట్ టెన్షన్..

టెట్ టెన్షన్..

కేంద్రాల్లో సౌకర్యాల లేమి.. దొరకని చిరునామా
జంటజిల్లాల్లో పేపర్-1కు 80 శాతం, పేపర్-2కు 90.84 శాతం హాజరు

 

సిటీబ్యూరో: టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారుల పుణ్యమాని పట్టపగలు చుక్కలు చూశారు. కొన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేకపోగా.. మరికొన్ని ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల చిరునామా దొరక్క తంటాలు పడ్డారు. ఇంకొన్ని చోట్ల పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అభ్యర్థులు ఆవే దన వ్యక్తం చేశారు. అంతేగాక గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి పంపిస్తామని చెప్పినప్పటికీ.. చాలాచోట్ల అమలుకు నోచుకోలేదు. కేవలం అరగంట ముందుగానే అందరినీ ఒకేసారి పంపించినట్లు అభ్యర్థులు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో కేంద్రం ముందు పడిగాపులు తప్పలేదు. అంతేగాక మహిళలు తమ బ్యాగులు పెట్టుకునేందుకూ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో.. తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని కేంద్రాల వద్ద సిబ్బందితో అభ్యర్థులు వాగ్వాదానికి కూడా దిగారు. 

 
తీవ్ర ఇబ్బందులు

గౌలిదొడ్డిలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పరీక్షా కేంద్రానికి  చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఐటీజోన్ సమీపంలో కేంద్రం ఉన్నప్పటికీ సకాలంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో అందరూ ఆటోలనే ఆశ్రయించారు. ఆయా పరిసర ప్రాంతాల్లో కనీసం నీడ కూడా లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడ్డారు. భార్యలు పరీక్ష రాయడానికి వెళ్లగా.. వారి భర్తలు తమ చంటి పిల్లలతో నిరీక్షించిన దృశ్యాలు చాలాచోట్ల కనిపించాయి. అమ్మల పరీక్ష పూర్తయ్యే వరకు.. పిల్లల ఆలన పాలన తండ్రులే చూసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఆలస్యంగా వెళ్లడంతో రాయదుర్గం, కుత్బుల్లాపూర్‌లో ఒకరు చొప్పున పరీక్షకు దూర మయ్యారు.

  
25 నిమిషాలు ఆలస్యంగా...

రాంకోఠిలోని నవజీవన్ బాలికల విద్యాలయంలోని కేంద్రంలో అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టాయి. ఒక్కపక్క సౌకర్యాలు లేకపోగా.. మరోపక్క ఉర్దూ మీడియం అభ్యర్థులకు తెలుగు మీడియం ప్రశ్నాపత్రాలు అందజేశారు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన పడ్డారు. తిరిగి సక్రమంగా ఇచ్చే సరికి 25 నిమిషాల సమయం గడిచిపోయింది. నష్టపోయిన తమకు అదనంగా 25 నిమిషాలు ఇవ్వాలని అభ్యర్థులు పట్టుబట్టడంతో.. అధికారులు దిగొచ్చారు. అలాగే ఇక్కడ ఇరుకైన గదుల్లో పరీక్ష రాయాల్సి వచ్చింది. కేంద్రం మొత్తంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో.. లైట్లు వెలగలేదు.. ఫ్యాన్లు తిరగలేదు.


పేపర్-2కి అధిక శాతం హాజరు...
జంట జిల్లాలో పేపర్-1కు 80 శాతం, పేపర్-2 పరీక్షకు 90.84 శాతం అభ్యర్థులు హాజరయ్యారని హైదరాబాద్ డీఈఓ సోమిరెడ్డి, రంగారెడ్డి డీఈఓ రమేష్‌లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో పేపర్ -1కు 11,779 మందకిగాను 9,836 మంది, రంగారెడ్డి జిల్లాలో 7,580 మందికిగాను 5,648 మంది పరీక్ష రాశారు. అలాగే పేపర్-2 కు హైదరాబాద్ జిల్లాలో 36,764 మందికిగాను 34,412 మంది, రంగారెడ్డి జిల్లాలో 27,041 మందికి 23,551 మంది హాజరయ్యారు.


పాపం.. శంకర్
వరంగల్ జిల్లా డోర్నకల్ సమీపంలోని మారుమూల ప్రాంతమైన భూక్యాతాండకు చెందిన గుగులోత్ శంకర్‌కు పేపర్-2 పరీక్ష కేంద్రం గచ్చిబౌలిలోని జెడ్‌పీహెచ్ స్కూల్. పరీక్ష కోసం శనివారమే నగరానికి వచ్చాడు. తెలిసిన వారు శంషాబాద్‌లో ఉండడంతో రాత్రి అక్కడే బస చేశాడు. ఉదయం అక్కడి నుంచి బయలుదేరి గచ్చిబౌలికి, అక్కడి నుంచి ఆటోలో లింగంపల్లికి చేరుకున్నాడు. అక్కడ కేంద్ర చిరునామా కనుక్కోని విప్రో సర్కిల్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి గౌలిదొడ్డి రావడానికి ఆటో డ్రైవర్ నిరాకరించడంతో ఓ సహృదయుడు తన బైక్‌పై పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. అప్పటికే 2.36 గంటలయింది. దీంతో పరీక్షా కేంద్రం గేటుకు తాళం వేశారు. బతిమిలాడినా.. ససేమిరా అన్నారు. దీంతో కన్నీళ్ల పర్యంతమవుతుండగా.. అక్కడున్నవారు సర్దిచెప్పి ఇంటికి పంపించి వేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement