హైదరాబాద్‌లో రెండు బెడ్‌రూములతో ఇళ్లకోసం 7300 కోట్లు అవసరమైతాయని, బడ్జెట్‌లో కేటాయింపుల్లేకుండా వాటిని ఎక్కడి నుంచి తెస్తారని శాసనమండలిలో ప్రతిపక్షనాయకులు షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్
హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండు బెడ్‌రూములతో ఇళ్లకోసం 7300 కోట్లు అవసరమైతాయని, బడ్జెట్‌లో కేటాయింపుల్లేకుండా వాటిని ఎక్కడి నుంచి తెస్తారని శాసనమండలిలో ప్రతిపక్షనాయకులు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. అసెంబ్లీలోని శాసనసభ పక్షకార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో కేటాయింపుల్లేకుండానే ఇళ్లు కట్టిస్తామంటే పేదలను మరోసారి మోసం చేయడమేనని విమర్శించారు. స్వచ్ఛ హైదరాబాద్‌కోసం గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్‌కు నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పచ్చి అబద్దమని విమర్శించారు.
నిధులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా ఖర్చు చేస్తారో చర్చించడానికి శాసనసభను సమావేశపర్చాలని, సవరణ బడ్జెట్‌ను ప్రతిపాదించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను డల్లాస్‌గా చేస్తామని, పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయనే భయంతో ప్రజలను మభ్యపెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు. డల్లాస్‌లో కేవలం 12 లక్షల జనాభా ఉందని, విస్తీర్ణం కూడా చాలా ఎక్కువన్నారు. హైదరాబాద్‌లో కోటి జనాభా ఉందని, విస్తీర్ణం తక్కువన్నారు. హైదరాబాద్‌లను డల్లాస్‌లాగా చేయడం పూర్తిగా అసాధ్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నదానిలో చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీని సమావేశపరిచి, సమగ్రంగా చర్చించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.