సాక్షి, హైదరాబాద్: జిత్తులమారి కరోనా గురించి రోజురోజుకూ కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అంచనాల ప్రకారం కరోనా వైరస్ గాల్లోంచి ఇతరులకు వ్యాపించేందుకు అవకాశముంది! అంతేకాదు. వ్యాధి వ్యాప్తి మొదలుకొని నివారణ వరకు డబ్ల్యూహెచ్‌ఓ ఇంకా ఎన్నో విషయాలను తన ‘సైంటిఫిక్ బ్రీఫ్’లో వెల్లడించింది. అవేమిటంటే..
ప్రత్యేక పరిస్థితుల్లోనే గాలి ద్వారా వ్యాప్తి
గతేడాది డిసెంబర్‌లో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా ఇప్పుడు ప్రపంచమంతటికీ పాత చుట్టమైపోయింది. లక్షల ప్రాణాలు బలిగొన్న ఈ మహమ్మారికి సంబంధించి కొత్తగా తెలిసిన విషయమేమిటంటే.. ఇది గాలి ద్వారా కూడా వ్యాపించగలదని! అమ్మో.. మరి బయటకు వెళ్లడమెలా? ఊపిరి కూడా పీల్చుకోలేమా? అన్న భయాందోళనలు వద్దు. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇది గాలి ద్వారా వ్యాపిస్తుందని ప్రపంచం మొత్తమ్మీద ఉన్న సుమారు 239 మంది శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా గుర్తించగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. ఆ ప్రత్యేక పరిస్థితులేమింటే..
- బహిరంగ ప్రదేశాల్లో గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశాల్లేవు.
- ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లలో కొన్ని రకాల వైద్య ప్రక్రియల కారణంగా అతి సూక్ష్మమైన తుంపర్లు (ఏరోసాల్స్) వెలువడే చోట్ల వ్యాపించేందుకు అవకాశముంది.
- గాలి,వెలుతురు సక్రమంగా లేని ప్రాంతాల్లో వైరస్ గాల్లోనే ఉండిపోవడం వల్ల ఇతరులకు సోకే అవకాశాలు ఎక్కువ.
- ఈ అంశంపై వీలైనంత తొందరగా ఇంకా విస్తృత పరిశోధనలు చేపట్టాల్సి ఉందని, వైరస్ వ్యాపించేందుకు గల అన్ని మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించాలని డబ్ల్యూహెచ్‌ఓ మూడు రోజుల క్రితం జారీచేసిన ‘సైంటిఫిక్ బ్రీఫ్’లో స్పష్టంగా పేర్కొంది. ఎప్పుడు? ఎలాంటి పరిస్థితుల్లో కరోనా కారక వైరస్ వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవడం ప్రజారోగ్య సంరక్షణకు, వ్యాధి వ్యాప్తి నిరోధానికి, నివారణకు చాలా కీలకమని స్పష్టంచేసింది. వైరస్ బారిన పడ్డవారితో సన్నిహితంగా మెలగడం, వారి ఊపిరి లేదా లాలాజలం ద్వారా ఏర్పడే తుంపర్లు వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణాలైనా.. కొన్ని ఇతర మార్గాల్లోనూ ఇతరులకు సోకవచ్చునని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. (ఒక్కరోజులో 72 వేలు)
వైరస్ వ్యాప్తి: ఆ రెండూ వేర్వేరు అంశాలు
దగ్గు, తుమ్ము, ఉచ్ఛ్వాసనిశ్వాసాల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందనేది అందరికీ తెలిసిందే. ఈ జీవ ప్రక్రియల ద్వారా వెలువడే తుంపర్లు గాల్లో ప్రయాణించి ఇతరుల శరీరాల్లోకి చేరి వ్యాధిని కలుగజేస్తాయి. మరి, గాలి ద్వారా కూడా వ్యాప్తిస్తుందన్న డబ్ల్యూహెచ్‌ఓ తాజా మార్గదర్శకాలేమిటి? రెండింటికీ తేడా ఉందంటున్నారు నిపుణులు. ఐదు మైక్రోమీటర్ల కంటే ఎక్కువ సైజున్నవి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందితే.. అంతకంటే తక్కువ సైజున్న సూక్ష్మజీవులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయన్నది తాజా అంచనా. క్షయకారక బ్యాక్టీరియా లేదా ఇతర ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమైన వైరస్‌లు దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు వ్యాపించవచ్చు. గాలి ద్వారా వ్యాపించే సూక్ష్మజీవులు ఆరు నుంచి తొమ్మిది అడుగుల దూరం వరకు ప్రయాణించగలిగితే.. తుంపర్ల ద్వారా బయటపడేవి దగ్గరిలోని ఉపరితలంపై ఉండిపోతాయి. (కరోనా కట్టడిలో ధారావి భేష్)
ఉపరితల పదార్థాన్ని బట్టి అవి కొన్ని నిమిషాల నుంచి గంటల వరకు అక్కడే ఉండిపోతాయి. ఇలా వైరస్‌లతో కూడిన ఉపరితలాన్ని ముట్టుకుని అదే చేత్తో ముక్కు, నోరును తాకినప్పుడు వైరస్ మనలోకి ప్రవేశిస్తుందన్నమాట. చేతులు అడ్డుపెట్టుకోకుండా ఎవరైనా తుమ్మినా, దగ్గినా వైరస్ ఇతరులకు సోకవచ్చు. కానీ ప్రాథమిక దశలోనే శరీర రోగనిరోధక వ్యవస్థ వీటిని అడ్డుకుంటే వ్యాధి బారినపడే అవకాశాలుండవని నిపుణులు చెబుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే.. కరోనా వైరస్ సోకిన వారంతా వ్యాధి బారిన పడతారని అనుకోవడం సరికాదు. గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించే కరోనా వైరస్ ముందుగా మంట/వాపు కలుగజేస్తుంది. ముక్కు.. అందులోని సైనస్ కండరాలు, గొంతు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ముక్కుదిబ్బడ, గొంతులో నొప్పి ఏర్పడతాయి. అయితే కొంతమందిలో కరోనా వైరస్ గుండె, మూత్రపిండాలు, నాడులపై కూడా దుష్ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌కు శరీరం స్పందించే తీరులో మార్పులు తేవడం ద్వారా కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారుతుంది.
వైరస్ వ్యాప్తికి చాలా దారులు..
డబ్ల్యూహెచ్‌ఓ జారీచేసిన సైంటిఫిక్ బ్రీఫ్ ప్రకారం కరోనా వ్యాప్తికి పలు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. రోగుల మల మూత్రాల్లో వైరస్ ఉన్నట్లు పలు అధ్యయనాలు ఇప్పటికే రుజువు చేసినప్పటికీ వీటి ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయని చెప్పేందుకు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలూ లేవు. గాలి ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించవచ్చునని కొన్ని అధ్యయనాల ద్వారా తెలిసిందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. రక్తంలోని ప్లాస్మాలో కరోనా వైరస్ ఉనికిని గుర్తించినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వైరస్ రక్తంలోనూ తన నకళ్లను తయారు చేసుకోగలదు. కానీ రక్తం ద్వారా వైరస్ ఇతరులకు సోకుతుందా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఆ అవకాశాలు తక్కువేనన్నది ప్రస్తుత అంచనా.
తల్లి ద్వారా బిడ్డకు కరోనా వైరస్ సంక్రమించే అవకాశాలు కూడా దాదాపు లేనట్లేనని, కాకపోతే ఇందుకు సంబంధించిన సమాచారం తక్కువగా అందుబాటులో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అయితే కరోనా బారినపడ్డ కొంతమంది తల్లుల స్తన్యంలో వైరస్ తాలూకు ఆర్‌ఎన్‌ఏ పోగులను శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. కానీ ఈ పోగులు పూర్తిస్థాయి వైరస్ మాత్రం కాదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గబ్బిలాల ద్వారా మనుషుల్లోకి ప్రవేశించిందని భావిస్తున్న కరోనా వైరస్ తిరిగి కుక్కలు, పిల్లులు, కొన్ని ఇతర జంతువులకు వ్యాపించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా వైరస్ సోకిన జంతువులు మళ్లీ మానవులకు వ్యాధిని వ్యాపింపజేస్తాయా? లేదా? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment