
రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో ఈసారి సార్వత్రిక పోరు హోరాహోరీగా సాగనుంది. ఉత్తర,దక్షిణ భారత దేశానికి చెందిన ఓటర్లు, విద్య,ఉద్యోగం,వ్యాపారం కోసం నగరానికి వచ్చి స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల వారితో మినీ ఇండియాను తలపిస్తోన్న శివార్లలో పలు నియోజకవర్గాల్లో గెలుగు గుర్రాలేవన్న అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆకాశహారŠామ్యలు ఒకవైపు..నిరుపేదల గుడిసెలు మరోవైపు..పారిశ్రామిక వాడలు ఒకవైపు...వాణిజ్య భవనాలు మరోవైపు..నాణేనికి రెండు పార్శ్వల్లా ఉన్న ఈ నియోజకవర్గాల్లో పేదాగొప్ప తారతమ్యం సుస్పష్టం అధ్వాన అంతర్గత రహదారులు, మురుగునీటి పారుదల సౌకర్యాల లేమి, ట్రాఫిక్ చిక్కులు, తాగునీటి సమస్య,పారిశ్రామిక కాలుష్యంతో సతమతమౌతున్నాయి.సమస్యలతో సహవాసం చేస్తున్న పలు కీలక శివారు నియోజకవర్గాల్లో రసవత్తరంగా మారిన ఎన్నికల పోరుపై ’సాక్షి’ అందిస్తోన్న గ్రౌండ్‌రిపోర్ట్...
ఎల్బీనగర్‌లో నువ్వా..నేనా..
ఏపీ నుంచి రాజధాని హైదరాబాద్ నగరానికి ప్రవేశించే గేట్‌వేలా ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి,టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీజేపీ తరఫున బరిలోకి దిగిన పేరాల శేఖర్‌రావు కూడా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి పథకాలు,నియోజకవర్గంలో 11 మంది కార్పొరేటర్లు తమ పార్టీ వారే కావడంతో తన గెలుపు ఖాయమని రామ్మోహన్ గౌడ్ భావిస్తున్నారు. టీడీపీ క్యాడర్ నుంచి పూర్తిసహకారం లభిస్తుండడం,గతంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి,అన్ని వర్గాలతో ఉన్న సత్సంబంధాలు తన గెలుపునకు దోహదం చేస్తాయని సుధీర్‌రెడ్డి విశ్వసిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పేరాల శేఖర్‌రావు భూత్,డివిజన్‌స్థాయి క్యాడర్‌పై ఆశలు పెట్టుకున్నారు. లింగోజిగూడా,నాగోలు,హయత్‌నగర్ సహా అన్ని డివిజన్లలో నెలకొన్న ముంపు సమస్యలు,ట్రాఫిక్ ఇక్కట్లు,కాలనీలకు మినీ బస్సు సర్వీసులు లేక ప్రజారవాణా అస్తవ్యస్తంగా మారడం వంటి సమస్యలు ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేయనున్నాయి.
ఉప్పల్ బరిలో గెలుపు ఎవరిదో....
పాతకొత్తల సమ్మేళనంగా నిలిచిన ఉప్పల్ నియోజకవర్గంలో ఈ సారి కీలక పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ తరఫున బరిలో ఉన్న భేతి సుభాష్‌రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బోలెడు ఆశలుపెట్టుకున్నారు. కూటమి పార్టీలో అనైక్యత, నాలుగేళ్లుగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం తనకు కలిసివస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక ప్రజా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి వీరేందర్‌గౌడ్ గతంలో తన తండ్రి దేవేందర్‌గౌడ్ చేపట్టిన అభివృద్ధి పథకాలు,బీసీ ఓట్లు తనవైపేనని భావిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ సెటిలర్స్ ఓట్లతోపాటు తాను వ్యక్తిగతంగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని విశ్వసిస్తున్నారు. గత పదేళ్లుగా టీడీపీ క్యాడర్‌నిర్వీర్యంకావడం,కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తల నుంచి సహకారం అంతంతమాత్రంగానే ఉండడం వీరేందర్‌గౌడ్‌కు ఇబ్బంది కరంగా మారింది.
కుత్బుల్లాపూర్‌లో ద్విముఖ పోటీ..
పారిశ్రామికవాడలు.. రసాయన బల్క్ డ్రగ్ కాలుష్యం,రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల నిలయం కుత్బుల్లాపూర్. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్, టీఆర్‌ఎస్ అభ్యర్థి కూన వివేక్‌గౌడ్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా ఉన్న సెటిలర్స్ ఓట్లపై ఇద్దరు నేతలు బోలెడు ఆశలుపెట్టుకున్నారు. టీఆర్‌ఎస్ సంక్షేమ,అభివృద్ధి పథకాలు,సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండడం, సౌమ్యునిగా పేరొందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి వివేక్ తన గెలుపును ఆకాంక్షిస్తున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో బల్క్‌డ్రగ్‌ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతోన్న కాలుష్యంతో అవçస్తలు పడుతున్న జనం, ఓపెన్‌నాలాలు, 450 కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైన్లు ఏర్పాటుచేసినప్పటికీ సగం పైపులైన్లలో తాగునీటి జాడలు లేకపోవడం,నీటినిల్వలు లేక అలంకార ప్రాయంగా మారిన రిజర్వాయర్లపై జనం అసంతృప్తిగా ఉన్నారు.
ఐటీ అడ్డాలో పాగా ఎవరిదో..
దేశ,విదేశాలకు చెందిన దిగ్గజ ఐటీ,బీపీఓ,కెపిఓ సంస్థలు,గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా,దేశ,విదేశీ అతిథులు,సెటిలర్స్‌తో మినీ ఇండియాగా..ఐటీఅడ్డాగా..సైబరాబాద్‌గా పేరొందింది శేరిలింగంపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ టీఆర్‌ఎస్ తరఫున బరిలో ఉన్నారు. తమ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండడం,పార్టీకి ఉన్న పది మంది కార్పొరేటర్ల సహకారంతో ప్రచారపర్వంలో ముందున్నారు. కూటమిలో కుమ్ములాటలు టీడీపీ అభ్యర్థి ఆనంద్‌ప్రసాద్‌కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ క్యాడర్ ఆయనకు పూర్తిస్థాయిలో సహకారం అందించడంలేదు.రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇక బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గజ్జెల యోగానంద్ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సెటిలర్స్ ఓట్లు,విద్యాధికుల ఓట్లు తనకేనన్న ధీమాతో ఉన్నారు.
కూకట్‌పల్లిలో ముగ్గురి యుద్ధం...
సెటిలర్స్ ఎక్కువ గా ఉండే∙ కూకట్‌పల్లి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు,ప్రజాకూటమి తరఫున చుండ్రు సుహాసిని,బీఎస్పీ తరఫున హరీష్‌రెడ్డిల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. టీఆర్‌ఎస్ సంక్షేమ అభివృద్ధి పథకాలు తనకు వరంగా మారతాయని టీఆర్‌ఎస్ అభ్యర్థి భావిస్తున్నారు. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పటికీ క్యాడర్,నేతల నుంచి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక కూటమి అభ్యర్థి చుండ్రు సుహాసిని అగ్రనేతల రోడ్‌షోలతో ప్రచార పర్వంలో ముందున్నప్పటికీ భూత్,డివిజన్ స్థాయిలో బలంగా లేకపోవడం ఇబ్బంది క రం. ఇక బీఎస్పీ అభ్యర్థి హరీష్‌రెడ్డి గత రెండునెలలుగా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయడం,టీఆర్‌ఎస్‌పార్టీలో అసంతృప్తులు తనకు సహకరిస్తారన్న ధీమాతో ఉన్నారు.
రాజేంద్రనగర్‌లో త్రిముఖ పోరు..
కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలు,కాటేదాన్ పారిశ్రామిక వాడ,చారిత్రక జంటజలాశయాలు నెలకొన్న ఈ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్,బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న తోకల శ్రీనివాస్ రెడ్డిల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ప్రకాశ్‌గౌడ్ భావిస్తున్నారు. పార్టీలో ఆయన అభ్యర్థిత్వంపై అసంతృప్తులు,క్యాడర్‌కు అందుబాటులో ఉండరన్న విమర్శలు ఆయనపై ఉ¯న్నాయి. బీజేపీ సీనియర్‌నేత బద్దం బాల్‌రెడ్డి వ్యక్తిగత ఇమేజ్‌తోపాటు యూపీ,బీహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల సెటిలర్స్ ఓట్లపై విశ్వాసం పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్ రెబెల్‌గా బరిలో ఉన్న తోకల శ్రీనివాస్‌రెడ్డి క్యాడర్‌లో ఉన్న సానుభూతి తనకు కలిసివస్తుంద ని భావిస్తున్నారు. ఈనియోజకవర్గంలో ప్రధానంగా జి.ఓ.111 ఎత్తివేయాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మల్కాజ్‌గిరి..రాజ్ ఎవరో..
ఉత్తర,దక్షిణభారత రాష్ట్రాలు,తెలుగురాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి వలసవచ్చినవారితో నిండిన ఈ నియోజకవర్గం మినీ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు,టీజేఎస్ అభ్యర్థి దిలీప్‌కుమార్,బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సంస్థాగతంగా టీఆర్‌ఎస్‌పార్టీ బలంగా ఉండడం,క్యాడర్ మద్దతు,గత నాలుగేళ్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పార్టీ కార్యకలాపాలు తన గెలుపును నల్లేరుమీద నడకప్రాయంగా మారుస్తాయని మైనంపల్లి హనుమంతరావు భావిస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా దూకుడుగా వ్యవహరిస్తారన్న విమర్శకూడా ఉంది. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు విద్యాధికుడు,గతంలో ఓడిపోయారన్న సానుభూతి,ఉత్తరాది సెటిలర్స్ ఓట్లు తనకు కలిసివస్తాయని ఆయన విశ్వసిస్తున్నారు. టీజేఎస్ అభ్యర్థి కపిలవాయి దిలీప్‌కుమార్ చివరిక్షణంలో ప్రచారంలో పుంజుకున్నారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్,టీడీపీ శ్రేణులు ఆయనకు సహకరిస్తున్నాయి. అయితే ఆయన పార్టీ గుర్తుకు సరైన ఆదరణ లేకపోవడం ,పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేకపోవడం ఆయనకు మైనస్‌పాయింట్‌గా మారింది.