విద్యార్థిని ఎందుకు డిమోట్‌ చేయడం లేదు? | why Dimot the student is not doing? | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఎందుకు డిమోట్‌ చేయడం లేదు?

Published Fri, Oct 13 2017 1:35 AM | Last Updated on Fri, Oct 13 2017 4:00 AM

why Dimot  the student is not doing?

సాక్షి, హైదరాబాద్‌: ఓ చిన్నారిని ఒకటవ తరగతిలో కాకుండా నేరుగా రెండో తరగతిలో చేర్చుకోవడంపై వివరణ ఇవ్వాలని ఉమ్మడి హైకోర్టు గురువారం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) యాజమాన్యాన్ని ఆదేశించింది. రెండో తరగతిలో చేరిన తమ చిన్నారి ఆ పాఠాలను నేర్చుకోలేకపోతోందని, అందువల్ల ఒకటో తరగతికి డిమోట్‌ చేయాలన్న చిన్నారి నానమ్మ చేసిన అభ్యర్థనను తిరస్కరించడంపై వివరణ ఇవ్వాలంది. తదుపరి విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజ్‌ గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో తరగతిలో చేరిన తమ చిన్నారి ఆ తరగతి పాఠాలను చదవలేకపోతోందని, అందువల్ల ఆ చిన్నారిని ఒకటో తరగతికి డిమోట్‌ చేయాలంటూ తాము చేసిన అభ్యర్థనను హెచ్‌పీఎస్‌ యాజమాన్యం తిరస్కరించడంపై కొమిరెడ్డి అద్వేత్య నానమ్మ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి పిటిషన్‌ను కొట్టేశారు. పిటిషనర్‌ కోరిక మేరకే రెండో తరగతిలో ప్రవేశం కల్పించామని హెచ్‌పీఎస్‌ యాజమాన్యం చెప్పడంతో దానిని పరిగణనలోకి తీసుకుంటూ న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై అద్వేత్య నానమ్మ ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఆ చిన్నారి భవిష్యత్తును, హక్కులను దృష్టిలో పెట్టుకుని ఈ కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. ఆ చిన్నారిని ఎందుకు ఒకటో తరగతికి డిమోట్‌ చేయడం లేదో చెప్పాలని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement