హైవేపై నిత్యం నెత్తుటి మరకలు అంటుతూనే ఉన్నాయి.. దీనికి సమీపంలోని స్టేజీలు, మలుపుల వద్ద ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి.. దీనిపై ప్రయాణం చేయడానికి భయపడే రోజులు దాపురిస్తున్నాయి.. ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లి వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం ఏడుగురిని కబలించిన విషయం విదితమే.. ఈఘటన జాతీయ రహదారి నిర్వహణకు సంబంధించి కొత్త అనుమానాలకు తావిస్తోంది.. - అడ్డాకుల
అడ్డాకుల: ఇంతకుముందు రెండు రోడ్లకు మధ్యన ఉన్న కల్వర్టు కాస్తా ఎత్తుతో ఉండటంతో వేగంగా వెళ్లే వాహనాలు అదుపుతప్పినా అదే రోడ్డులో బోల్తాపడేవి. దీనివల్ల అదుపుతప్పిన వాహనం మాత్రమే ప్రమాదానికి కారణమయ్యేది. అయితే ఇటీవల హైవేపై మళ్లీ కొత్తగా తారురోడ్డు వేశారు. సుమారు 10సెంటీమీటర్ల మందం వరకు కొత్తగా వే శారు. తద్వారా కొత్త రోడ్డు కొంత ఎత్తు పెరిగినట్లయింది. దీంతో ఇంతకుముందు ఉన్న డివైడర్ ఎత్తు తగ్గిపోయింది. దీంతో వాహనాలు అదుపుతప్పితే డివైడర్‌ను ఎక్కడం సులభవుతోందని వివిధ వాహన డ్రైవర్లు చెబుతున్నారు.
కొమిరెడ్డిపల్లి వద్ద టవేరా అదుపుతప్పినప్పుడు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ తక్కువ ఎత్తులో ఉండటం వల్లే సులభంగా పెకైక్కి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో మరోసారి రోడ్డు నిర్వహణపై చర్చ మొదలైంది. గతంలో పాలెం వద్ద వోల్వో బస్సు కల్వర్టును ఢీకొన్నప్పుడు కల్వర్టు నిర్మాణంపై పెద్దఎత్తున దూమారం చెలరేగింది. ఆ తర్వాత సదరు రోడ్డు నిర్వహణ సంస్థ తమ పరిధిలోని కల్వర్టుల వద్ద మరమ్మతు చేపట్టారు. మళ్లీ ఇప్పుడు కొమిరెడ్డిపల్లి వద్ద టవేరా డివైడర్‌ను సులువుగా దాటి పక్కరోడ్డు పైకి దూసుకెళ్లడంతో వాహనచోదకులు ఆందోళన చెందుతున్నారు.
ఇంతకుముందు డబుల్‌లైన్ రోడ్డు ఉన్నప్పుడు మాత్రమే ఎదురెదురుగా వాహనాలు ప్రమాదాలకు గురయ్యేవి. కాని నాలుగు లైన్ల రోడ్డు వేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు వాహనాలు ఎదురెదురుగా ప్రమాదాలకు గురవడం అందరినీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కొమిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న కోళ్లఫారాల వద్ద రాత్రివేళ ఇసుక డీసీఎంలు డివైడర్‌పై దాటి రోడ్డును క్రాస్ చేస్తుండటం దీనికి బలం చేకూరుస్తోంది. పాతరోడ్డుపై కొత్తగా తారు వేసేటప్పుడు డివైడర్ ఎత్తును కొంత పెంచి ఉంటే ఒక రోడ్డుపై అదుపుతప్పే వాహనాలు మరోదానిపైకి దూసుకెళ్లే అవకాశాలు ఉండవని వారు అభిప్రాయపడుతున్నారు.
ఫలితమివ్వని నివారణ చర్యలు
హైవే సమీపంలోని స్టేజీలు, మలుపుల వద్ద ప్రమాదాల నివారణకు సదరు రోడ్డు నిర్వాహణ సంస్థ చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడంలేదు. జాతీయ రహదారి 44 నంబర్‌పై వేముల, మూసాపేట, అడ్డాకుల, అచ్చాయపల్లి, చక్రాపూర్ స్టేజీల వద్ద వాహనాలు రోడ్డు క్రాస్ చేసే సమయంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్టేజీల వద్ద ముఖ్యంగా ద్విచక్రవాహనాలే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి.
రోడ్డు క్రాస్ చేసేటప్పుడు పక్కరోడ్డుపై వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితుల బంధువులు రాస్తారోకోలు, ధర్నాలు చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే సదరు స్టేజీల వద్ద ప్రమాదాల నివారణకు రోడ్డు నిర్వహణ సంస్థ కూడా చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. అడ్డాకుల వద్ద డివైడర్‌పై ఎక్కడపడితే అక్కడ మనుషులు రోడ్డు దాటకుండా రక్షణ కంచె సైతం ఏర్పాటు చేయించారు.