
మా పరీక్ష మాదే..
రాష్ట్రంలో విద్యార్థులకు తెలంగాణ ఎంసెట్ ఉంటుందని.. త్వరలోనే అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
* త్వరలో సెట్స్ తేదీలు ప్రకటిస్తాం: మంత్రి జగదీశ్‌రెడ్డి
* అడుగడుగునా తప్పులు చేస్తున్నది ఏపీ ప్రభుత్వమే.. సమస్యలు సృష్టిస్తున్నది చంద్రబాబే
* ఏపీలో రుణమాఫీ వైఫల్యం, రాజధాని భూముల గొడవను పక్కకు నెట్టే ప్రయత్నం
* సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వివాదం
* దొంగే దొంగ.. దొంగ అన్నట్లుంది వారి వైఖరి
* చట్టం ప్రకారం ఉమ్మడి పరీక్షల నిర్వహణ అధికారం మాదే
* ఏపీ కోరితే వారికి కూడా నిర్వహించేందుకు మేం సిద్ధం
* గవర్నర్ నరసింహన్‌కు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశామని వెల్లడి
* రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు లోగో ఆవిష్కరణ
* ‘తెలంగాణ ఎంసెట్’పై న్యాయపోరాటం చేయాలని ఏపీ సర్కారు నిర్ణయం
* ఏపీ ఉన్నత విద్యా మండలి తరఫున కూడా పిటిషన్లు వేయాలని యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులకు తెలంగాణ ఎంసెట్ ఉంటుందని.. త్వరలోనే అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ నరసింహన్‌కు కూడా ఇదే విషయాన్ని చెప్పామని ఆయన తెలిపారు. ఈ విషయంలో సమస్యలు సృష్టిస్తూ, గందరగోళంలో పడేస్తున్నది చంద్రబాబేనని విమర్శించారు. ఏపీ రాజధానికి భూసేకరణపై అక్కడి ప్రజల ఆగ్రహం, రుణమాఫీ వైఫల్యం నుంచి వారి దృష్టిని మళ్లించడానికే ఎంసెట్ విషయంలో కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
తాము చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నామని, ఆంధ్రప్రదేశ్ కోరితే వారికి కూడా నిర్వహించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు లోగోను సోమవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ అధికారం తెలంగాణదేనని.. అందుకే జీవో జారీ చేశామని మరోసారి స్పష్టం చేశారు. చట్టంలోని నిబంధనల మేరకు 15 శాతం ఓపెన్ కోటాలో తెలంగాణ విద్యార్థులతోపాటు ఏపీ విద్యార్థులకు పదేళ్ల పాటు అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. అందుకోసం ఏపీ ప్రభుత్వ ప్రతినిధికి ప్రవేశాల కమిటీలో ప్రాతినిధ్యం కల్పించామని చెప్పారు. అయినా ఏపీ నేతలు మూర్ఖంగా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. 60 ఏళ్లుగా కూడా ఇదేపని చేశారని.. రాష్ట్ర విభ జన తరువాత కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
తప్పులన్నీ వారివే...
ఎంసెట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కావాలని రాద్ధాంతం చేస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా ఏపీ వైఖరి ఉందని ధ్వజమెత్తారు. వారే షెడ్యూల్ విడుదల చేసి, వారే గవర్నర్‌కు ఫిర్యాదు చేసి తప్పులమీద తప్పులు చేస్తున్నారని... ఇది ప్రజ లకు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాలకు కలిపి పరీక్ష నిర్వహిద్దామనుకునేవారు ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిం చారు. తాము చట్టం ప్రకారమే ముందుకు వెళ్తున్నామని, చట్టానికి విరుద్ధంగా ఉంటే కేంద్రం, కోర్టులు జోక్యం చేసుకుంటాయని పేర్కొన్నారు.
పక్కదోవ పట్టించేందుకే..
ఏపీ ఉన్నత విద్యా మండలి ఇచ్చిన షెడ్యూల్ తమకు తెలియదని ఏపీ ప్రభుత్వ నేతలు అంటున్నారని, ప్రభుత్వానికి తెలియకుండా మండలి ఎలా షెడ్యూల్ జారీ చేస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి నిలదీశారు. ఇంటర్ బోర్డు విషయంలోనూ అలాగే మొండిగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలుసునని.. సమస్యలు సృష్టిస్తూ, గందరగోళంలో పడేస్తున్నది చంద్రబాబేనని మంత్రి విమర్శించారు. ఏపీ రాజధానికి భూసేకరణపై అక్కడి ప్రజల ఆగ్రహం, రుణమాఫీ వైఫల్యం నుంచి వారి దృష్టిని మళ్లించడానికే ఎంసెట్ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ప్రతిదానికి గొడవ సృష్టిస్తున్నారని విమర్శించారు. మరోవైపు వేరుగా ఎంసెట్ నిర్వహించుకుంటామని తెలంగాణ స్పష్టం చేయడంతో... దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు సూచనల మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉన్నత విద్యామండలి తరపున కూడా వేరుగా పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఇక తెలంగాణ వైఖరిపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గవర్నర్‌తో భేటీ..
ఇంటర్‌బోర్డు లోగో ఆవిష్కరణ అనంతరం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో, రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో మంత్రి జగదీశ్‌రెడ్డి వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వైఖరిని గవర్నర్‌కు మరోసారి స్పష్టం చేసినట్లు చెప్పారు. తాము విభజన చట్టం ప్రకారమే ముందుకు వెళుతున్నామని చెప్పామని... ప్రతి విషయాన్ని సమస్యగా మార్చుతున్నదీ ఏపీ ప్రభుత్వమేనని వివరించామని తెలిపారు.
కాగా.. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో సంస్కరణలు తెస్తోందని.. రాష్ట్రంలోనూ అదే తరహాలో సంస్కరణలు తీసుకురానున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో జరుగనున్న రాష్ట్రాల విద్యా శాఖ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు జగదీశ్‌రెడ్డి సోమవారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా తమ రెగ్యులర్ చదువుతో సంబంధం లేకుండా ఇష్టమైన కోర్సు చేసేందుకు తోడ్పడేలా... ‘చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం’ను అమలు చేస్తామని మంత్రి చెప్పారు. దీనిపైనే ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు.