
మధిర రూరల్: తన అనుమతి లేకుండా ప్రభుత్వ ప్రకటనలో ఫొటోలు ప్రచురించడమే కాకుండా తన భర్త ఫొటోనుకూడా మార్చి వేశారని నాయకుల పద్మ అనే బాధితురాలు వాపోయారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రకటనలో వేరొకరి భార్యగా చూపించి తమ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిరలో పద్మ తన భర్త నాగరాజుతో కలసి విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. తమది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్రాయి అని తెలిపారు. కుటుంబ పోషణ నిమిత్తం పాత బట్టలు కుట్టి అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తామన్నారు.
యాదగిరి సమీపంలో ఉన్న కొంగవల్లి గ్రామం లో ఉంటున్న సమ యంలో మూడేళ్ల క్రితం కొందరు వచ్చి ప్రభుత్వ అధికారులమని, లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఫొటో లు తీసుకున్నారని తెలి పారు. కొన్ని రోజుల కిందట.. ‘మేము కాపు సారా కాసేవారమని, అది తాగుతామని, ఇప్పుడు సారా కాయడం నిలిపివేసి కుటుంబంతో ఆనం దంగా బతుకుతున్నాం’అని తన భర్తతో ఉన్న ఫొటో తొలిసారిగా పేపర్‌లో ప్రకటనగా వచ్చిం దన్నారు.
అప్పుడు కొందరు చెబితే తాము పట్టించుకోలేదని చెప్పారు. ఆ తర్వాత రైతు బంధు పథకంలోనూ తమ కుటుంబ సభ్యులతో కూడిన ఫొటోలను పెట్టి తమకు పొలం ఉందని, రూ.4వేలు సర్కారు ఇస్తోందని, అందుకు ఆనందంగా ఉన్నామని మరో ప్రకటన ఇచ్చారని తెలిపారు. రైతుబీమా పథకంలో తమ కుటుంబ ఫొటోను ఉపయోగించారన్నారు. తాజాగా కంటి వెలుగులో భాగంగా ఈనెల 14న అన్ని దినపత్రికల్లోని ప్రధాన పేజీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో తన ఫొటో వేశారని, పక్కన తన భర్త ఫొటోకు బదులు మరొక వ్యక్తి ఫొటోను ప్రచురించారని ఆరోపించారు.
ఈ ప్రకటనను చూసి ప్రతి ఒక్కరూ గేలిచేసి మాట్లాడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అత్తమామలు, గ్రామస్తుల సూటి పోటి మాటలతో తలెత్తుకు తిరుగలేకపోతున్నానని వాపోయారు. ఆమె భర్త నాగరాజు మాట్లాడుతూ.. తాను అసలు మందే తాగనని, కాపుసారా కాయనని తెలిపారు. తమకు పొలంకూడా లేదని, కేవలం రేషన్, ఆధార్ కార్డులే ఉన్నాయని, సెంటు భూమీ లేకపోయినా రైతుబంధు చెక్కులు అందుకున్నట్లుగా ప్రకటన వేశారన్నారు. తన భార్య పక్కన మరొక వ్యక్తి ఫొటోను ఉంచి కంటి వెలుగు ప్రకటనలో చూపించారని నాగరాజు ఆరోపించారు. పద్మ దంపతులు ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు.