
లోన్ అంటూ చైన్ కొట్టేశాడు
గోల్నాక : లోన్ వచ్చిందంటూ చైన్ కొట్టేశాడు ఓ మాయగాడు. ఈ సంఘటన హైదరాబాద్ నాచారం పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ అంబర్పేట్లోని అనంతరామ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ శనివారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గుడికి వెళ్లి వస్తోంది. ఇంతలో బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ఆమె దగ్గర ఆగి 'మీ ఆయన నాకు బాగా తెలుసు. మీకు ఎల్.ఐ.సి లోన్ వచ్చింది. ఆఫీసుకు వస్తే లోన్కి సంబంధించిన పత్రాలు తీసుకుని వెళ్లొచ్చు' అని నమ్మబలికాడు. అతడు చెప్పింది నిజమని నమ్మి ఎంచక్కా బైక్ ఎక్కి చలో అంది ఆ మహిళ. అంబర్‌పేట నుంచి ఆమెను నాచారం పరిధిలోని మల్లాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఓ ఇంటి ముందు ఆపి... ఇదే కార్యాలయం, వెళ్లి పత్రాలు తీసుకురండి అని చెప్పాడు. సరే అని ఆమె లోపలికి వెళ్లబోతుండగా... 'ఆగండాగండి, మీ మెడలో మంగళసూత్రం ఉంటే లోన్ ఇవ్వకుండా నిలిపివేయొచ్చు, అది తీసి ఇలా ఇవ్వండి' అని చెప్పాడు. అప్పుడు కూడా ఆమెకు అనుమానం రాలేదు, అతను చెప్పినట్టే చేసింది. అంతే...క్షణాల్లో మంగళసూత్రంతో బైక్‌పై తుర్రుమన్నాడు ఆగంతకుడు. నిండా మోసపోయానని అప్పటికి గ్రహించిన సదరు వివాహిత కళావతి అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.