- ప్రభుత్వ తీరుపై విపక్షాల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకాల అమలులో ఎలాంటి పురోగతి లేకపోయినా, ప్రభుత్వం ప్రచారం ఎక్కువ చేసుకుంటోంది. ఇదేదో బ్రహ్మపదార్థమంటూ ప్రజలను భ్రమల్లో ముంచుతోంది. వాటర్ గ్రిడ్ ద్వారా మూడేళ్లలో ఇంటింటికి నీళ్లు ఇస్తామని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని సీఎం కేసీఆర్ అంటున్నారు.. అదీ సాధ్యం కాదు.. ఇదీసాధ్యం కాదు’ అని టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి పేర్కొన్నారు.
‘ఓ వైపు రాష్ట్రంలో ప్రజలు తాగునీరందక అవస్థలు పడుతుంటే .. వాటర్ గ్రిడ్ నిర్మించి మూడేళ్ల తర్వాత నీళ్లిస్తామనడం.. ఆకలితో ఉన్నవారికి కారంతోనైనా అన్నం పెట్టకుండా మూడేళ్ల తర్వాత బిర్యానీ పెడతాం’ అన్నట్టుగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. శాసనమండలిలో సోమవా రం బడ్జెట్‌పై నిర్వహించిన చర్చలో.. కొత్త పథకాల అమలులో జాప్యం, గత బడ్జెట్‌లో కేటాయింపుల్లో 43శాతానికి మించని ఖర్చు లు, తాజా బడ్జెట్‌లో లోపించిన వాస్తవికత తదితర అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎండగట్టాయి.
వాటర్ గ్రిడ్‌పై ప్రభుత్వ హామీని నెరవేరుస్తామని, ఒకవేళ నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ అంశాన్ని విపక్షాలు ఓ ఆయుధంగా వాడుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విపక్షాలకు సలహాఇచ్చారు. అధ్యయన కమిటీ ల పేరుతో కేజీ టు పీజీ ఉచిత పథకం అమలును ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ తప్పుపట్టారు. గతంలో హేతుబద్ధీకరణ జరిపి ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, మళ్లీ ప్రభుత్వం అందుకు సిద్ధమైందని ఆరోపించారు.
కడియం శ్రీహరి సమాధానమిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని సరిచేసేందుకే ఉపాధ్యాయుల హేతబద్ధీకరణ చేపడుతామని, ఒక్క పాఠశాలను మూసివేయమని చెప్పారు. కార్పొరేట్ విద్య, వైద్య విధానాన్ని రద్దు చేసి ఆ సంస్థలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కె.దిలీప్‌కుమార్ సూచించారు. ప్రమాదాలపై ఏర్పాటు చేసే ఎంక్వైరీ కమిటీ చట్టం కింద మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం కోసం రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కి చట్టబద్ధత లేదని షబ్బీర్ విమర్శించారు.ఈ కమిటీ సిఫారసులు చెల్లుబాటు కావన్నారు.