30 మందికి మించకుండా కార్యవర్గం
టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ కార్యవర్గాన్ని 30 మందికి మించకుండా ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గం అంతా కలిపి 30 లోపు ఉండేలా చూస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ముసాయిదా జాబితా కూడా సిద్ధమైందని సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో చెప్పారు. ప్రభుత్వంపై పోరాటం, ఇతర కార్యక్రమాల వల్ల కార్యవర్గం ఏర్పాటులో జాప్యం జరిగిందని, త్వరలోనే పూర్తిచేస్తామన్నారు.
ఏఐసీసీలో బాధ్యతల కోసం టీపీసీసీ నుంచి జాబితాను అడిగారని ఉత్తమ్ వెల్లడించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి 8 మంది పార్టీ నేతలు ఆసక్తితో ఉన్నారని, వారి బలాబలాలపై సర్వే జరుగుతోందన్నారు. భట్టి విక్రమార్క వరంగల్ టికెట్‌ను అడగడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మాజీ ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అభ్యర్థిత్వంపైనా చర్చ జరగలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 17న కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. 18 నుంచి 30 వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో టీపీసీసీ నేతలు పాదయాత్రలు చేస్తారని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీనికి నిరసనగా నియోజకవర్గ కేంద్రాల్లో 4న ధర్నాలను నిర్వహిస్తున్నామన్నారు. కాగా, సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి ..ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. నాటక ప్రదర్శనకు ఆహ్వానించడానికే ఆయనను కలిశానని చెప్పారు.
ఆందోళనలకు టీ పీసీసీ పిలుపు
లోక్‌సభలో తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ టీ పీసీసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్రం విధానాలను ఎండగట్టేలా మంగళవారం దీక్షలు, ధర్నాలు చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించింది.