
ఆత్మకూరు(ఎం): టాంజానియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్.ఎం మండలం కొరటికల్‌వాసి దుర్మరణం పాలయ్యాడు. కొరటికల్ గ్రామానికి చెందిన సోలిపురం రాంరెడ్డి–రమణమ్మ దంపతుల కుమారుడు రాజశేఖరరెడ్డి(24) నాలుగేళ్లుగా ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలో బోరువెల్ వాహనంపై డ్రైవర్ కమ్ డ్రిల్లర్‌గా పనిచేస్తున్నాడు. బోరు బావి డ్రిల్లింగ్‌కోసం మంగళవారం ఉదయం 5 గంటలకు దారుస్సలేం వెళుతుండగా ఎదురుగా కంటెయినర్ వాహనం వచ్చి బోరుబండిని ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బోర్‌వెల్ వాహనం ఆయిల్ ట్యాంకర్ పేలి మంటలంటుకున్నాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో 2 వాహనాలు పూర్తిగా కాలిపోగా.. రాజశేఖరరెడ్డి, కంటెయినర్ డ్రైవర్ కూడా మంటల్లో సజీవ దహనం అయ్యారు. రాజశేఖరరెడ్డి మృతి వార్తను అక్కడే మరో బోరువాహనంపై పనిచేస్తున్న ఓ సూపర్‌వైజర్ కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. రాజశేఖర్ మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.