‘మహా’భాగ్యం | Year Roundup On HMDA Devolopment | Sakshi
Sakshi News home page

‘మహా’భాగ్యం

Published Fri, Dec 28 2018 11:05 AM | Last Updated on Fri, Dec 28 2018 11:05 AM

Year Roundup On HMDA Devolopment - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థకు లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) రూపంలో ఈ ఏడాది దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయం చేకూరింది. ఈ సంస్థ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు కొన్ని నింపాదిగా నడుస్తుండగా, మరికొన్ని పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్‌ సమస్యను నిలువరించేందుకు మంగళ్‌పల్లి, బాటాసింగారంలో లాజిస్టిక్‌ పార్కులు, బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పనులు నింపాదిగా సాగుతున్నాయి. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఆదాయంలో దాదాపు రూ.500 కోట్లతో శివారు ప్రాంతాల్లోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు కొన్ని పూర్తవగా, మరికొన్ని శరవేగంగా సాగుతున్నాయి. 

ఈ ఏడాది పూర్తికావాల్సి ఉన్నా..
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విజయవాడ జాతీయ రహదారి పక్కన బాటసింగారం వద్ద 40 ఎకరాల్లో రూ.35 కోట్లు, మంగళ్‌పల్లి వద్ద 22 ఎకరాల్లో రూ.20 కోట్ల అంచనాలతో ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో లాజిస్టిక్‌ పార్క్‌లు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పెద్ద పెద్ద ట్రక్కులు, ఇతర సరుకు రవాణ వాహనాలు నగరంలో ప్రవేశించకుండా అక్కడ ఏర్పాటు చేసే గోడౌన్లలో ఖాళీ చేసే వీలు కలుగుతుంది. ఆయా సరుకులను మినీ ట్రక్కుల ద్వారా ఆయా కేంద్రాలకు చేరుస్తారు. దీంతో నగరంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలకు వివిధ మార్గాలలో లారీల రాకపోకలను నగరం బయటే నియంత్రించే వీలుంది. అంతే కాకుండా మినీ ట్రక్కుల ఉపయోగం వల్ల కొన్ని వేలమందికి ఉపాధి దొరుకుతుంది. అయితే ఈ లాజిస్టిక్‌ పార్కు పనులు పూర్తికావల్సి ఉన్నా పనులు మాత్రం నింపాదిగా సాగుతుండటం అధికారుల ఆలసత్వానికి నిదర్శనంగా మారింది.

నత్తనడకన బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పనులు ..
నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలను తప్పించే బాలానగర్‌ నర్సాపూర్‌ ఎక్స్‌ రోడ్డులో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడం కోసం హెచ్‌ఎండీఏ రూ.384 కోట్లతో బాలానగర్‌లోని శోభన థియేటర్‌ నుంచి ఐడీపీఎల్‌ వరకు 1.09 కి.మీ. పొడవునా ఆరులేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ఏడాది క్రితం మొదలుపెట్టింది. ఈ ఫ్లైఓవర్‌ కోసం ఎనిమిది ఎకరాల 20 గుంటలు (33,175 చదరపు మీటర్ల) స్థలంలో 59 ప్రాపర్టీలకు నష్టం కలుగుతోంది. ఈ ఫ్లైఓవర్‌ అంచనా వ్యయం రూ.104.53 కోట్లవుతుండగా, భూసేకరణ కోసం రూ.265 కోట్లను హెచ్‌ఎండీఏ చెల్లిస్తోంది. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం ఆహ్వానించిన టెండర్‌ను బీఎస్‌సీపీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ దక్కించుకుంది. అయితే భూసేకరణలో ఇబ్బందులు ఎదురవుతుండడంతో పనులు నింపాదిగా జరుగుతున్నాయి.

శివారు మౌలిక వసతులకు ప్రాధాన్యం
నగరశివారు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధిలో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) భాగస్వామ్యం అవుతోంది. తద్వారా శివారుల్లో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా హెచ్‌ఎండీఏకు వచ్చిన రూ.1,000 కోట్ల ఆదాయంలో దాదాపు రూ.500 కోట్లు ప్రజల మౌలిక వసతులకు ఖర్చుబెడుతున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల స్థానిక సంస్థల నుంచి వస్తున్న దరఖాస్తులను పరిశీలించిన తర్వాత పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.10 కోట్లు, పటాన్‌చెరులో రూ.మూడు కోట్లతో రహదారుల విస్తరణ, డ్రైనేజీ, సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల వసతుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. సంగారెడ్డి పట్టణంలో రూ.6.59 కోట్లతో రెండు కి.మీ. మేర రోడ్డు విస్తరణ పనులు, డ్రైనేజీ ఏర్పాటు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు చేస్తున్నారు. రూ1.09 కోట్లతో 2.6 కి.మీ. మేర రిచ్‌–1 సెంట్రల్‌ మీడియన్‌ పనులను, రూ.1.09 కోట్ల వ్యయంతో 2.6 నుంచి 5.4 కిలోమీటర్ల మేర రిచ్‌–2  సెంట్రల్‌ మీడియన్‌ పనులు చేస్తున్నారు. 5.5 కి.మీ. మేర సెంట్రల్‌ మీడియన్‌లో రూ.1.34 కోట్లతో వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. నందిగామ గ్రామంలో రూ.48 లక్షల వ్యయంతో 400 మీటర్లు డ్రైనేజీ లైన్, 1.3 కి.మీ. మేర సీసీ రోడ్డు పనులు చేస్తున్నారు. రూ.3.59 కోట్లతో అమీన్‌పూరాలో రోడ్డు పనులు ఊపందుకున్నాయి. రూ.15 కోట్లతో భువనగిరి మున్సిపాలిటీల్లో సెంట్రల్‌ మీడియన్‌ నిర్మాణం, నాలుగు కి.మీ. మేర సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు పనుల్లో వేగం పెరిగింది. రూ.5 కోట్లతో చౌటుప్పల్‌లో రూ.56 కోట్లతో కుంట్లూరులో డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.6.80 కోట్లతో కిస్మత్‌పూర బ్రిడ్జి, రూ.6.50 కోట్లతో హుస్సేన్‌సాగర్‌ కూకట్‌పల్లి కాలువ వద్ద ఐ అండ్‌ వో స్ట్రక్చర్, రూ.7.50 కోట్లతో లక్ష్మీగూడ నుంచి శంషాబాద్‌ వరకు ఉన్న రేడియల్‌ రోడ్డు మార్గంలో అసంపూర్తిగా ఉన్న కిలోమీటర్‌ మేర పనులను చేపట్టింది. రంగారెడ్డి జిల్లాలో తొర్రూరులోని ఇంజాపూర్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి వై జంక్షన్‌ వరకు బీటీ రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.2.95 కోట్లను మంజూరు చేసింది. రూ.5 కోట్లతో పటాన్‌చెరులో ట్రక్కు పార్కింగ్‌ పనులు పూర్తయ్యాయి.

కోట్లు కురిపించిన ప్లాట్ల వేలం  
హెచ్‌ఎండీఏ ప్లాట్ల ఆన్‌లైన్‌ వేలం కోట్ల వర్షం కురిపించింది. 211 ప్లాట్లకు నిర్వహించిన వేలంలో హెచ్‌ఎండీఏకు దాదాపు రూ.380 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా మాదాపూర్‌లో గజానికి రూ.1,52,000 పలుకగా, షేక్‌పేటలో రూ.1,11,700, సరూర్‌నగర్‌ రెసిడెన్సియల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో రూ.73,000, మియాపూర్‌లో రూ. 73,000 పలికింది. హెచ్‌ఎండీఏ నిర్ధారించిన అప్‌సెట్‌ ధరను మించి రెండింతలు, మూడింతల ధరను కోట్‌ చేసి కొనుగోలుదారులు సొంతం చేసుకోవడంతో అధికారులు ఊహించిన రూ.250 కోట్ల కన్నా మరో రూ.130 కోట్లు ఎక్కువగా వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ ద్వారా వేలంలో అత్తాపూర్‌ రెసిడెన్సియల్‌ లే అవుట్, అత్తాపూర్‌ ముష్క్‌ మహల్‌ రెసిడెన్సియల్‌ కాంప్లెక్స్‌లోనూ గజానికి రూ.1,42,000 పైనే పలికింది. దాదాపు రూ.600 కోట్ల ఆదాయం సమకూరే ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్ల ఆన్‌లైన్‌ వేలంలో సాంకేతిక కారణాలతో నిలిపివేశారు. అలాగే లేఅవుట్, భవన నిర్మాణ అనుమతుల ద్వారా సంస్థకు నెలకు దాదాపు రూ.25 కోట్ల చొప్పున హెచ్‌ఎండీఏ ఖజానాకు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement