అత్త దశదినకర్మలకు హాజరైన ఓ యువకుడు తిరుగుప్రయాణంలో రైలు ఎక్కబోయి జారిపడి దుర్మరణం పాలైన సంఘటన మానుకోట రైల్వేస్టేషన్‌లో శుక్రవారం జరిగింది.
అత్త దశదిశన కర్మకు హాజరై వెళుతుండగా ప్రమాదం
ప్రసాద్‌కు భార్య,ఇద్దరు కుమారులు
మహబూబాబాద్ రూరల్ : అత్త దశదినకర్మలకు హాజరైన ఓ యువకుడు తిరుగుప్రయాణంలో రైలు ఎక్కబోయి జారిపడి దుర్మరణం పాలైన సంఘటన మానుకోట రైల్వేస్టేషన్‌లో శుక్రవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, జీఆర్పీ డోర్నకల్ ఎస్సై పెండ్యాల దేవేందర్ కథనం ప్రకారం... హన్మకొండ కలెక్టరేట్ సమీపంలో నివాసముండే ఏలియా కుమారుడు ల్యాదెళ్ల ప్రసాద్(27) మానుకోటలో చిన్ననీటిపారుదల శాఖలో పనిచేస్తున్నాడు. తన అత్త నెల్లి ఎల్లబాయి కర్మలకు హాజరయ్యేందుకు శుక్రవారం కుటుంబ సభ్యులతో మానుకోటకు వచ్చాడు.
కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వరంగల్ వెళ్లేందుకు మానుకోట రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రాగానే బంధువులు, కుటుంబ సభ్యులను ఎక్కించాడు. ఇంతలోనే రైలు కదలడంతో రన్నింగ్‌లోనే ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో పడ్డాడు. రైలు అలాగే ముందుకు కదలడంతో ప్రసాద్ కాళ్లు, ఎడమ చేయి విరిగిపోయాయి. తలకు బలమైన గాయమైంది. గుర్తించిన జీఆర్పీ పోలీసులు, ప్రయాణికులు రైలును నిలిపివేసి ప్రసాద్‌ను ఏరియా ఆస్పత్రికి తరలించారు.
తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో ప్రసాద్ మృతిచెందాడు.మృతుడికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది వయసున్న చిన్నకుమారుడితో వచ్చిన ప్రసాద్ భార్య విలపించిన తీరు అక్కడివారిని కలచివేసింది. బంధువుల రోదనలతో ఆస్పత్రి దద్దరల్లింది.