యువతకు ఇలాంటి వేదికలు అవసరం  | Young people need such platforms | Sakshi
Sakshi News home page

యువతకు ఇలాంటి వేదికలు అవసరం 

Published Thu, Nov 30 2017 1:44 AM | Last Updated on Thu, Nov 30 2017 3:28 AM

Young people need such platforms - Sakshi

దేశ విదేశాల్లోని యువ పారిశ్రామికవేత్తలకు, ఇన్వెస్టర్లకు జీఈఎస్‌ అనేది ఒక వేదిక మాత్రమేనని.. దీనిని ఉపయోగించుకుని ఏ స్థాయికి వెళతారన్నది వారి సమర్థతపై ఆధారపడి ఉంటుందని అమెరికా ప్రభుత్వ యువజన వ్యవహారాల గ్లోబల్‌ అడ్వైజర్‌ ఆండీ రబెన్స్‌ పేర్కొన్నారు. భారతీయుల పారిశ్రామికతత్వం అద్భుతమని.. టీ–హబ్‌ ద్వారా యువతకు భారీగా అవకాశాలు వస్తున్నాయని కొనియాడారు. పదేళ్లుగా అమెరికా ప్రభుత్వ యువజన వ్యవహారాల సలహాదారుగా వివిధ ఖండాల్లో పనిచేసిన రబెన్స్‌.. జీఈఎస్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’బిజినెస్‌ బ్యూరో 
ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ..

–సాక్షి, బిజినెస్‌ బ్యూరో

సాక్షి: ఈ పారిశ్రామిక సదస్సు వల్ల యువతకు కొత్త అవకాశాలేమైనా వస్తాయా?
రబెన్స్‌: తప్పకుండా వస్తాయి. నేను ఇండియాకు ఇంతకుముందు కూడా కొన్నిసార్లు వచ్చా. యువత సమస్యలేంటి..? ఎలా పరిష్కరించగలమన్నది అర్థం చేసుకోవటానికి ప్రయత్నించా. ఇక్కడి (భారత) యువతకు పారిశ్రామికవేత్తలవ్వాలనే ఆసక్తి అధికం. కానీ సొంత వ్యాపారాలు సృష్టించుకోవాలన్నా, ఉన్న వ్యాపారాల్ని వృద్ధి చేసుకోవాలన్నా.. నిధుల సమీకరణ, తగిన మార్గదర్శకత్వం, అవసరమైన వారితో సంబంధాల వంటివి అవసరం. అవి అంది పరిశ్రమలు సాకారమైతే మరింత మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. 

భారీగా పెట్టుబడులు రావటానికి, ఎంవోయూలు జరగటానికి ఇది బిజినెస్‌ సదస్సు కాదు. దీని ద్వారా మీరేం సాధించాలనుకున్నారు? అనుకున్నది జరుగుతోందా?
రబెన్స్‌: అక్షరాలా జరుగుతోంది. అసలు మేం సాధించాలనుకున్నదల్లా.. పారిశ్రామికవేత్తలకు, ప్రత్యేకించి మహిళలకు కావాల్సిన వేదికను, వారి పరిశ్రమలకు తగిన అనుకూల వ్యవస్థను (ఎకో సిస్టమ్‌) సృష్టించటమే. ఈ సదస్సులో పాల్గొన్న వారిలో మెజారిటీ మహిళా పారిశ్రామికవేత్తలే. వారి వ్యాపారాల విస్తరణకు కావాల్సిన నిధులను సమీకరించడానికి, వారి ఆలోచనలతో మరిన్ని సాధించటానికి.. వారిని పెట్టుబడిదారులతో అనుసంధానించాలనుకున్నాం. అది జరుగుతోంది. 

మరి ఇండియాలో పరిశ్రమల అనుకూల వ్యవస్థ ఉందని భావిస్తున్నారా? 
రబెన్స్‌: తప్పకుండా! అద్భుతమైన స్థాయిలో ఉంది. హైదరాబాద్‌లో టీ–హబ్‌ను చూశాను. ఈ ఇంక్యుబేటర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయికి విస్తరిస్తున్నారు. ఇది తప్పకుండా త్వరలోనే సాకారమవుతుంది. నాకు అమెరికాలోను, ఇక్కడ చాలామంది భారతీయ మిత్రులున్నారు. వారిలో దూసుకుపోయే తత్వం, పారిశ్రామిక ఆకాంక్షలు నాకు అద్భుతంలా కనిపిస్తుంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంత మార్గదర్శకత్వం అవసరమని అనిపిస్తుంది. అమెరికన్ల తరహాలో ‘అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగేలా చేయటమెలా..?’అనే రీతిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. చేస్తున్న పనిలో లోటుపాట్లను గుర్తించి, దిద్దుకునే మార్గాలను అన్వేషించటం, మనకున్న పరిమితమైన, విశ్వసనీయమైన వనరులతోనే ఇవన్నీ చేయటం వంటి విషయాల్లో కొంత మార్గదర్శకత్వం కావాలి. 

సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో చాలామంది ఇక్కడి పరిస్థితుల్ని చూడటానికి వచ్చామని.. కావాల్సిన వనరులను గుర్తించి, సంబంధీకులతో సంప్రదిస్తున్నామని చెప్పారు. మరి ఈ సంబంధాలు తదుపరి దశకు వెళతాయా? ఎంత సమయం పట్టొచ్చు?
రబెన్స్‌: తదుపరి దశకు వెళతాయా..? వెళితే ఎప్పుడనేది నిజంగా వాళ్ల సమర్థత మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అలాంటి సంబంధాలు ఏర్పర్చుకోవటానికి కావాల్సిన వాతావరణాన్ని మేం సృష్టించాం. వేదికను ఏర్పాటు చేశాం. ఎంతమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల్ని సాధిస్తారు.. ఎంత మంది పెట్టుబడిదారులు తమకు తగ్గ వెంచర్లను వెతుక్కుని పెట్టుబడులు పెడతారనేది వారు చేసే కృషిపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో అమెరికా, కెన్యా, టర్కీ, యూఏఈ, మొరాకో తదితర దేశాల్లో గ్లోబల్‌ సదస్సులు నిర్వహించాం. అక్కడి పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల కోసం ఆయా సదస్సుల వేదికపై ప్రయత్నించారు. చాలామంది విజయం సాధించారు. 

అమెరికాగానీ, అమెరికన్‌ ఇన్వెస్టర్లు గానీ ఇండియాలో ఏయే రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు?
రబెన్స్‌: ఈ సదస్సుకు చాలా మంది అమెరికన్‌ ఇన్వెస్టర్లు హాజరయ్యారు. ఇక్కడ చాలా అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలూ ఉన్నాయి. సదస్సు కోసం ఎంచుకున్న ప్రాధాన్య రంగాలు.. హెల్త్‌కేర్‌– లైఫ్‌ సైన్సెస్, డిజిటల్‌ ఎకానమీ – ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, ఎనర్జీ – ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మీడియా–ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఈ నాలుగింటిపైనా వారు ఆసక్తి చూపిస్తున్నారు. భారత్‌లో 130 కోట్ల జనాభా ఉన్నారు. అమెరికాలో ఇందులో 25 శాతం జనాభా ఉంది. ఎన్నెన్నో కొత్త ఆలోచనలు, అవకాశాలు ఇద్దరికీ ఉన్నాయి. ఇండియన్లు అటు అమెరికా సంస్థలతో బంధాలేర్పరచుకుని అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఇటు అమెరికా సంస్థల నుంచి పెట్టుబడులు పెడుతున్నారు. 

వచ్చే కొన్నేళ్ల పాటు యువతకు ఏ రంగాలు బాగుండొచ్చు?
రబెన్స్‌: నా ఉద్దేశం ప్రకారం యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి ఇష్టపడుతున్నారు. ఇక ఏ రంగమనేది వారి అర్హతలు, ఫోకస్‌పైనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకుంటేనే రాణించగలుగుతారు. అందులో కొన్ని లోపాలుండొచ్చు. వాటిని దిద్దుకుంటూ ముందుకెళ్లాలి.  

పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విషయంలో సదస్సుతోనే సరిపెడతారా? తదుపరి చర్యలేమైనా ఉంటాయా? 
రబెన్స్‌: ఈ సదస్సు చాలా చిన్నది. ఎందుకంటే 130 కోట్ల మంది జనాభా ఉన్న ఇండియాలో ఇక్కడకు వచ్చింది కేవలం 500 మంది పారిశ్రామికవేత్తలు. భారత పారిశ్రామికవేత్తల్లో సాధికారత తేవటానికి పెను ప్రయత్నాలు జరగాల్సి ఉంది. వారిని తగిన గురువులతో అనుసంధానించటం, నిధుల లభ్యత కల్పించటం, భాగస్వామ్యాలు ఏర్పాటు చేయటం వంటివి అవసరం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం. 

ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాలేమైనా చేపడుతున్నారా?
రబెన్స్‌: మా ఎంబసీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెరికన్‌ కాన్సులేట్ల ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఎప్పటికప్పుడు నిపుణుల్ని పిలిపించి మార్గదర్శకత్వం అందిస్తోంది. ప్రత్యేక అవకాశాలు కల్పించటం, పలువురితో నెట్‌వర్కింగ్‌ ఏర్పాటు చేయటం వంటివి జరుగుతున్నాయి. నా ఉద్దేశం ప్రకారం అమెరికాకు వచ్చిన భారత పారిశ్రామికవేత్తలైతే నిజంగా ఇక్కడ కింది స్థాయిలో ఏం జరుగుతోందనేది చెప్పగలరు. అసలు అమెరికాలో, ఇక్కడ ఒకే రకమైన సవాళ్లు ఉండవకపోవచ్చు. ఇక్కడున్న కొన్ని సమస్యలు ప్రత్యేకమైనవి కావచ్చు. కాకపోతే పరస్పర సహకారం, నెట్‌వర్కింగ్‌ ద్వారా అనుకున్నది సాధించొచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement