► మేమేమి చేశాం పాపం!
ఆచారం వారి పాలిట శాపంగా మారింది. చాలా ఏళ్ల నుంచి వస్తున్న వృత్తి వారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మానప్రాణాలు ఫణంగా పెట్టి ఊబిలో కొనసాగుతున్నారు. రోజుకు నాలుగైదుసార్లు బలత్కారానికి గురవడంతో ఒళ్లు హూనం చేసుకుంటున్నారు.. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా.. సర్కారు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వృత్తిని మానుకుంటామని సెక్క్ వర్కర్లు పేర్కొంటున్నారు. జిల్లాలోని నాలుగు పల్లెల్లోని వీధులు.. దాదాపు 600 కుటుంబాలు.. వేలాది మంది సెక్స్ వర్కర్ల వ్యథపై సండే స్పెషల్..
- సెక్స్‌వర్క్ ఊబిలోకి యువతులు
- ఏళ్లుగా అదే వృత్తి.. జీవనాధారం..
- ఆచారం వారి పాలిట శాపం
- ఫలించని పోలీసుల కౌన్సెలింగ్
- జిల్లాలో 600 కుటుంబాలు..
- వేలాది మంది జీవితాలు నాశనం
- సర్కారు ఉపాధి కల్పిస్తే మేలు
హసన్‌పర్తి : జిల్లాలో వంగపహాడ్, హసన్‌పర్తి, సిద్ధాపురం, ల్యాదేళ్ల గ్రామాల్లోని కొన్ని వీధుల్లో సెక్స్ వర్కర్ల స్థావరాలు ఉన్నాయి. దాదాపు 600 పడుపు వృత్తి నిర్వహించే కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల సభ్యులు కుటుంబపోషణ భారమై వేశ్య వృత్తిని నిర్వహిస్తున్నారు. అయితే కొందరు యువతులు సెక్క్ వర్కర్లుగా కొనసాగడానికి నిరాకరిస్తున్నారు. అయినప్పటికి కుల పెద్దలు వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది మన ఆచారమని నచ్చజెపుతున్నారని వారు పేర్కొంటున్నారు.
యువతులు బలవంతంగా పడుపు వృత్తిలో దించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం రావడం లేదు. ఆరేళ్ల క్రితం వంగపహాడ్‌లో పడుపు వృత్తి నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ గ్రామంలో ప్రత్యేకంగా పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. కొంత వరకు పడుపు వృత్తి తగ్గుముఖం పట్టింది. అయితే ఔట్‌పోస్ట్ ఏర్పాటుకు ముందు వివిధ ప్రాంతాల నుంచి యువతులను కొనుగోలు చేసేవారు. వారితో వ్యాపారం నిర్వహించే వారు.
‘ఉపాధి’కి ముందుకు రాని సర్కార్
పడుపు వృత్తి నివారించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వేశ్య గృహాల నిర్వాహకులతోపాటు వృత్తి నిర్వహిస్తున్న వారిని పిలిపించి కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నారు. వృత్తి మానితే ప్రభుత్వం నుంచి ఉపాధి పథకాలు అందిస్తామని భరోసా ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం, పోషణ నిమిత్తం మళ్లీ అదే రొంపిలోకి దిగాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులు లేనివారికి రేషన్‌కార్డులు, ఉండటానికి ఇల్లు కట్టించాలని, తమ పిల్లలను మంచి పాఠశాలల్లో చది వించాలని కోరుతున్నారు.
సమాజంలో దర్జాగా బతకండి
సెక్స్‌వర్కర్లు తమ వృత్తిని వదిలిపెట్టి సమాజంలో దర్జాగా బతకాలి. వేశ్య వృత్తి నిర్వహించే వారిపై సమాజం చిన్నచూపుచూపుతోంది. ఈ రొంపిలో నుంచి బయటికీ రావాలి.
- సీఐ, రవికుమార్
పడుపు రొంపి
Published Sun, Sep 6 2015 3:20 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM
Advertisement