సలీం (పేరు మార్చాం) 24 ఏళ్ల ఈ యువకుడు హైదరాబాద్‌లోని ఒక జిమ్‌లో కోచ్‌గా పనిచేస్తున్నాడు. అథ్లెటిక్ లుక్ కోసం అతను నోటి నుంచి తీసుకునే సహజ సిద్ధమైన ఆహారాన్ని పూర్తిగా మానేశాడు. గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు, మల్టీ విటమిన్లు కలిగిన అధిక ప్రోటీన్ తీసుకున్నాడు. మూడు నెలలు గడిచాక అతను పూర్తిగా నీరసించిపోయాడు. పరీక్షలు చేయించగా, కిడ్నీలు ఫెయిల్ అయినట్లు నిర్ధారించారు.
శ్రీనివాస్... ఇతనో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... వయస్సు 50 ఏళ్లు. బరువు తగ్గడం, కండరాలు పెంచడం కోసం ఇతను విచక్షణారహితంగా స్టెరాయిడ్స్ సప్లిమెంట్లు వాడాడు. రెండు నెలల తర్వాత అతను బరువు తగ్గినా, కిడ్నీలు దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
సాక్షి, హైదరాబాద్: సిక్స్ ప్యాక్, బాడీ బిల్డింగ్, బరువు తగ్గడం... ఇలాంటి లక్ష్యాలతో అనేకమంది యువకులు జిమ్‌లలో చేరుతుంటారు. లక్ష్యం మంచిదే, వాటికోసం ఎక్కువ నెలల సమయం తీసుకోవాలి. కానీ రాత్రికి రాత్రే సిక్స్ ప్యాక్ సాధించాలని, కండలు పెంచాలని, కేజీల కొద్దీ బరువు తగ్గాలని కోరుకుంటున్నారు. దీనికోసం జిమ్‌లలో వ్యాయామాలు చేస్తూ, వైద్యులను సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్స్ వాడడం, ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకోవడంతో రోగులుగా మారుతున్నారు. కొందరైతే కిడ్నీలు ఫెయిలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని జిమ్ సెంటర్లు స్వల్ప సమయంలోనే బరువు తగ్గిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మూడు నాలుగు నెలల్లో సిక్స్ ప్యాక్ సాధించేలా శిక్షణ ఇస్తామని చెబుతున్నాయి. దీనికోసం కొన్ని జిమ్ సెంటర్లు ప్రోటీన్ పౌడర్లను, స్టెరాయిడ్స్‌ను అనధికారికంగా అలవాటు చేస్తున్నాయి.
10 మందిలో ఒకరు స్టెరాయిడ్స్ వినియోగం
రాష్ట్రంలో జిమ్‌లకు వెళుతున్న ప్రతీ పది మంది లో ఒకరు స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్లు, ప్రొటీన్లు వాడుతున్నారని నెఫ్రాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక వెయిట్ లిఫ్టర్లు, బాడీ బిల్డర్లలో 40 శాతం మంది వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారని తేలింది. సహజ సిద్ధంగా చికెన్, మటన్, గుడ్లు వంటి వాటి ద్వారా ప్రొటీన్లు పొందవచ్చు. కానీ చాలామంది అలా చేయడం లేదు. తక్కువ సమయంలో శరీర సౌష్టవాన్ని సాధించాలన్న దురాశతో మోతాదుకు మించి ప్రొటీన్ పౌడర్లు, స్టెరాయిడ్లు వంటి వాటిని వాడుతుండటం వల్లే సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు ఎక్కువసేపు జిమ్‌లో గడిపి శక్తికి మించి బరువులెత్తడం, ఆ తర్వాత ఒళ్లు నొప్పులంటూ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు అంటున్నారు.
అనాబాలిక్–ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్‌ను తరచుగా బాడీబిల్డర్లు, వెయిట్‌లిఫ్టర్లు ఆహార పదార్ధాలుగా ఉపయోగిస్తున్నారని ‘బీఎంసీ నెఫ్రాలజీ’అనే బ్రిటిష్ జర్నల్ తాజాగా ప్రచురించింది. హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) లెక్కల ప్రకారం ప్రతి మనిషి రోజుకు 2,400 కేలరీల ఆహారం తీసుకోవాలి. జిమ్‌లకు వెళ్లే వారు ప్రొటీన్ పౌడర్ల ద్వారా రోజుకు 80 నుంచి 100 గ్రాములకు మించి ప్రోటీన్లు తీసుకుంటున్నారు. ఫలితంగా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయని ఎన్ఐఎన్ వర్గాలు చెబుతున్నాయి.
అత్యాశ వల్లే సమస్యలు
సిక్స్ ప్యాక్, బాడీ బిల్డింగ్ కోసం అనేక మంది యువకులు జిమ్‌లకు వెళుతున్నారు. వాటిని సాధించాలంటే రెండు మూడేళ్ల సమయం తీసుకోవాలి. క్రమశిక్షణతో ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి. కానీ మూడు నెలల్లోనే సాధించాలన్న భావనతో అనేక మంది యువకులు ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నారు. స్టెరాయిడ్స్, ప్రొటీన్లు, పెయిన్ కిల్లర్స్‌ను మోతాదుకు మించి అవగాహనా రాహిత్యంతో వాడుతున్నారు. సాధారణంగా ప్రోటీన్లు చికెన్, మటన్ ద్వారా పొందవచ్చు. కానీ అవసరానికిమించి ప్రొటీన్ పౌడర్లు వా డుతుండటంతో కిడ్నీలపై భారం పడుతుంది.
– డాక్టర్ టి.గంగాధర్, నెఫ్రాలజిస్టు, నిమ్స్
న్యూట్రా విజిలెన్స్ లేనేలేదు
మార్కెట్లోకి ప్రొటీన్ ప్రొడక్టులు విపరీతంగా వస్తున్నాయి. స్పోర్ట్స్, బాడీ బిల్డింగ్ ఇలా అవసరానికి తగ్గట్లు ఉత్పత్తులు వస్తున్నాయి. వాటిమీద నియంత్రణ లేనేలేదు. పైగా క్లినికల్ టెస్టెడ్ అంటూ వాటిపై ముద్రించుకుంటున్నాయి. అంతేకాదు ఎన్‌ఐఎన్ రికమండెడ్ అని కూడా కొన్ని వస్తున్నాయి. ఎన్ఐఎన్ ఏ సంస్థకూ రికమండ్ చేయలేదనే విషయం స్పష్టం చేస్తున్నాను. వీటిని వాడడం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయి. ప్రోటీన్ ఉత్పత్తులను నియంత్రించేందుకు ‘న్యూట్రా విజిలెన్స్’ అవసరముంది.
– డాక్టర్ బి.దినేశ్‌కుమార్, శాస్త్రవేత్త, ఎన్ఐఎన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment