సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు ‘లైక్’ల పిచ్చి పట్టుకుంది! తెల్లారింది మొదలు అర్ధరాత్రి వరకూ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వాటితోనే ఇంటిల్లిపాదీ ప్రత్యేకించి యువత కాలక్షేపం చేస్తూ లైక్‌లు, కామెంట్ల కోసం వెంపర్లాడుతోంది!! ఒకవేళ ఆశించిన రీతిలో లైక్‌లు రాకపోతే మాత్రం గంగవెర్రులెత్తుతోంది. చివరకు శారీరక, మానసిక రుగ్మతలను కొనితెచ్చుకుంటోంది!! భాగ్యనగరంలో మొబైల్ డేటా వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నట్లుగానే అతిగా సోషల్ మీడియా వాడకం సైతం అంతకంతకూ అధికం అవుతోంది. అయితే ఈ పరిణామం క్రమంగా నగరవాసుల్లో మానసిక సమస్యలకు దారితీస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, వాట్సాప్ స్టేటస్‌లకు ఆశించిన స్థాయిలో లైక్‌లు, కామెంట్లు, వ్యూస్, రివ్యూలు రాకపోయినా మానసికంగా కుంగిపోతున్న వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొంటున్నారు. రాయల్ సొసైటీ ఫర్ పబ్లిక్ హెల్త్ తాజాగా నిర్వహించిన సర్వేలో 16 నుంచి 24 ఏళ్ల వయస్కుల్లో 91% మంది, 25–34 ఏళ్ల వయసు వారిలో 80% మంది, 35–44 ఏళ్ల వయసు వారిలో 70% మంది అతిగా సోషల్ మీడియాను వాడుతున్నారని తేల్చింది. దీంతో వారిలో చాలా మంది స్థూలకాలయం, మెడ, వెన్నుపూస, కంటి సమస్యల బారినపడుతున్నారని పేర్కొంది.
చీప్‌గా ఇంటర్నెట్ డేటా...
సెల్‌ఫోన్ నెట్‌వర్కింగ్ కంపెనీలు కాల్స్, ఇంటర్నెట్ డేటా కారుచౌకగా లేదా దాదాపు ఉచితంగా అందిస్తుండటంతో నగరవాసుల్లో అధిక శాతం మంది నెట్ డేటాను తెగ వాడేస్తున్నారు. దీనికితోడు షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, బస్టాండ్‌లు, ఆఫీసుల్లో ఉచిత వైఫై సేవలు కూడా లభిస్తుండటంతో వీలైనంతగా సోషల్ మీడియాను వాడేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో డేటా వినియోగం గత మూడేళ్లలో 25 శాతానికిపైగా పెరిగిందని ఓ ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ రీజినల్ మేనేజర్ పేర్కొన్నారు.
అందరూ ‘సోషల్’బానిసలే...!
సోషల్ మీడియాకు ఇంటిల్లిపాదీ బానిసలవుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి వాటినే నగరవాసులు ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఇళ్లలోని చిన్నారులెవరైనా గుక్కపట్టి ఏడుస్తుంటే పెద్దలు వారికి స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు పెట్టి సముదాయిస్తున్నారు. తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబ సభ్యులు పగలూరాత్రి సోషల్ మీడియాతోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తుండటంతో చిన్నారులు సైతం స్మార్ట్‌ఫోన్లకు అలవాటవుతున్నారు. ముఖ్యంగా స్కూలు పిల్లలు ఇంటికి రాగానే స్మార్ట్‌ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. దీనికితోడు పాఠాలు బోధించే యాప్‌లు సైతం అందుబాటులోకి రావడంతో విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ల వాడకం మరింత పెరిగింది.
ఇన్ఫిరియారిటీ పెరుగుతుంది..
సోషల్ మీడియా అతి వాడకం వల్ల చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఎవరికి వారు ఒంటరిగా ఫీలవుతున్నారు. హైదరాబాద్‌లో ఈ అలవాటుతో వచ్చే డిప్రెషన్, యాంగ్జైటీ కేసులు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలో కనిపించే స్నేహితుల ఫొటోలు, వారి డ్రెస్సింగ్ వంటివి యువతలో ఇన్ఫీరియారిటీ లక్షణాలను పెంచుతున్నాయి. తోటి వారి కంటే తాము ఎంతో తక్కువ అనే భావంతో కుంగిపోతున్నారు. ఇది వారి కెరీర్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుంది.
– డాక్టర్ సంహిత, సీనియర్ సైకియాట్రిస్ట్
చాలా మందికి కంటి సమస్యలు
గంటల తరబడి స్మార్ట్‌ఫోన్ల వాడకం వల్ల కంటి సమస్యలతో బాధపడుతూ మా దగ్గరకు వచ్చే రోగుల సంఖ్య ఇటీవల పెరిగింది. రాత్రివేళల్లో నిద్రపోయే ముందు ఫోన్ వాడటం వల్ల నిద్రలేమితోపాటు కళ్ల మంటలు వస్తాయి. కంటి ఎలర్జీ, ఇన్‌ఫెక్షన్లు వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలి.
ప్రశాంత్ గుప్తా, ఆఫ్తాల్మాలజిస్ట్, అపోలో హస్సిటల్స్
నేను గతంలో యూట్యూబ్, వాట్సాప్ మెసేజీలకు అలవాటుపడిపోయా. రోజూ దాదాపు 3 గంటలు వాటితోనే కాలక్షేపం చేసేదాన్ని. ఇదో వ్యసనంలా మారింది. 2, 3 నెలల తర్వాత పరిస్థితి అర్థం చేసుకొని ఫోన్లో వీడియోలు చూసేందుకు ఓ టైం పెట్టుకున్నా. – రాజ్యలక్ష్మి, గృహిణి
Comments
Please login to add a commentAdd a comment