కొన్నేళ్ల క్రితం వరకు...
యువత చూపంతా ఐటీ కంపెనీలవైపే... వారి కలల కొలువులంటే ఎంఎన్‌సీలే... ఐదంకెల జీతాలు, వారానికి ఐదు రోజుల పనిదినాలు, వారాంతాల్లో విలాసాలు, ఏటా ఇంక్రిమెంట్లు, ఠంఛనుగా ప్రమోషన్ల వంటి ఆఫర్లకు ఆకర్షితులై ప్రైవేటు కొలువుల వైపు పరుగులు పెట్టేవారు. జాతరలను తలపించే ఉద్యోగ మేళాల్లో నాలుగైదు దశల వడపోతలను దాటుకొని మరీ డ్రీమ్ జాబ్స్‌లో చేరేవారు.
పరిస్థితి తలకిందులు..
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం దెబ్బకు కుదేలైన కార్పొరేట్ కంపెనీలు ఎడాపెడా ఉద్యోగులను తొలగించడం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లను అటకెక్కించడం, క్యాంపస్ ప్లేస్‌మెంట్ల జోలికి వెళ్లకపోవడం వంటి పరిణామాలు ప్రైవేటు ఉద్యోగాల విషయంలో యువత ఆలోచనలపై ప్రభావం చూపాయి.
ప్రస్తుతం ఇలా..
♦ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 1.20 లక్షల ఉద్యోగాల భర్తీకి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌కు ఉద్యోగార్ధుల నుంచి అందిన దరఖాస్తులు ఏకంగా 2.40 కోట్ల పైమాటే!
♦ ఇండియన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఎస్‌బీఐ వంటి ప్రభుత్వరంగ సంస్థలు కర్ణాటక ఇంజనీరింగ్ కాలేజీల్లో చేపడుతున్న క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు భారీ ఆదరణ లభిస్తోంది. ఉద్యోగాల్లో స్థిరత్వానికే నేటి యువత ప్రాధాన్యత ఇస్తున్నదనడానికి ఈ పరిణామాలే పెద్ద ఉదాహరణలు.
సాక్షి, హైదరాబాద్: దేశంలో యువత ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల వైపే పరుగులు పెడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ (సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్) రెండు దఫాలుగా జరిపిన దేశవ్యాప్త సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, పుణేలతోపాటు 11 రాష్ట్రాల్లో ఎక్కువ జనాభా ఉన్న మరికొన్ని నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామాల్లోని 11,635 మంది యువతీయువకులపై రెండు దఫాలుగా అధ్యయనం జరిపి వారి అభిప్రాయాలను క్రోడీకరించారు.
2016 సర్వే లో పాల్గొన్న యువజనుల్లో (15–34 వయోశ్రేణి) కనీసం 65 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాల వైపే మొగ్గు చూపారు. ప్రైవేటు రంగం వైపు చూస్తున్న యువత కేవలం 7 శాతం మాత్రమే. ఉద్యోగ స్థిరత్వం, ప్రభుత్వ–ప్రైవేటురంగ ఉద్యోగుల వేతనాల మధ్య అంతరం తగ్గుతుండటం ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. సౌకర్యాలు, సెలవులు వంటి అంశాలు కూడా యువతను కొంత మేరకు ప్రభావితం చేస్తున్నాయి. 2007లో 62 శాతం యువత సర్కారీ జాబులకు ఓటేశారు. 2007లో 13 శాతం మంది ప్రైవేటు ఉద్యోగాల పట్ల మొగ్గు చూపగా 2016 నాటికి వారి సంఖ్య ఏడు శాతానికి పడిపోయింది.
పెద్ద నగరాల యువత ప్రభుత్వ రంగం వైపే
♦ సీఎస్‌డీఎస్ సర్వేల ప్రకారం పెద్ద నగరాల్లో సర్కారీ కొలువుల వైపు మొగ్గుచూపుతున్న యువతీయువకులు దశాబ్ద కాలంలో బాగా పెరిగారు. 2007లో 48 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఓటేశారు. 2016 నాటికి ఇలాంటి యువజనులు మరో 14 శాతం పెరిగారు (62శాతం). ఈ నగరాల్లో ప్రైవేటు రంగాన్ని ఎంచుకుంటున్న వారు అప్పటి (24 శాతం) కంటే ఇప్పుడు బాగా తగ్గారు (10 శాతం).
♦ చిన్న నగరాల్లో సర్కారీ జాబులు కోరుకుంటున్న యువత దశాబ్ద కాలంలో 2 శాతం మేర పెరిగింది. (2007లో 58 శాతం; 2016లో 60 శాతం).
♦ 2007లో 65 శాతం గ్రామీణ యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గుచూపగా 2016 నాటికి ఇలాంటి వారు మరో నాలుగు శాతం మేరకు (69 శాతం) పెరిగారు.
♦ పెద్ద, చిన్న పట్టణాల్లో స్వయం ఉపాధి/వ్యాపారంపట్ల ఆసక్తి చూపుతున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. (ఇంచుమించు 20 శాతం).
♦ దేశవ్యాప్తంగా స్వయం ఉపాధి/వ్యాపారంపట్ల ఆసక్తి చూపుతున్న వారు 2007 (16శాతం)తో పోల్చుకుంటే 2016 నాటికి కొద్దిగా పెరిగారు (19 శాతం).
ప్రైవేటుకు ‘నో’..
♦ గ్రామాల్లో డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదువుకున్న యువతీయువకుల్లో అత్యధికులు (82 శాతం) ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రైవేటు రంగం వైపు చూస్తున్న వారు అతి స్వల్పం (4 శాతం). 12 శాతం మంది స్వయం ఉపాధి వైపు మొగ్గుచూపు తున్నారు.
♦విద్యాస్థాయితో నిమిత్తం లేకుండా పరిశీలించినప్పుడు 2007లో 9 శాతం గ్రామీణ యువత ప్రైవేటు రంగం వైపు మొగ్గింది. 2016లో ఇలాంటి వారి శాతం సున్నా.
♦పేదవర్గాలు (63 శాతం), ఎగువ మధ్యతరగతి వర్గాలు (65 శాతం) కూడా సర్కారీ ఉద్యోగాలవైపే ఆసక్తి కనబరుస్తున్నాయి.
స్థిరత్వానికే ప్రాధాన్యత..
♦ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్న యువతలో దాదాపు సగం మంది స్థిరత్వాన్ని కారణంగా చూపుతున్నారు. కొందరు ఉద్యోగపరమైన సంతృప్తి, మంచి ఆదాయం, తమలా ఆలోచించే వాళ్లతో కలసి పనిచేసే అవకాశం ఉండటం వంటి కారణాలుగా పేర్కొన్నారు.
♦ ప్రైవేటురంగం, స్వయం ఉపాధి రంగాల వైపు వెళ్లాలనుకుంటున్న యువతీయు వకులు ఉద్యోగపరమైన సంతృప్తి, మంచి ఆదాయాన్ని కారణంగా చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment