ఐటీ కల కరుగుతోంది! | IT dreams deteriorating in india | Sakshi
Sakshi News home page

ఐటీ కల కరుగుతోంది!

Published Wed, May 10 2017 5:47 PM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

ఐటీ కల కరుగుతోంది! - Sakshi

ఐటీ కల కరుగుతోంది!

- భారత ఐటీ కంపెనీల్లో వేలాది ఉద్యోగులకు ఉద్వాసనలు
- విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, క్యాప్జెమినిల్లో వేటు
- ఒకవైపు మాంద్యం దెబ్బ.. మరోవైపు ఆటోమేషన్ భూతం
- ఆపై విదేశాల్లో స్థానిక నియామకాలకు కంపెనీల ప్రాధాన్యం
- అంధకారంలో భారత ఐటీ నిపుణులు, విద్యార్థుల భవితవ్యం


భారత ఐటీ రంగం.. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న భారీ ప్రైవేటు రంగాల్లో ఒకటి. భారత ఐటీ కంపెనీల్లో 37 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని అంచనా. నిన్న మొన్నటి దాకా ఆకాశంలో విహరించిన ఐటీ రంగం.. లక్షలాది మంది ఐటీ గ్రాడ్యుయేట్లకి ఆశాదీపం. ఇప్పుడీ ఐటీ సంస్ధలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఆరంభించాయి. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, క్యాప్జెమిని వంటి ఐటీ దిగ్గజాలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పడం ఆరంభించాయి. దీంతో కొత్త గ్రాడ్యుయేట్లకే కాదు.. పాత ఉద్యోగుల గుండెల్లో సైతం రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక వైపు పశ్చిమ దేశాల్లో ఆర్థిక మందగమనం.. ఇంకోవైపు అభివృద్ధి చెందిన దేశాల్లో ‘హైర్ లోకల్’ విధానాలు.. మరోవైపు వేగంగా పెరుగుతున్న ఆటోమేషన్.. భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థుల భవిష్యత్తుపై ముప్పేట దాడి చేస్తున్నాయి. వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

ఐటీ వృద్ధి మందగమనంతో వేటు..
ప్రపంచానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సేవల బ్యాక్ ఆఫీస్‌గా పనిచేస్తున్న భారత ఐటీ పరిశ్రమకు ఇప్పుడు కష్టాలు ఆరంభమైనట్లు కనిపిస్తోంది. 100 బిలియన్ డాలర్ల భారత సాఫ్ట్‌వేర్ ఎగుమతుల వాణిజ్యం.. 60 శాతానికి పైగా ఆదాయాన్ని ఉత్తర అమెరికా ఖండం మార్కెట్ నుంచే ఆర్జిస్తోంది. మరో 20 శాతం ఆదాయాన్ని యూరప్ నుంచి, మిగతా మొత్తం ఇతర దేశాల నుంచి పొందుతోంది. మొత్తంగా గత రెండు దశాబ్దాలుగా భారతీయ ఐటీ పరిశ్రమ 20 శాతానికి పైగా లాభాలతో దూసుకెళుతోంది. ఇది దేశంలో ఐటీ విద్యకు విపరీతమైన డిమాండ్ పెంచింది. మధ్య తరగతి వర్గం డాలర్ డ్రీమ్స్ సాకారం కావడానికి అవకాశాలను అందించింది. దీంతో ఇతరత్రా రంగాలకన్నా ఐటీ రంగానికి విద్యలో డిమాండ్ పెరిగింది.

ఐటీ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు సాధించడమూ పెద్ద కష్టం కాలేదు. అయితే.. పశ్చిమ దేశాల్లో ఆర్థికాభివృద్ధి మందగమనంతో అమెరికా సహా చాలా దేశాల్లో ఐటీ కాంట్రాక్టుల వ్యయానికి కోత పెడుతున్నాయి. దీనికి తోడు రూపాయి బలపడుతోంది. ఫలితంగా భారత ఐటీ పరిశ్రమల వృద్ధి తగ్గుముఖం పడుతోంది. లాభాలు పడిపోతున్నాయి. కొన్ని సంస్థల్లో వృద్ధి రేటు మైనస్లలోకి కూడా వెళుతోంది. భారత ఐటీ పరిశ్రమ వృద్ధి ఊహించిన దాని కన్నా తగ్గిన నేపథ్యంలో ఉద్యోగుల ఉద్వాసనలు ఊపందుకున్నాయి. ‘‘రూపాయి బలపడడం వల్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు తగ్గాయి. ఫలితంగా భారత ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితిలోకి వెళతాయి’’ అని అసోచామ్ ఏప్రిల్ నెలలోనే హెచ్చరించింది.

విప్రో సంస్ధ ఐటీ సేవల ఆదాయంలో 2017 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండు త్రైమాసికాల పాటు ప్రతికూల వృద్ధి రేటు నమోదైంది. కొత్త ఉద్యోగుల నియామకం కూడా గతంతో పోలిస్తే తగ్గింది. ఇన్ఫోసిస్ ఆదాయ వృద్ధి రేటు 2016 ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతంగా ఉంటే.. 2017 ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతానికి తగ్గింది. ఈ సంస్థ నిర్వహణ లాభాలు కూడా 2014-15 నుండి తగ్గుతూ వస్తున్నాయి. ఆ ఏడాది 25.9 శాతంగా ఉన్న నిర్వహణ లాభాలు ప్రస్తుతం 24.7 శాతానికి తగ్గాయి.

గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 17,857 మంది, 15,782 మంది చొప్పున కొత్త ఉద్యోగులను చేర్చుకున్న ఇన్ఫోసిస్ 2017 ఆర్థిక సంవత్సరంలో కేవలం 6,320 మందిని మాత్రమే కొత్తగా చేర్చుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్‌) సంస్థలో కూడా కొత్త ఉద్యోగుల నియామకం స్వల్పంగా తగ్గింది. 2016 ఆర్థిక సంవత్సరంలో 34,187 మందిని చేర్చుకున్న ఆ సంస్థ 2017లో 33,380 మందిని నియమించుకుంది. ఇక ఈ సంస్థ నిర్వహణ లాభాలు కూడా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 26.5 శాతం నుండి 25.7 శాతానికి తగ్గాయి. ఆదాయం కూడా 7.1 శాతం నుండి 6.2 శాతానికి తగ్గింది.

(అన్ని సంస్థల్లో ఉద్వాసనల పర్వం...)

మింగేస్తున్న ఆటోమేషన్‌ భూతం..
ఇక డిజిటల్ సాంకేతికతల్లో ఆటోమేషన్ విప్లవం కూడా ఐటీ రంగం రూపురేఖలను మార్చేస్తోంది. బిజినెస్ ఎనలైటిక్స్, క్లౌడ్, మొబిలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ) వంటి అత్యాధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాల విస్తరణతో ఐటీ పరిశ్రమ మరో భారీ పరిణామం మలుపులో ఉంది.

ఐటీ సర్వీసెస్ సంస్ధలు ఈ కొత్త సాంకేతికతలకు, కొత్త రకాల డిమాండ్లకు అనుగుణంగా మారక తప్పని పరిస్థితి. ఒకప్పుడు మానవ శ్రమకు పోటీగా వచ్చిన యాంత్రీకరణ పరిశ్రమల్లో కార్మికుల ఉద్యోగాలకు ఎసరు పెట్టినట్లే.. ఇప్పుడు ఐటీ రంగంలో ఆటోమేషన్ ఆ రంగ ఉద్యోగులను నిరుద్యోగులుగా మారుస్తోంది. ఐటీ సర్వీసెస్ సంస్థల్లోని ఉద్యోగుల్లో దాదాపు సగం మంది మరో మూడు, నాలుగేళ్లలో నిరుపయోగంగా మారతారని అంతర్జాతీయ సలహా సంస్థ మెక్కిన్సే అండ్ కంపెనీ ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది.

సాంకేతికతల్లో గణనీయమైన మార్పు వల్ల.. 50 నుంచి 60 శాతం మంది ఉద్యోగులను కొనసాగించడం ఐటీ పరిశ్రమలకు పెద్ద సవాలు అవుతుందని జోస్యం చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో మనుషుల స్థానంలో మెషీన్ల నియామకం ప్రముఖంగా కనిపిస్తోంది. ఆటోమేషన్ ప్రభావం ప్రధానంగా మానవ ప్రమేయం తక్కువగా అవసరమయ్యే కింది స్థాయి ఉద్యోగాల మీద ఉంటుంది. కొత్త సాంకేతికతలకు అనుగుణంగా ఉద్యోగులకు మళ్లీ నైపుణ్య శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉంది. విప్రో వంటి చాలా పెద్ద సంస్థలు ఆ పని ఇప్పటికే చేస్తున్నాయి కూడా. పాత సిబ్బందినే తగ్గించుకుని, ఉన్నవారికి శిక్షణనిస్తూ, కొత్త ఉద్యోగుల నియామకాలను పరిమితం చేస్తున్నాయి.

విదేశాల్లో ‘హైర్ లోకల్’ దెబ్బ..
భారత ఐటీ పరిశ్రమ విజయగాధలో భారతీయ ఐటీ ఉద్యోగుల పాత్ర చాలా ప్రధానమైనది. మామూలు మాటల్లో చెప్తే.. భారతదేశంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నియమించుకోవడానికి అయ్యే వ్యయం.. అమెరికాలో అదే ఇంజనీర్‌ను నియమించుకోవడానికి అయ్యే వ్యయంతో పోలిస్తే చాలా తక్కువ. దీంతో.. ఇక్కడ ఉద్యోగులకు రూపాయిల్లో జీతం ఇస్తూ.. అమెరికా, యూరప్‌లలోని క్లయింట్ల నుంచి డాలర్లు, యూరోలు, పౌండ్లలో బిల్లులు వసూలు చేయడం వల్ల సాఫ్ట్‌వేర్ పరిశ్రమ చాలా లాభదాయక వ్యాపారంగా వృద్ధిలో పరుగులూ పెడుతూ వచ్చింది. భారత ఐటీ నిపుణులను ఉద్యోగ వీసాలపై విదేశాల్లోని తమ సంస్థల్లో నియమించుకోవడం అవిచ్ఛిన్నంగా సాగింది. ఇప్పుడు ఆ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.

ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి తప్పించుకోవడానికి అమెరికా సహా బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర సంస్థలు స్వీయ రక్షణ చర్యలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈయూ నుంచి బ్రెగ్జిట్, ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదం ఈ కోవకు చెందినవే. విదేశీ సంస్థలైనా తమ దేశంలోని ఉద్యోగులకు తగిన అవకాశాలు కల్పించాలన్న డిమాండ్లు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి.

బ్రిటన్ టైర్-2 వీసాదారులకు కనీస వేతన పరిమితిని 35,000 పౌండ్లకు పెంచడం, అమెరికా హెచ్-1బి వీసాలపై ఆంక్షలను కఠినం చేసే ప్రయత్నాలు, ఆస్ట్రేలియా, సింగపూర్లు కూడా ఉద్యోగ వీసాలపై ఆంక్షలు విధిస్తున్న పరిణామాలు ఈ కోవలోనివే. ఇన్ఫోసిస్ సంస్థ అమెరికాలో 10,000 మంది స్థానికులను ఉద్యోగాల్లో నియమించుకోనున్నట్లు ప్రకటించింది. అంటే.. ఆ దేశంలో వ్యాపార నిర్వహణ వాతావరణం మారిందని ఆ సంస్థ గుర్తించినట్లు పరిశీలకులు చెప్తున్నారు. ఇతర భారతీయ సంస్థలు కూడా బహిరంగంగా ప్రకటించినా లేకున్నా ఇదే మార్గాన్ని అనుసరించక తప్పని పరిస్థితి.

-(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement