ప్ర‘జల’ మనిషి వైఎస్సార్‌.. | YS Rajasekhar Reddy Developments In Karimnagar | Sakshi
Sakshi News home page

ప్ర‘జల’ మనిషి వైఎస్సార్‌..

Published Mon, Sep 2 2019 11:01 AM | Last Updated on Mon, Sep 2 2019 11:01 AM

YS Rajasekhar Reddy Developments In Karimnagar - Sakshi

పేదల కళ్లల్లో ఆనందం చూసినప్పుడే నిజమైన అభివృద్ధి అని నమ్మిన ఒకేఒక్క నాయకుడు వైఎస్‌ఆర్‌. తాను ఏమి చేసినా పేదోడి అవసరాన్ని తీర్చేలా ఉండేలా చూసుకున్నారు. ప్రాజెక్టు కట్టినా..పథకం రూపొందించినా వాటి ఫలాలు ప్రతీ ఇంటికి చేరేలా నిరంతరం కృషి చేసి ప్రజల మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రాజెక్టుల నిర్మాణం, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ , ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. జనం మధ్య నుంచి వెళ్లిన వైఎస్సార్‌ దాదాపు పదేళ్లు గడుస్తున్నా రాజన్న ప్రతిరూపం ప్రతిఒక్కరి కంటిలో కదలాడుతూ, ప్రతిఒక్కరి గుండెను తడుతోంది. నేడు వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

గూడు కల్పించిన దేవుడు 
గోదావరిఖని(రామగుండం): కట్టుకున్న ఇళ్లకు పట్టాలు లేక..ఇంటి నిర్మాణం కోసం రుణం లభించక..ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కోల్‌బెల్ట్‌ ప్రాంతవాసులకు వరాలు ప్రకటించారు అప్పటి సీఎం దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. దశాబ్దాల తరబడి సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారందరికీ వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద స్థలాలకు పట్టాలు అందించి అందరి పాలిట దైవంగా నిలిచారు.

అసాధ్యంకాని పని.. సుసాధ్యం
రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి పట్టాలిప్పించిన ఘనత దివంగత సీఎం వైఎస్‌ఆర్‌కే దక్కింది. 40 ఏళ్లుగా ఇళ్లలో ఉండి పట్టాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి వెంటనే ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేసి పట్టాలు స్వయంగా వచ్చి అందించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 17,413 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చరిత్రలో నిలిచిపోయారు. సింగరేణి విస్తరణతోపాటు పెద్దసంఖ్యలో కార్మికులు, కార్మికేతరులు సింగరేణి స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని దశాబ్దాల తరబడి ఉంటున్నారు.

కాలక్రమేణ కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. 2008 ఏప్రిల్‌ 11వ తేదీన కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్‌ సింగరేణి స్థలాల్లో ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సింగరేణి అధికారులను ఆదేశించారు. సర్వే చేయించిన సింగరేణి 442 ఎకరాల 9 గుంటల స్థలం, సింగరేణి ఆధీనంలోని 84 ఎకరాల 38 గుంటల ప్రభుత్వ స్థలంలో 21,907 గృహాలు ఆక్రమించుకున్నట్లుగా తేల్చింది. ఇందులో మొదటి విడతగా 17,413 నివాస స్థలాలకు పట్టాలు అందించి పేదల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. పట్టాలు పొందిన వారు వైఎస్సార్‌ను నేటికి స్మరించుకుంటున్నారు.

వీడిన ‘మైక్రో’ భూతం
సిరిసిల్ల: సిరిసిల్ల కార్మికక్షేత్రంలో మైక్రోఫైనాన్స్‌ వేధింపులతో అనేక కుటుంబాలు చితికిపోయాయి. నేతన్నల ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులు ప్రధాన కారణమని గుర్తించిన అప్పటి సీఎం డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి సిరిసిల్ల మహిళలకు సంపూర్ణ ఆర్థిక చేకూర్పు కల్పించారు. ఏకకాలంలో ఒక్కో మహిళకు రూ.50 వేలకు తగ్గకుండా బ్యాంకు రుణాలు ఇప్పించారు. 2009 జనవరి 1న సిరిసిల్ల నేత కార్మిక కుటుంబాలకు చెందిన మహిళలను హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌కు పిలిచి రూ.35 కోట్లు అందించారు. సిరిసిల్ల మహిళలకు చీరలు అందించారు. వైఎస్సార్‌ చొరవతో దరి చేరిన ఆర్థిక చేకూర్పు ఇప్పుడు 18240 మంది సభ్యులతో 1604 సంఘాలతో రూ.128 కోట్ల లావాదేవీలతో సాగుతున్నాయి.

స్వయం ఉపాధికి బాటలు
సిరిసిల్ల మహిళలు బీడీలు చేస్తూ ప్రతీ వారం షేర్‌ముల్ల కడుతూ నానా కష్టాలు పడేవారు. వైఎస్సార్‌ స్ఫూర్తితో సంపూర్ణ ఆర్థిక చేకూర్పు దరిచేరడంతో మైక్రోభూతం మాయమైంది. ప్రతీ మహిళకు కనీసం రూ.50 వేలు రావడంతో ఆర్థిక వెసులుబాటు లభించింది. ఒక్క సిరిసిల్ల పట్టణంలోనే రూ.128 కోట్ల లావాదేవీలు జరగడంతో ఇక్కడి ప్రజల జీవనశైలిలో మార్పు వచ్చింది. కిరాణ దుకాణాలు, పూల వ్యాపారం, పిండిగిర్నీలు, బ్యాంగిల్‌స్టోర్స్, సాంచాల ఏర్పాటు, చీరల దుకాణాలు, మ్యాచింగ్‌ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు, పాడిపశువుల కొనుగోళ్లు వంటి రంగాల్లో బ్యాంకు రుణాలు వినియోగించుకున్నారు. మహిళలకు ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసేందుకు మెప్మా అధికారులు శిక్షణ ఇచ్చారు. సిరిసిల్ల మహిళలు ఆర్థికాభివృద్ధికి వైఎస్సార్‌ బాటలు వేశారు.

నేతన్నలకు బాసట
నేత కార్మిక కుటుంబాలకు వైఎస్సార్‌ బాసటగా నిలిచారు. ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికులకు రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని 2004 నుంచి అందించారు. ఈ లక్షన్నరలో రూ.50వేలతో నేత కార్మికుడికి ఉన్న అప్పులన్నింటినీ అధికారులే సెటిల్‌ చేయాలి. మిగతా రూ.లక్షతో ఆ నేతన్న కుటుంబానికి పునరావాసం కల్పించే విధానాన్ని వైఎస్సార్‌ ప్రవేశపెట్టారు. 236 మంది నేత కార్మిక కుటుంబాలకు ఆసరా లభించింది. ఇప్పుడు ఆత్మగౌరవంతో బతికేందుకు అవకాశం ఏర్పడింది. వరుస ఆత్మహత్యలు జరిగినపుడు సిరిసిల్లకు వచ్చి కార్మిక కుటుంబాలను ఓదార్చారు. ఆందుకుంటామని భరోసా ఇచ్చారు. మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఆరోగ్య సమస్యలు పరిష్కరించారు. సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రిలో మనోవికాస కేంద్రాన్ని ఆయనే ఏర్పాటు చేయడం విశేషం. ప్రతీ నేత కార్మికుడికి 35 కిలోల అంత్యోదయ కార్డులు, పింఛన్లు అందించారు. నేతన్నలను ఆదుకోవడంలో వైఎస్సార్‌ తనదైన ముద్ర వేశారు.

జలయజ్ఞ ప్రదాత
రామగుండం: దివంగత వైఎస్‌ఆర్‌ జలయజ్ఞ ప్రదాతగా చరిత్రలో నిలిచిపోయారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి ప్రాజెక్టు కీలకంగా మారిందనే విషయం సు స్పష్టం. దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయంలో జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం రాష్ట్ర రాజధాని నలుమూలలకు తాగునీటిని అందించే స్థాయికి చేరింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకే ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయ. కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా ఉపయోగపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రివర్స్‌ పంపింగ్‌తో జలాలు లింక్‌–1లో భాగంగా ఎల్లంపల్లిలోకి ఎత్తిపోయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాధాన్యత దేశ,రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.

దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి శ్రీపాద (ఎల్లం పల్లి)ప్రాజెక్టు పూర్తితో ఆయన ఆశయం నెరవేరడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో భావితరాలకు తాగునీటి అందించే స్థాయికి ఎల్లంపల్లి ప్రాజెక్టు చేరింది. ఫలితంగా నేటికీ రాష్ట్ర ప్రజ లు వైఎస్‌ఆర్‌ను తలుచుకుంటుండడంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. ఉ మ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టును జూలై 28, 2004 లో శంకస్థాపన చేయగా గడిచిన ఐదేళ్ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టానికి నీటిని నిల్వ చేస్తున్నారు. దీనికి అప్పుడు రూ.2744 కోట్ల నిధులను కేటాయించారు.

తెలంగాణ గుండెకాయ మిడ్‌మానేరు
బోయినపల్లి (చొప్పదండి): దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌  రైతుపక్షపాతి. గోదావరి జలాలు శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టు నుంచి కరీంనగర్‌ ఎల్‌ఎండీ ప్రాజెక్టును ముద్దాడుతున్నాయి. మెట్టప్రాంతాలకు సాగు, తాగు నీరు అందాలనే దశాబ్దాల రైతుల కళ నెరవేరే సమయం ఆసన్నమైంది. ప్రాజెక్టుల్లోకి చేరుతున్న నీరు రాజన్నకు నివాళి అర్పిస్తున్నాయి.

తెలంగాణకు గుండెకాయ మిడ్‌మానేరు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) ప్రాజెక్టుకు 2006లో అప్పటి సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో 25 టీఎంసీలకు చేరితే ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు, ఎల్‌ఎండీకి, వేములవాడ గుడి చెరువుకు, కాళేశ్వరం–9,10  ప్యాకేజీల నుంచి మల్కపేట,అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ తదితర ప్రాజెక్టులకు నీరు అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి..అటు నుంచి నంది మేడారం మీదుగా రామడుగు లక్ష్మీపూర్‌ పంప్‌హౌస్‌కు..అక్కడి నుంచి వరదకాలువ మీదుగా మిడ్‌మానేరు ప్రాజెక్టుకు గోదావరి జలాలు తరలివస్తున్నాయి. మిడ్‌మానేరులో ఈనెల30 వరకు 15 టీఎంసీల నీరు చేరింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రాజెక్టు 25 గేట్ల నుంచి నీటిని విడుదల చేసి ఎల్‌ఎండీకి తరలిస్తున్నారు. డెడ్‌స్టోరేజికి చేరిన ఎల్‌ఎండీ ప్రాజెక్టు కొద్దిరోజులలో గోదావరి జలాలతో తాగు, సాగు నీరు అందించనుంది.

జీవ నదిలా వరదకాలువ
జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి జగిత్యాల, మల్యాల, గంగాధర, రామడుగు మండలాల మీదుగా బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్‌ రెగ్యులేటర్ల వరకు 122 కిలోమీటర్ల మేర వరదకాలువ నిర్మించారు. అప్పుడు వైఎస్సార్‌ వరదకాలువ నిర్మాణం చేపడితే కాలువలు ఎందుకు తవ్వుతున్నారని హేళన చేసిన వారు ఎందరో ఉన్నారు. రెండేళ్లుగా వరదకాలువలో చేరుతున్న నీరు రైతుల చేలకు ఊపిరిగా మారాయి. వరదకాలువ ఉన్న కొన్ని ప్రాంతాల్లో రివర్స్‌ పంపింగ్‌ పనులు జరుగుతున్నాయి. పనుల నేపథ్యంలో అక్కడ నీరు నిల్వ చేయలేదు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వరదకాలువ 99 కిలోమీటర్‌ నుంచి 122 కిలోమీటర్‌ వరకు గోదావరి జలాలు నిండుగా ఉండడంతో గంగాధర, రామడుగు, బోయినపల్లి మండలాల రైతులు వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు.

రూపం వైఎస్సార్‌..రూపశిల్పి కేసీఆర్‌
ప్రాజెక్టుల నిర్మాణ రూపం వైఎసార్‌ అయి తే..రూపశిల్పి కేసీఆర్‌ అయ్యారు. వైఎస్‌ మరణానంతరం ప్రాజెక్టుల పనులు పడకేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల నిర్మాణాలకు జీవం పోస్తున్నారు. మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి గోదావరి జలాలు తరలివెళ్తున్నాయి.

మెట్టప్రాంతాలకు జీవం
సిరిసిల్ల: మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర) జలాశయం రూపశిల్పి దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి. 2006లోనే మిడ్‌మానేరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. ఇప్పుడది నిండుకుండలా మారంది. 15 టీఎంసీల నీటితో కలకలలాడుతోంది. 

ఇదీ మధ్యమానేరు నేపథ్యం
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయానికి దివంగత నేత వైఎస్‌. రాజశేఖరరెడ్డి 2006లో శ్రీకారం చుట్టారు.. సుమారు రూ.780 కోట్ల అంచనాలతో చేపట్టిన పనులు 12 ఏళ్ల తరువాత ప్రాజెక్టు తుది దశకు చేరి రైతుల భూములను తడిపేందుకు గోదారమ్మ ఎల్‌ఎండీకి తరలివచ్చింది.

మధ్య మా‘నీటి’తో రైతుకు ప్రయోజనం
దివంగత నేత డాక్టర్‌ వైఎస్సార్‌ చొరవతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు సాకారంకావడం ఈప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద సీఎం హోదాలో వైఎస్సార్‌.. ఎత్తిపోతల పథకానికి పైలాన్‌ ఆవిష్కరించారు. ఆయన ముందుచూపుతోనే మధ్యమానేరు జలాశయం, శ్రీరాంసాగర్‌ వరద కాల్వ పూర్తయిదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.

వరదకాలువ నీటితో ఉపాధి
మిడ్‌మానేరు డ్యాంలో మా ఊరు నీలోజిపల్లి మునిగింది.. పొలం, చేను పోయింది. జగ్గారావుపల్లి గ్రామ వరద కాలువ పరిసరాల్లో నాలుగు ఎకరాల మేర భూమి కొన్నా. వరదకాలువ నీళ్లతో ఏటా రెండు ఫసళ్లు వరి పంట వేస్తున్నా. వైఎస్‌ఆర్‌ నిర్మించిన వరదకాలువకు నీళ్తు వస్తున్నయి. వరద కాలువ నీటితో చేను పండి మా ఇంటికి ఉపాధి దొరుకుతోంది.
– కడుదుల శ్రీనివాస్, నీలోజిపల్లి రైతు బోయినపల్లి

వైఎస్సార్‌ జీవం పోశారు
ఒకప్పుడు మా ప్రాంతం అంతా వర్షాలు లేక కరువుతో రైతులు గల్ఫ్‌ దేశాలు, ముంబాయి పోయేవారు. దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ మధ్యమానేరు ప్రాజెక్టుకు భూమిపూజ చేయడం కారణంగానే ఇప్పుడు బావులు, బోర్లలో భూగర్భజలాలు పెరిగాయి. వైఎస్‌ చలువతోనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండబోతుంది. 
–  మ్యాక తిరుపతి, పాండలపురం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement