
సాక్షి, హైదరాబాద్: ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసి పేదల హృదయాల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ముందుకెళతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 69వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులు అర్పించినవారిలో మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులున్నారు.
అనంతరం విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడుతూ పేదల కోసం వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని, ఆయన హయాంలోనే అసలైన అభివృద్ధి, సంక్షేమం అమలయ్యాయని చెప్పారు. నాటి వైఎస్ సంక్షేమ కార్యక్రమాలను నేటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
ఇందిరా భవన్‌లోనూ...
ఏపీ కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. వైఎస్ చిత్రపటానికి ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment