
వరికి మద్దతు రూ. 1,410
ధాన్యం మద్దతు ధరలు, సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
మేలు రకం ధాన్యానికి రూ.1,450
ప్రస్తుత ఖరీఫ్‌లో 15 నుంచి 20 లక్షల టన్నుల సేకరణకు నిర్ణయం
ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ల ద్వారా కొనుగోళ్లు
48 గంటల్లో ఆన్‌లైన్ ద్వారా సొమ్ము చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం సేకరణ విధానాన్ని, మద్దతు ధరలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మేలురకం (గ్రేడ్ ఏ)ధాన్యం క్వింటాల్‌కు రూ.1,450, సాధారణ రకానికి రూ.1,410 ధరలతో ధాన్యం సేకరించనున్నట్లు ప్రకటించింది. జీరో లెవీ విధానం అమల్లోకి వచ్చినందున పూర్తిస్థాయి సేకరణను పౌరసరఫరాల శాఖే చేపడుతుందని.. దీనికోసం అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. రైతులకు సొమ్మును 48 గంటల్లో ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు కొత్త ధాన్యం సేకరణ మార్గదర్శకాలను పౌరసరఫరాల శాఖ కమిషనర్ రజత్‌కుమార్ విడుదల చేశారు.
- జీరో లెవీ అమల్లో ఉన్న కారణంగా ప్రస్తుత ఖరీఫ్‌లో 15 నుంచి 20 లక్షల టన్నులు, రబీలో 20 నుంచి 25 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తారు.
- ధాన్యం సేకరణ కేంద్రాలను ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ల ద్వారా తెరిపించే బాధ్యతను పౌర సరఫరాల శాఖ తీసుకోవాలి.
- కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం మొత్తాన్నీ కచ్చితంగా కొనాలి. విసృ్తత ప్రచారం ద్వారా మద్దతు ధర, ధాన్యం నాణ్యత వివరాలు, కేంద్రాలపై రైతులకు అవగాహన కల్పించాలి. మిల్లింగ్ కేంద్రాలకు దగ్గరగా ఈ కేంద్రాల ఏర్పాటు జరగాలి. ఈ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది జాయింట్ కలెక్టర్లు ముందుగానే గుర్తించాలి.
- ఒకవేళ ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల నిర్వహణకు సంఘాలు ముందుకు రాకుంటే మార్క్‌ఫెడ్ సేవలను లేక ఇతర సహకార సంఘాల సేవలను వినియోగించుకోవాలి.
- కొనుగోలు కేంద్రాల్లో షెల్టర్లు, తాగునీరు, మూత్రశాలలు వంటి మౌలిక వసతులు కల్పించాలి. కొనుగోలుకు అవసరమైన గోనె సంచులు, ధాన్యం క్లీనర్లు, టార్పాలిన్లను ముందుగానే సమకూర్చుకోవాలి.
- కొనుగోలు కేంద్రాల్లో రైతుల బ్యాంకు ఖాతా వివరాలతో సహా అన్ని రకాల వివరాలు డేటాబేస్‌లో పొందుపర్చాలి. బ్యాంకు ఖాతాలు లేని రైతులు ఎవరైనా ఉంటే వారిచే ఖాతాలు తెరిపించేందుకు చొరవ చూపాలి.
- కొనుగోలు కేంద్రాలకు ఎవరు ముందుగా ధాన్యం తీసుకొస్తే వారి ధాన్యాన్ని ముందుగా సేకరించాలి. వేచిచూసే పరిస్థితులు రానీయకుండా ఏ ఊరు ధాన్యాన్ని ఎప్పుడు సేకరిస్తారో ముందుగానే షెడ్యూల్ విడుదల చేయాలి.
- ధాన్యాన్ని వెంటనే కస్టమ్ మిల్లింగ్‌కు పంపి, వచ్చిన బియ్యాన్ని వెంటనే ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖకు పంపాలి.
- కస్టమ్ మిల్లింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించి, దీన్ని పాటించని మిల్లర్లపై తగు చర్యలు తీసుకోవాలి.