
ఆ ఒక్కరు ఎవరో..
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో కొత్త చైర్‌పర్సన్ ఎవరనేది తేలిపోనుంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి ఈసారి షెడ్యూల్ కులాల(ఎస్సీ) మహిళకు రిజర్‌వ అయింది.
జెడ్పీ చైర్‌పర్సన్ రేసులో ముగ్గురు
సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో కొత్త చైర్‌పర్సన్ ఎవరనేది తేలిపోనుంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి ఈసారి షెడ్యూల్ కులాల(ఎస్సీ) మహిళకు రిజర్‌వ అయింది. జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 9 స్థానాలను ఎస్సీలకు కేటాయించారు. వీటిలో ఐదు ఎస్సీ మహిళలకు రిజర్‌వ అయ్యాయి. ఎస్సీ మహిళకు రిజర్వు అయిన వాటిలో దేవరుప్పుల, కొడకండ్ల, గోవిందరావుపేట జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. నర్మెటలో టీఆర్‌ఎస్, రాయపర్తిలో టీడీపీ అభ్యర్థులు జెడ్పీటీసీలుగా గెలిచారు. ఎస్సీ జనరల్‌కు కేటాయించి న నెక్కొండ, పర్వతగిరి జెడ్పీటీసీలుగా ఈ వర్గానికి చెందిన మహిళా అభ్యర్థులే గెలిచారు.
పర్వతగిరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మాదాసి శైలజ, నెక్కొండలో కాంగ్రెస్‌కు చెందిన బక్కి కవిత జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్ పదవి విషయంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మ ధ్య పోటీ నెలకొంది. 24 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ... సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచీ క్యాంపు నిర్వహిస్తోంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ క్యాంపులో ఎస్సీ వర్గానికి చెందిన నెక్కొండ జెడ్పీటీసీ సభ్యురాలు బక్కి కవిత, గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు ఎన్.విజయలక్ష్మీ ఉన్నారు. దేవరుప్పుల, కొడకండ్ల జెడ్పీటీసీ సభ్యులు ఈ క్యాంపులో చేరలేదు. అరుుతే నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ జెడ్పీటీసీ సభ్యురాలు బి.కవితను కాంగ్రెస్ తమ జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా చెబుతోంది. కాంగ్రెస్ క్యాంపులో ప్రస్తుతం 24 మంది ఉన్నారని, ఇతర సభ్యుల మద్దతుతో జెడ్పీ పీఠం తామే దక్కించుకుంటామని ఈ పార్టీ నేతలు చెబుతున్నారు.
టీఆర్‌ఎస్‌లో ఇద్దరు..
తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాలో 18 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకుంది. టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ సభ్యులలో నర్మెట, పర్వతగిరి నుంచి గెలిచిన జెడ్పీటీసీ సభ్యులు చైర్ పర్సన్ పదవికి పోటీ పడుతున్నారు. ఎస్సీ జనరల్‌కు కేటాయించిన పర్వతగిరిలో మాదాసి శైలజ జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచారు. 24 ఏళ్ల వయసులోనే ఈమె జెడ్పీటీసీగా గెలిచారు. పర్వతగిరి వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి సొంత మండలం కావడం.. శైలజకు చైర్‌పర్సన్ పద వి విషయంలో అనుకూలంగా మారింది. శైలజ భర్త మాదాసి సుధాకర్ టీఆర్‌ఎస్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం వర్ధన్నపేట టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అరూరి రమేశ్‌కు సుధాకర్ దగ్గరయ్యారు. శైలజకు జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం దక్కేలా చూసేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా రు. వరంగల్ లోక్‌సభ సభ్యుడు కడియం శ్రీహరి, ముఖ్యమంత్రి కేసీఆర్ వ ద్ద చేసే ప్రయత్నాలతోనే శైలజకు జెడ్పీ పీఠం దక్కే అవకాశాలను ఉన్నాయ ని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
టీఆర్‌ఎస్ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం కోసం నర్మెట్ట జెడ్పీటీసీ సభ్యురాలు గద్దల పద్మ కూడా పోటీలో ఉన్నా రు. పద్మ గతంలో ఎంపీటీసీగా కూడా పని చేశారు. పద్మ భర్త నర్సింగరావు టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ పదవి తన నియోజకవర్గానికి దక్కేలా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టీఆర్‌ఎస్ అధినేత వద్ద తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చైర్ పర్సన్ పదవి కోసం పోటీ పడేవారు ఇద్దరు ఉండడంతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్ క్యాం పులో ప్రస్తుతం 25 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారని, మరో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు మద్దతు ఇస్తారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.
విప్ పత్రాలను అందజేసిన కాంగ్రెస్
జిల్లా పరిషత్ : జిల్లాలోని ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విప్ జారీ చేసే అధికారం జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి ఇస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఉత్తర్వులు జారీ చేశారు. విప్ అధికారం కల్పిస్తూ జారీ చేసిన పత్రాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాపోలు జయప్రకాశ్, యువజన కాంగ్రెస్ నాయకుడు ఈవీ.శ్రీనివాస్‌రావు బుధవారం జెడ్పీ ఇంచార్జ్ సీఈఓ వెంకటేశ్వర్లుకు అందించారు.