ఇరాక్ నుంచి స్వదేశానికి 193 మంది తెలుగువారు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఇరాక్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 193 మంది తెలుగువారు ఆదివారం తెల్లవారుజామున క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల వారితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వీరిని అధికారులు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఏపీ భవన్‌కు తరలించారు. అనంతరం ఆదివారం రాత్రి విమానాల్లో ఎక్కువ మందిని హైదరాబాద్‌కు, 18 మందిని నేరుగా విశాఖకు పంపారు. అంతకుముందు ఏపీభవన్‌లో బాధితులను ‘సాక్షి’ పలకరించగా వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇరాక్‌లోని భారత ఎంబసీ చలువతోనే మళ్లీ స్వదేశానికి తిరిగి రాగలిగామని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కి చెందిన సీహెచ్ మహిపాల్ తెలిపారు.
‘ కంపెనీల ఉద్యోగమని ఏజెన్సీ వాళ్లు చెప్పి మోసం చేసిండ్రు. అక్కడ బల్దియల పనిచేసినం. ఇబ్బంది పెట్టేటోళ్లు. చేతకాకపోతే కొట్టి పనిచేయించేటోళ్లు. మూడు నెల్ల జీతం రాలేదు’ అని తెలిపారు. కొందరికి రెండు, మూడు నెలల జీతాలు ఇవ్వకుండానే పంపించారని తణుకుకు చెందిన మురళీకృష్ణ తెలిపారు. పనిచేయకపోతే తుపాకులతో బెదిరించేవారన్నారు. ఉపాధి కోసం రూ. లక్ష అప్పు చేసి ఇరాక్ వెళ్లిన ఎంతో మంది తిరిగి రావడానికి భయపడుతున్నారన్నారు. ఇరాక్ వెళ్లేందుకు రూ. లక్షన్నర చొప్పున ఖర్చు చేసుకున్నామని, ఇప్పుడు జీతాలు లేక ఇళ్లకు వస్తే అప్పుల బాధకు ఇక్కడైనా చావు తప్పదని కొందరు ఇరాక్‌లోనే బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెంట్లకు డబ్బులిచ్చి, ఇప్పుడు జీతాలు లేక అప్పులపాలైన తమను ప్రభుత్వాలే ఆదుకోవాలని బాధితులు మోరపెట్టుకున్నారు.