
ఇక లాక్కోవటమే
రైతులు, రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నిరసనలు, ఆందోళనలను బేఖాతరు చేస్తూ ఏటా రెండు మూడు పంటలు పండే బంగారు భూములను లాక్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.
భూ సేకరణ చట్ట ప్రయోగానికి రంగం సిద్ధం
* రాజధానికి 2,300 ఎకరాలు చాలన్న సింగపూరు మాస్టర్‌ప్లాన్
* అయినా ఇప్పటికే 33,400 ఎకరాలు సమీకరణ
* తాజాగా తుళ్లూరులో 755 ఎకరాలపై కన్నేసిన సర్కారు
* మొత్తం 2,200 ఎకరాల భూసేకరణకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రైతులు, రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నిరసనలు, ఆందోళనలను బేఖాతరు చేస్తూ ఏటా రెండు మూడు పంటలు పండే బంగారు భూములను లాక్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.
రాజధాని ప్రాంతంలో భూములివ్వకుంటే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి మరీ భూములు లాక్కుంటామని తొలి నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే రైతులపై భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తోంది. అవసరమైన భూముల కోసం రైతులపై భూ సేకరణ అస్త్రం ప్రయోగించాలని ఆదేశిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేకు అనుమతిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
దేశంలోనే ఎక్కడా లేని ప్యాకేజీ ఇచ్చి భూ సమీకరణ చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం రాజధాని పేరుతో ఇప్పటికే 33,400 ఎకరాలను సమీకరించినట్టు ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి 2,300 ఎకరాలు చాలని స్వయంగా సింగపూరు అందజేసిన మాస్టర్‌ప్లాన్‌లోనే ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఇంకా భూ దాహం తీరలేదు. గుంటూరు కలెక్టర్‌కు ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం భూ సేకరణనోటిఫికేషన్ జారీ కాబోతోంది.
తొలివిడతలో 755 ఎకరాల సేకరణ
భూ సేకరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనోద్యమాలు చెలరేగిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్‌లో సవరణలకు సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. దానిపై 30 మంది పార్లమెంట్ సభ్యులతో ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. అయినా ఆంధ్రప్రదేశ్‌లో కనీస ప్రజాస్వామిక పద్ధతులేవీ పాటించకుండానే ఏకపక్షంగా వేలాది ఎకరాలను లాక్కుని విదేశీ కంపెనీలకు కట్టబెట్టడానికి సిద్ధం కావడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తొలుత తుళ్లూరులో 755 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే ఐదు రోజుల వ్యవధిలో మిగిలిన 1,500 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసేందుకూ రంగం సిద్ధమైంది. మొత్తం 2,200 ఎకరాల భూసేకరణకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (డీఎన్), డ్రాఫ్ట్ డిక్లరేషన్ (డీడీ), అవార్డు జారీ చేసేందుకు రెవెన్యూ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.
రాజధాని ప్రాంతంలో రైతులనుంచి ల్యాండ్ పూలింగ్‌ద్వారా సమీకరించిన 33,400 ఎకరాలకు అదనంగా మరో 2,200 ఎకరాలు అవసరమని మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు అనేకసార్లు పేర్కొనడం తెలిసిందే. ఇప్పటివరకు 26,900 ఎకరాలకు సంబంధించి రైతులు అంగీకార పత్రాలిచ్చి అగ్రిమెంట్లు తీసుకున్నారు. ప్రభుత్వం రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ల్యాండ్‌పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ గడువు ఆగస్టు 20 (గురువారం)తో ముగిసింది.పూలింగ్‌లో భూములివ్వబోమంటూ సుమారు 1,600 మంది 9.2 అభ్యంతర పత్రాలిచ్చారు. వీటికి ఇంతవరకూ ప్రభుత్వం పరిష్కారం చూపలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు, సంప్రదింపులకు అస్కారమే ఇవ్వలేదు. తాజాగా భూసేకరణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో రాజధాని ప్రాంత గ్రామాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు గురువారం రాత్రి తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
వ్యతిరేకిస్తున్న గ్రామాలే టార్గెట్
తొలి నుంచి సమీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రాజధాని గ్రామాలే లక్ష్యంగా భూసేకరణ అస్త్రం ప్రయోగిస్తోంది. 29 గ్రామాల్లో మొత్తంగా 3,821 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించగా అందులో 3,066 ఎకరాలు ఈ రెండు మండలాల్లో ఉన్న ఐదు గ్రామాల్లోనివే. నాలుగురోజుల కిందట మంత్రి నారాయణ 2,200 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు.
తీరా నోటిఫికేషన్ జారీ చేసే సమయానికి ఈ లెక్క 3,821కి చేరింది. తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో 992 ఎకరాలు, పెనుమాకలో 522 ఎకరాలు, మంగళగిరి మండలం నవులూరులో 690, కురగల్లులో 184, నిడమర్రులో 678 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. తుళ్లూరు మండలంలో మిగిలిన 755 ఎకరాల భూములకోసం నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు సమాచారం.
అర్ధరాత్రి వరకు కసరత్తు : భూసేకరణ చట్ట ప్రయోగానికి సంబంధించిన అనుమతుల జారీ, పూర్వ రంగం సిద్ధం చేసే పనిలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారులు గురువారం రాత్రి పొద్దుపోయేవరకూ కార్యాలయాల్లోనే గడిపారు. సీఆర్‌డీఏ విజ్ఞప్తి మేరకు గుంటూరు జిల్లాలో భూసేకరణ కోసం ప్రాథమిక ప్రకటన (డ్రాఫ్ట్ నోటిఫికేషన్) జారీకి అక్కడి కలెక్టరు కాంతిలాల్ దండేకి గురువారం అనుమతులిచ్చారు.
ఇప్పటివరకూ భూ సమీకరణ అధికారులుగా ఉన్న 26 మంది డిప్యూటీ కలెక్టర్లను భూసేకరణ అధికారులుగా నియమిస్తూ రెవెన్యూ శాఖ గురువారం రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. ఎంత విస్తీర్ణం మేరకు భూమి కావాలనే అంశాన్ని సీఆర్‌డీఏ స్పష్టంగా పేర్కొనలేదు.భూసమీకరణలో అంగీకార పత్రాలు ఇవ్వని, కోర్టుకెళ్లిన వారి భూములను కూడా తర్వాత సేకరణ ద్వారా తీసుకోవాలనే వ్యూహంతోనే సీఆర్‌డీఏ రెవెన్యూ శాఖకు పంపిన వినతిలో ఎంత భూమి అనే అంశాన్ని ప్రస్తావించలేదని విశ్వసనీయ సమాచారం.
విడతల వారీగా సేకరించాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే భూసేకరణ ప్రాథమిక ప్రకటన (డ్రాఫ్ట్ నోటిఫికేషన్ - డీఎన్), డ్రాఫ్ట్ డిక్లరేషన్ (డీడీ), అవార్డు ప్రకటనల జారీ చేసేందుకు గుంటూరు కలెక్టరుకు అనుమతించింది. మొదట తుళ్లూరులో 755 ఎకరాల సేకరణకు ప్రాథమిక ప్రకటన (డ్రాఫ్ట్ నోటిఫికేషన్ - డీడీ) జారీ చేసి తర్వాత మరో 1500 ఎకరాలకు డీడీ జారీ చేస్తారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే...
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే ముసాయిదా ప్రకటన అని అర్థం. ఏదైనా ప్రాంతంలో భూసేకణ చట్టం కింద భూమిని సేకరించాలంటే మొదట భూసేకరణ అధికారి డీఎన్ జారీ చేయాలి. ఏయే ప్రాంతం (గ్రామం/ పట్టణం)లో ఏయే సర్వే నంబర్లలో ఎవరెవరికి చెందిన ఎంతెంత భూమిని ఎందుకోసం సేకరించదలిచారో ఈ ప్రాథమిక ప్రకటనలో వివరంగా ప్రకటిస్తారు. భూసేకరణ చట్టం ప్రయోగించదలచిన భూములు, వాటి యజమానుల వివరాలన్నీ ఈ డీఎన్‌కు సంబంధించిన పత్రికా ప్రకటనలో వివరిస్తారు.
భూ సేకరణ చేపట్టే గ్రామాలు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో తొలిదశ భూసేకరణకు సంబంధించిన వివరాలను గురువారం రాత్రి పొద్దుపోయాక గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే వెల్లడించారు. తుళ్లూరు మండలంలోని ఐదు గ్రామాల్లో మొత్తం 11.04 ఎకరాల్లో భూసేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందులో తుళ్లూరు గ్రామంలో 4.28 ఎకరాలు, అనంతవరంలో 4.26 , బోయపాలెం 0.83, పిచకలపాలెం 0.78, అబ్బురాజుపాలెంలో 0.89 ఎకరాలు ఉన్నాయి.
పవన్‌ను ఒప్పించి భూసేకరణ: పుల్లారావు
పవన్‌కల్యాణ్‌తో తమకెలాంటి విభేదాలు లేవని, ఎలాగైనా సరే ఆయన్ను ఒప్పించి 2,200 ఎకరాలకు భూసేకరణ చేపడతామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. అవసరాన్నిబట్టి మంత్రులమంతా పవన్‌తో మాట్లాడతామని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మీడియాతో మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ ల్యాండ్‌పూలింగ్‌పైనా ఢిల్లీలో ఎన్నో పోరాటాలు చేశారని... మేధాపాట్కర్, రిటైర్డ్ జడ్జీలు వచ్చారని, అయినప్పటికీ రైతులు భూసమీకరణ కింద భూములిచ్చారని చెప్పారు.
సింగపూర్ ప్రభుత్వం సీడ్ కేపిటల్ ప్లాన్ ఇచ్చాక రాజధాని ప్రాంతంలో ఎకరా రూ.3.5 కోట్లు విలువ పలికిందని, ఇంకా ప్లాన్‌లు చూస్తే ఈ ధరలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. ల్యాండ్‌పూలింగ్‌పై కోర్టుకెళ్లిన వారి భూములను భూసేకరణ కింద చేపడతామని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.