
2జీ వేలం సక్సెస్
2జీ వేలం ప్రభుత్వానికి అంచనాలను మించి కాసులు కురిపించింది. 10 రోజుల పాటు జరిగిన ఈ స్పెక్ట్రం వేలంలో రూ.61,162 కోట్ల ఆదాయం లభించింది.
న్యూఢిల్లీ: 2జీ వేలం ప్రభుత్వానికి అంచనాలను మించి కాసులు కురిపించింది. 10 రోజుల పాటు జరిగిన ఈ స్పెక్ట్రం వేలంలో రూ.61,162 కోట్ల ఆదాయం లభించింది. వీటిలో రూ. 18,296.36 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వ ఖజానాకు జమ అవుతాయి. ఈ స్పెక్టమ్ వేలం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.11,300 కోట్లు నిధులొస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. వేలం విజయవంతంగా పూర్తయిందని టెలికాం మంత్రి కపిల్ సిబల్ సంతోషం వ్యక్తం చేశారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల కారణంగా ఈ స్పెక్ట్రమ్ వేలం జరిగింది. 2012 ఫిబ్రవరిలో 122 లెసైన్స్‌లను రద్దు చేసింది. వీటికి సంబంధించిన స్పెక్ట్రంను తాజాగా వేలం వేశారు.
900 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం కోసం రూ.37,572.60 కోట్లు, 1800 మెగా హెర్ట్స్ స్పెక్ట్రంకు కోసం రూ.23,589.62 కోట్ల బిడ్‌లు వచ్చాయని టెలికం కార్యదర్శి ఎం.ఎఫ్.ఫరూఖీ చెప్పారు. 900 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం బిడ్‌లో 25%, 1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బిడ్‌లో 33%మొత్తాన్ని ప్రభుత్వానికి ఆయా స్పెక్ట్రమ్‌లు పొందిన కంపెనీలు తక్షణం చెల్లించాలి.
ఈ స్పెక్ట్రమ్ వేలంలో అతి పెద్ద విజేతగా వొడాఫోన్ నిలిచింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో ఈ ఏడాది నవంబర్ నాటికి వొడాఫోన్ లెసైన్స్ గడువు ముగుస్తుంది. అందుకని ఈ మూడు మెట్రోల్లో 900 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రాన్ని, ఇతర 11 సర్కిళ్లలో 2జీ 1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం కోసం రూ.19,600 కోట్లకు బిడ్లను దాఖలు చేసింది. ఈ స్పెక్ట్రమ్ పొందడంతో మూడు ముఖ్యమైన టెలికం సర్కిళ్లలో 20 ఏళ్ల పాటు వ్యాపారం నిర్వహించనున్నామని, వొడాఫోన్ ఇండియా ఎండీ, సీఈవో మార్టెన్ పీటర్స్ చెప్పారు.
ఇక ఢిల్లీ, కోల్‌కతాల్లో ఈ ఏడాది నవంబర్ నాటికి గడువు ముగుస్తున్న భారతీ ఎయిర్‌టెల్ 900 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను ఆ రెండు మెట్రోల్లోనే కాకుండా ముంబైలో కూడా పొందింది. అంతేకాకుండా 15 టెలికం సర్కిళ్లలో 1,800 మెగాహెర్ట్జ్‌స్పెక్ట్రంను కూడా పొందింది.దీని కోసం రూ.18,530 కోట్లకు బిడ్లను దాఖలు చేసింది.
3జీ కమ్యూనికేషన్స్‌కు ఉపయోగపడే 900 మెగా హెర్ట్స్ స్పెక్ట్రమ్‌ను పొందిన చివరి, మూడవ కంపెనీగా ఐడియా నిలిచింది. ఈ కంపెనీ 900 మెగా హెర్ట్స్ స్పెక్ట్రమ్‌ను ఢిల్లీ మెట్రోలో గెల్చుకుంది. 1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ఈ కంపెనీ 11 సర్కిళ్లలో పొందింది. ఇక యూనినార్ సంస్థ 1800మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో నాలుగు సర్కిళ్లలో స్పెక్ట్రమ్‌ను రూ.844.7 కోట్లకు పొందింది. అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్ ఒక సర్కిల్‌లోనూ(ముంబై), ఎయిర్‌సెల్ 5 సర్కిళ్లలోలనూ స్పెక్ట్రం పొందాయి. టాటా కమ్యూనికేషన్స్ ఒక్క సర్కిల్‌లోనూ స్పెక్ట్రంను పొందలేకపోయింది.
మొబైల్ టారిఫ్‌లు పెరుగుతాయా?
ఏ వేలం ప్రధాన ఉద్దేశమైనా సమర్థవంతమైన సేవలను సమంజసమైన ధరలకు అందించడమేనని టెలికాం మంత్రి కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో టారిఫ్‌లు సమంజసమైన స్థాయిలోనే ఉంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కంపెనీలు భారీ మొత్తాలకు స్పెక్ట్రమ్‌ను దక్కించుకోవడం వల్ల టారిఫ్‌లు పెరుగుతాయా అన్న ప్రశ్నకు ఆయన ఆ విధంగా స్పందించారు.
కాగా వేలంలో అధిక ధరలకు కంపెనీలు బిడ్‌లు వేశాయని, ఫలితంగా చౌక ధరలకు మొబైల్ టారిఫ్‌లను అందించడం కష్టమేనని యూనినార్ సీఈవో మెర్టెన్ కార్ల్‌సన్ సోర్బీ అభిప్రాయపడ్డారు. అయితే స్పెక్ట్రమ్ ధర అధికంగా ఉండడం వల్ల కాల్ రేట్లు, ఇతర మొబైల్ సర్వీసుల ధరలు పెరిగే అవకాశాల్లేవనేది విశ్లేషకుల వాదన. స్పెక్ట్రమ్ పొందడానికి అధిక ధరలను కంపెనీలు చెల్లించినప్పటికీ, తీవ్రమైన పోటీ దృష్ట్యా ధరలు పెరిగే అవకాశాల్లేవనేది వారి వాదన. మరోవైపు ఈ స్పెక్ట్రమ్ వేలంలో అసలు విజేత ప్రభుత్వమేనని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్. మాధ్యూస్ వ్యాఖ్యానించారు. స్పెక్ట్రమ్ ధరలు పెరిగిపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.