300మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రణాళిక!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ దుశ్చర్యలకు ఇదొక సజీవ సాక్ష్యంగా నిలిచే అంశం. ఓ పక్క భారత్తో శాంతియుత చర్చలు అని పేర్కొంటూనే దేశాన్ని అస్థిర పరచాలన్న వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతూనే ఉంది. ఆ దేశ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ ద్వారా ఉగ్రవాద స్థావరాలకు బాసటగా నిలుస్తోంది. మొత్తం 300 మందిని కరడుగట్టిన ఉగ్రవాదులుగా తీర్చిదిద్ది భారత్లోకి ప్రవేశ పెట్టేందుకు సిద్ధం చేసింది.
ఇప్పుడు వారంతా భారత్లోని సరిహద్దు ప్రాంతాల గుండా చొరబడే సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రాథమిక వర్గాల సమాచారం. పాక్లోని లష్కరే ఈ తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు చెందిన17 ఉగ్రవాద స్థావరాల్లో 300 మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే అంశాన్ని భారత్ పాక్తో చర్చించాలని భావించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా భారత్ సిద్ధం చేసి పాక్ను నిలదీసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే ఇంతలోనే ఇరు దేశాలమధ్య చర్చలు ఆగిపోయిన విషయం తెలిసిందే.