'రతన్గడ్' మృతుల్లో 50 మంది యూపీ వాసులు
రతన్గడ్ ఆలయం సమీపంలో ఆదివారం జరిగిన తొక్కిసలాట మృతుల్లో 50 మంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు మంగళవారం లక్నోలో వెల్లడించారు. వారిలో 33 మంది మహిళలు, చిన్నారులు మరణించారని చెప్పారు. దతియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లా నుంచి మృతుల వివరాలను సేకరిస్తున్నట్లు వారు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియా జిల్లాలో రతన్గడ్ ఆలయం ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆ దేవాలయం సమీపంలోని సింధ్ నదీ వంతెన కిక్కిరిసింది. వంతెన కూలిపోతుందని పుకార్లు వెల్లవెత్తాయి. దాంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భక్తులు నలు దిశలా పరుగులు తీశారు. అందులోభాగంగా తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఆ క్రమంలో 115 మందికి పైగా మరణించారు. వందాలాది మంది దతియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.