నదిలో నోట్లు కొట్టుకువచ్చాయి..
లక్నో: 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్లధనం దాచుకున్న కుబేరులు హడలిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నోట్ల కట్టలు చెత్తకుండీల్లో కనిపించినట్టు వార్తలు రాగా, ఉత్తరప్రదేశ్లోని బరేలి జిల్లాలో కొందరు 500, 1000 రూపాయల నోట్లను కాల్చి గంగానదిలోకి విసిరేశారు. మీర్జాపూర్ వద్ద నదిలో కొట్టుకు వస్తున్న నోట్లను స్థానికులు గుర్తించారు. వందలాది నోట్లు తేలియాడుతూ కనిపించాయి.
ఈ విషయం తెలియగానే స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొందరు పడవలపై వెళ్లి, మరికొందరు నదిలో ఈతకొడుతూ నోట్లను సేకరించారు. కొన్ని నోట్లు కొద్దిగా కాలిపోయి ఉండగా, మరికొన్ని చిరిగిపోయాయి. కొన్ని మాత్రం బాగానే ఉన్నాయి. స్థానికులు ఈ నోట్లను ఎండలో ఆరబెట్టి తీసుకెళ్లారు. పోలీసులకు సమాచారం రావడంతో అక్కడి వెళ్లి నదిలోకి జనం వెళ్లకుండా అడ్డుకున్నారు. నదిలో చాలా నోట్లు కొట్టుకు వచ్చాయని, అయితే కచ్చితంగా ఎన్ని నోట్లు అన్న విషయం తెలియదని పోలీసులు చెప్పారు.