వారి ఆధార్ కార్డ్ నెంబరే పీఎఫ్ నంబర్
భువనేశ్వర్ :దేశంలో ఉన్న లక్షలమంది బొగ్గు గని కార్మికులకు మేలుచేసే లక్ష్యంతో కోల్ ఇండియా లిమిటెడ్ ఓనిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ , అసంఘటిత కార్మికుల పీఎఫ్ కష్టాలను నెరవేర్చేందుగాను కార్మికుల ఆధార కార్డు నంబరునే పీఎఫ్ నెంబర్ గా పరిగణించేందుకు నిర్ణయించింది. ఒడిశాలోని పూరిలో జరిగిన కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) అనుబంధ సంస్థల డైరెక్టర్లు (పర్సనల్), కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్వో) కమిషనర్ బీకే పాండా, సీఎంపీఎఫ్వో ప్రాంతీయ కార్యాలయాల అధికారులు హాజరైన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తాజా నిర్ణయం ప్రకారం దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న 5 లక్షల కార్మికుల ఆధార్ నెంబరును ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు అనుసంధానం చేస్తారు. అనంతరం ఆ నంబరునే బొగ్గు గనుల ప్రావిడెంట్ ఫండ్ నంబరుగా పరిగణించనున్నారు. ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నామని, గుడ్ గవర్నెన్స్ దినంగా పాటించే డిసెంబర్ 25, 2016 నుంచి అమల్లోకి వస్తుందని మహానంది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ డైరెక్టర్ (పర్సనల్) ఎల్ ఎన్ మిశ్రా చెప్పారు. దీనివ్లల కాంట్రాక్ట్ కార్మికులకు, అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అలాగే బొగ్గుగని కార్మికుల డాటా బేస్ ను తయారుచేస్తున్నామని, ఒక పోర్టల్ కూడా రూపొందించనున్నామని తెలిపారు. దీంతోపాటూ ఆన్ లైన్ లోనే పీఎఫ్ వివరాలు తెలుసుకోవడం, ఎస్ఎమ్మెస్ తదితర సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు.