ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీనే కాదు.. బీజేపీని కూడా సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీనే కాదు.. బీజేపీని కూడా సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా తమ ఆధిక్యాలు గణనీయంగా తగ్గిన విషయం ఆ పార్టీ నేతలను ఆశ్చర్యంలో పడేసింది. కేజ్రీవాల్ పార్టీ ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని నాయకులు అంగీకరించినా.. తాము మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న ధీమాను వ్యక్తం చేశారు.
''ఆప్ మాకు పోటీ ఇస్తుందని భావించామని, కానీ రెండంకెల సంఖ్యను చేరుకుంటుందని మాత్రం అనుకోలేదని బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి విజయ్ గోయల్ అన్నారు. గడిచిన పదిహేనేళ్లలో తాము ఢిల్లీలో ఎంతో కష్టపడినా, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాటి ఫలితాలు అనుభవిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఢిల్లీలో ఉన్న మొత్తం 70 స్థానాలకు గాను కనీసం 38 వస్తాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుత ఆధిక్యాలు చూస్తే మాత్రం బీజేపీ ఫలితాలు కాస్త అటూ ఇటూగా సాగుతున్నాయి. స్పష్టమైన ఫలితాలు వెలువడే వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది.