కోటి రూపాయలను మార్చడానికి గంట చాలట!
కోటి రూపాయలను మార్చడానికి గంట చాలట!
Published Mon, Dec 19 2016 9:14 AM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM
ముంబాయి : పాత నోట్లకు బదులు కొత్త నోట్లను ఎలా తీసుకోవాలి, రోజువారీ కార్యకలాపాలు ఎలా సాగించాలి అని కోట్లాది మంది ప్రజలు తలలు పట్టుకుంటుంటే, కొంతమంది మాత్రం కోట్లకు కోట్ల పాత నోట్లను ఒక్క గంటల్లోనే మార్చేసుకుంటున్నారు. ఎంచక్కా బ్లాక్మనీని కొత్త కరెన్సీ నోట్ల రూపంలోకి మార్చేసుకుని ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు తెస్తే మాకేమన్నటూ వ్యవహరిస్తున్నారు. వీటికి అద్దం పడుతూ తాజాగా సీఐడీ, ఐటీ, సీబీఐ తనిఖీల్లో భారీగా కొత్త కరెన్సీ నోట్లు బయటపడుతున్నాయి. అక్రమ మార్గంలో నగదు మార్చడానికి బ్లాక్మనీ హోల్డర్స్కు ఏజెంట్స్ సహకరిస్తున్నారని తెలుస్తోంది. ఒక గంటల్లో వారు కోటి రూపాయలను మార్చేస్తున్నారని, దానికి ప్రతిఫలంగా కమీషన్ తీసుకుంటున్నారని వెల్లడవుతోంది. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా వారు పాత నోట్లను తేలికగా మార్చేస్తున్నారని తెలిసింది.
ఒకవేళ రూ.5 కోట్లను మార్చాల్సిన పరిస్థితి వస్తే, కొన్ని షరతులతో వాటిని మారుస్తున్నామని వారే చెబుతున్నారు. చేసేది అక్రమమైనా ఎలాంటి బెరుకు, భయం లేకుండా, ప్రభుత్వం ఏం చేస్తుందిలే అనే ధోరణిలో ఎవరైనా నోట్లు మార్చుకోవాలంటే తమని సంప్రదించాలని పేర్కొంటున్నారు. అయితే కమీషన్గా 10 శాతం ఇవ్వాలంటున్నారు. అంటే కోటి రూపాయలను మారిస్తే రూ.10 లక్షలను వారు కమీషన్గా తీసుకుంటున్నారట. వీరికి లంచమిస్తూ చాలామంది పెద్దలు, బ్లాక్మనీ హోల్డర్స్ నగదు మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది.. ఈ కుంభకోణంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకర్లు ప్రమేయం ఉందని కూడా వెల్లడవుతోంది. ఇటీవల వీటిని రుజువు చేస్తూ చాలామంది బ్యాంకర్లు పట్టుబడుతుండటం కూడా వీటికి నిదర్శనంగా మారుతోంది. బ్లాక్మనీ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాత నోట్ల రద్దు ఏ మేరకు సత్ఫలమిస్తుందో తెలియదు కానీ, కొత్త రకం అవినీతికి మాత్రం ఇది తెరతీసినట్టు ఓ ఇంగ్లీష్ దినపత్రిక జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
Advertisement
Advertisement