కేజ్రీవాల్ ఫోనుకు.. నో రిప్లై! | aap mla ignores arvind kejriwal calls, then joins in bjp | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ ఫోనుకు.. నో రిప్లై!

Published Tue, Mar 28 2017 9:18 AM | Last Updated on Wed, Apr 4 2018 7:02 PM

కేజ్రీవాల్ ఫోనుకు.. నో రిప్లై! - Sakshi

కేజ్రీవాల్ ఫోనుకు.. నో రిప్లై!

మరికొద్ది వారాల్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఇంతకుముందు రెండేళ్ల క్రితం.. అంటే 2015 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 67 స్థానాలు గెలుచుకుని రికార్డు సృష్టించింది. అప్పటినుంచి ప్రధానమంత్రి మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒంటికాలిపై లేస్తున్నారు. తన తర్వాతి టార్గెట్ ఢిల్లీ కార్పొరేషనే అని చెప్పేశారు కూడా. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేజ్రీవాల్‌కు అనుకోని విధంగా గట్టి షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీలోంచి ఒక ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్ కొట్టారు. ఆ.. ఏముంది, ఉన్న 67 మందిలో ఒక్కరు పోతే ఏమవుతుందని ధీమాగా కూర్చోడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. వేద్‌ప్రకాష్ అనే ఎమ్మెల్యే పార్టీ మారొచ్చన్న విషయం ముందుగానే కేజ్రీవాల్‌కు ఉప్పు అందింది.

దాంతో ఆయన కంగారు పడి వెంటనే అతగాడికి ఫోన్ చేశారు. కానీ ఎన్నిసార్లయినా ఫోన్ రింగవుతుంది గానీ, అవతలి నుంచి 'మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతం స్పందించుట లేదు' అనే రికార్డెడ్ మెసేజ్ తప్ప ఆన్సర్ చేసిన పాపాన పోలేదు. కాసేపటి తర్వాత.. ఆ ఎమ్మెల్యే బీజేపీలో చేరినట్లుగా ట్విట్టర్‌లో వార్తలు వచ్చేశాయి. కేజ్రీవాల్ తల పట్టుకున్నారు. ఇది ఒక్క ఎమ్మెల్యేతోనే ఆగుతుందా.. ఈ వరద ఇంకా కొనసాగుతుందా అన్న భయమే అందుకు కారణమని తెలుస్తోంది.

272 మంది కార్పొరేటర్లను ఎన్నుకోడానికి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఏప్రిల్ 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్ బీజేపీ చేతిలో ఉంది. పంజాబ్‌లో అధికారం చేపడతామని ఊహించి, దాన్ని కాంగ్రెస్ పార్టీకి సమర్పించుకున్న ఆప్.. ఎన్నికలలో ఏక్ దిన్ కా సుల్తాన్ అనిపించుకోకుండా ఉండాలంటే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడం తప్పనిసరి. కానీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆప్ నిలబెట్టుకోలేదని, పార్టీ నాయకత్వంతో సుమారు 35 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని చెబుతూ... ఎమ్మెల్యే వేద్‌ప్రకాష్ చిన్న ఝలక్ ఇచ్చారు.

మొత్తం 36 మంది ఆప్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారంటే, ఇక కేజ్రీవాల్‌కు మిగిలేది 31 మంది మాత్రమే అవుతారు. అప్పుడు ప్రభుత్వం కూడా మైనారిటీలో పడిపోతుంది. కావాలనుకుంటే అనర్హత వేటు పడకుండా ఉండేందుకు మొత్తం 36 మందితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు కూడా బీజేపీ సిద్ధపడే అవకాశం లేకపోలేదు. వేద్‌ప్రకాష్ ఇచ్చిన షాక్‌తో అంతకుముందు తాము నిర్వహించాలనుకున్న ప్రెస్‌మీట్‌ను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రద్దు చేసుకుంది. ఇక కార్పొరేషన్ ఎన్నికలు జరిగేలోపు పరిణామాలు ఎలా మారిపోతాయో చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement