ఆప్‌లో మొదలైన కల్లోలం!
- కొనసాగుతున్న రాజీనామాల పర్వం
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలో కల్లోలం రేగుతోంది. తాజా ఓటమితో పార్టీ నాయకత్వంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా రాజనామాల బాట పడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలతో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీలో పరిణామాలు మరింత నష్టం కలిగించకుండా నివారణ చర్యలు తీసుకునేందుకే ఈ భేటీ నిర్వహించినట్టు తెలుస్తోంది.
ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ చిత్తయిన నేపథ్యంలో ఆ పార్టీ పంజాబ్ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు సీనియర్ నేత సంజయ్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు రాజీనామాను కేజ్రీవాల్‌కు పంపినట్టు ఆయన తెలిపారు. ఆయనతోపాటు పంజాబ్ సహ పరిశీలకులు దుర్గేష్ పాఠక్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 సీట్లలో 67 స్థానాలు గెలుచుకున్న ఆప్.. తాజా మున్సిపల్ ఎన్నికల్లో 270 స్థానాలకు 48 సీట్లు గెలిచి ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ పరాభవం నేపథ్యంలో నాయకత్వంపై నేతలు భగ్గుమంటున్నారు. బుధవారమే ఆప్ ఢిల్లీశాఖ కన్వీనర్ దిలీప్ పాండే తన పదవికి రాజీనామా చేశారు.
ఆప్ ఢిల్లీ ఇన్‌చార్జి ఆశిష్ తల్వార్ సైతం తన పదవిని వీడుతున్నట్టు ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యే అయిన అల్కా లంబా సైతం తన శాసనసభ సభ్యత్వంతోపాటు పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. మొత్తానికి తాజా పరాభవం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్‌ను కుదిపేస్తున్నది. ఈ రాజీనామాల పర్వంతో ఆప్ అంతర్గత నిర్మాణం పూర్తిగా మారే అవకాశముంది.