ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం కంటే.. పొత్తు వల్లే ఎక్కువ లాభం ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మరోమారు కాంగ్రెస్ పెద్దలకు తెలియజేశారు. పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ)బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఆయన ఢిల్లీలోనే కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ తో సమావేశమైయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని కేసీఆర్ గత ప్రకటనను దిగ్విజయ్ ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం కంటే పొత్తు వల్లే ఎక్కువ లాభం ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. దిగ్విజయ్ తో సమావేశంలో కే.కేశవరావు కూడా పాల్గొన్నారు.
బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైన నేపథ్యంలో కేసీఆర్ ఈ నెల 26న ప్రత్యేక విమానంలో తొలిసారి హైదరాబాద్ తిరిగివస్తున్నారు. కేసీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు సన్నద్ధమవుతున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్రవేయడం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం లాంఛనమే. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్కు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.