పంజాబ్‌కు అమరీందర్.. మణిపూర్‌లో ఉత్కంఠ
చండీగఢ్: ఈ నెల 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రమాణం చేయనున్నారు. కాసేపట్లో ఆయన గవర్నర్‌ను కలవనున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధుకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశముంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 117 స్థానాలకుగాను 77 చోట్ల జయకేతనం ఎగరేసింది. అధికార అకాలీదళ్ ఓటమి చవిచూడటంతో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఈ రోజు గవర్నర్ ను కలసి రాజీనామా లేఖను సమర్పించారు.
మణిపూర్‌లో ఉత్కంఠ: మణిపూర్‌లో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ మళ్లీ ఎన్నికయ్యారు. సోమవారం ఆయన గవర్నర్‌తో సమావేశం కానున్నారు. ఆయన 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్ 28 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు అవసరం. బీజేపీ 21, ఎన్‌పీఎఫ్ 4, ఇతరులు 7 సీట్లు గెలిచారు. బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతు కీలకంకానుంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.