టీడీపీపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పోత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడటం అంటే టీడీపీని బలహీన పర్చడం కాదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఏపీ రాజధాని విజయవాడలో ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దేశాభివృద్ధి కోసం తమ పార్టీ, టీడీపీ కలిసి పని చేస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల కేంద్రం అదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. తమ సిద్దాంతాలు నచ్చి వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు బీజేపీని విస్తరించడమే తమ లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలో 45 లక్షల మందిని పార్టీ సభ్యుత్వ నమోదు చేయించాలని నిర్ణయించినట్లు ఆయన విశదీకరించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరీ వల్ల మోదీ ప్రభుత్వం ప్రారంభించాల్సిన అనే కార్యక్రమాలు నిలిచిపోయాయని అమిత్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రణాళిక సంఘం స్థానంలో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన నీతి ఆయోగ్ వల్ల రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగానే దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపే దిశగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని అమిత్ షా వెల్లడించారు.