ఈ-గవర్నెన్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రోత్సాహకరంగా ఉందని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-గవర్నెన్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రోత్సాహకరంగా ఉందని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో 22 శాఖల పరిధిలో 177 ఈ-గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రభుత్వ సేవలు అందించడానికి ఏడువేల పౌర సేవా కేంద్రాలను నెలకొల్పామని వివరించారు. ‘మీసేవ’ లావాదేవీల్లో గురువారానికి 29 మిలియన్ల మైలురాయిని దాటామని పొన్నాల వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 331 ఈ-గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తేవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ‘ఇన్నోవేట్(ఆవిష్కరణ), ఇంప్లిమెంట్(ఆచరణ)’ అంశంపై ఢిల్లీలో గురువారం ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన ఈ-గవర్నెన్స్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సొంత జిల్లా వరంగల్‌ను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేశామని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. గూగుల్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుని వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామాన్నీ ‘గూగుల్ మ్యాప్స్’లోకి చేరేలా కృషి చేశామన్నారు. దేశంలోనే ఒక జిల్లా పూర్తిగా డిజిటైజ్ కావడం ఇదే ప్రథమమన్నారు.