బాబు కోసం 25మంది జర్నలిస్టులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగానే 25మంది జర్నలిస్టులకు లంచాలు చెల్లిస్తున్నారని పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ల న్యాయవాది, కార్యకర్త ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. 25 మంది జర్నలిస్టులను నియమించుకుంటూ ఆంధ్రప్రదేశ్ సర్కారు విడుదల చేసిన జీవోను ట్విట్టర్ ద్వారా ఆయన ప్రజల ముందు పెట్టారు. సాధారణంగానే మీడియా ఫోకస్‌ను ఎక్కువగా కోరుకునే సీఎం చంద్రబాబు జాతీయ స్ధాయిలో తన పరిపాలనకు అనుకూలంగా కథనాలను రాయడం కోసమే జర్నలిస్టులను నియమించుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం నియమించుకున్న 25మంది జర్నలిస్టుల టీమ్ కోసం నెలకు రూ.12,86,700 చెల్లిస్తూ ఆర్థిక శాఖ జీవో-24987ను కూడా విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రభుత్వం జీవో విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోను ట్విట్టర్ లో పోస్టు చేసిన ప్రశాంత్ భూషణ్ చంద్రబాబు తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు జర్నలిస్టులకు అధికారికంగా లంచం ఇవ్వడం లాంటివేనని అభిప్రాయపడ్డారు.