లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం
అమరావతి : తండ్రి ఉన్మాద చర్యతో కుటుంబాన్ని కోల్పోయిన లక్ష్మీ ప్రసన్న మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసింది. అనాధగా మారిన ఆమెకు గ్రూప్-2 ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. లక్ష్మీ ప్రసన్న మంగళవారం వెలగపూడి సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలిసింది. ఆమె విద్యార్హతలు అడగ్గా ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమెస్ట్రీ అని చెప్పడంతో లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని సీఎం.. అధికారులను ఆదేశించారు.
అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఆమెకు సూచించిన ముఖ్యమంత్రి ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆరు నెలలకు ఓసారి వచ్చి తనను కలవాలని లక్ష్మీప్రసన్నకు సూచించారు.
కాగా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన లక్ష్మీప్రసన్న తండ్రి రామసుబ్బారెడ్డి ఈ నెల 4వ తేదీన (మంగళవారం) భార్య, ఇద్దరు కుమార్తెలు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనలో భార్య సులోచన(45), కుమార్తె ప్రత్యూష(20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమార్తె ప్రతిభ(22) తీవ్ర గాయాలతో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే రామసుబ్బారెడ్డి మరో కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఆ సమయంలో ఇంటి దగ్గర లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఇప్పటికే లక్ష్మీ ప్రసన్నకు ముఖ్యమంత్రి రూ.20 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.