ముంబై : విమానాల్లో, విమానాశ్రయాల్లో పరిశుభ్రతాచర్యల కోసం ప్రయాణికుల నుంచి విరాళాలు వసూలు చేయాలన్న డీజీసీఏ ఆదేశాలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఎయిర్‌ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏపీఏఐ) పౌరవిమానయాన మంత్రిని కోరింది. ఆదివారం మంత్రి పి.అశోక్‌గజపతిరాజుకు లేఖ రాసింది. ఇప్పటికే అనేక విమానయానసంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు డి.సుధాకర రెడ్డి తెలిపారు. తమ ఉనికికోసం ప్రయాసపడుతున్న ఎయిర్‌లైన్స్‌లను ఈ విధంగా డొనేషన్లు వసూలు చేసే పనికి నియోగించడం భావ్యమా? అని ప్రశ్నించారు. అందుకుబదులుగా విమానాశ్రయాల నిర్వాహకులు ప్రయాణికుల నుంచి వసూలు చేసే సర్వీస్‌ఫీజులలో మరో పది పదిహేను రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చన్నారు.
రూ.10 నుంచి రూ. 25 వరకు సర్వీస్‌ఫీజుల్లోనే అదనంగా వసూలు చేస్తే అదే కోట్లాది రూపాయలకు చేరుకుంటుందని వివరించారు. ఆ మొత్తంతో విమానాశ్రయాలను పరిశుభ్రంగా ఉంచవచ్చని తెలిపారు. ఎయిర్‌లైన్స్‌లను అడిగే బదులు ఎయిర్‌పోర్టులను ఈ పని చేయమనడం మేలన్నారు. గ్రామాలను దత్తత తీసుకోవాలని, మరుగుదొడ్లను నిర్మించాలని ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ జారీచేసిన ఆదేశాల్లో పేర్కొనడం తగదన్నారు.