'టీడీపీ, బీజేపీలతో రాజకీయాలు కలుషితం'
సాక్షి, అమరావతిః అధికార తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీలు రాజకీయాలను కలుషితం చేస్తున్నాయని, మహానేతలైన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ సర్థార్‌వల్లభాయ్ పటేల్‌లకు మధ్య విభేదాలున్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో ఇందిర గాంధీ 32వ వర్థంతి, సర్ధార్ వల్లభాయ్ పటేల్ 130 జయంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
సర్ధార్ వల్లభాయ్ పటేల్, ఇందిర గాంధీలు జాతి కోసం అహర్నిశలు పని చేశారని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని రఘువీరా కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సంకుచిత భావాలతో రాజకీయాలు చేస్తున్నారని, మహనాయకులపై ప్రజలకు లేని అనుమానాలను నూరిపోస్తున్నారని ధ్వజమెత్తారు. కుల, మత వ్యవస్థ, ప్రాంతాలకు అతీతంగా ఇందిరాగాంధీ సంస్కరణలు చేపట్టారని గుర్తుచేసిన రఘువీరా.. 'చంద్రబాబుకు జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీనే. మదనపల్లిలో ఇందిర గాంధీ కాళ్లమీద పడి ఎమ్మెల్యే సీటు సంపాదించిన బాబు ఆ విషయం ఎప్పుడో మర్చిపోయినట్లున్నారు'అని అన్నారు. కాంగ్రెస్ పుణ్యంతోనే చంద్రబాబు ఎన్టీఆర్ కు అల్లుడయ్యారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.వి.పి. రామచంద్రరావు, శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య, ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.