
ఆపిల్ ఐఫోన్‌కు బంపర్ బూస్ట్!
ఐఫోన్ అమ్మకాలు పడిపోతున్నాయని ఆందోళన చెందుతున్న అమెరికాకు చెందిన ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్‌కు తాజా క్వార్టర్ ఫలితాలు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి.
ఐఫోన్ అమ్మకాలు పడిపోతున్నాయని ఆందోళన చెందుతున్న అమెరికాకు చెందిన ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్‌కు తాజా క్వార్టర్ ఫలితాలు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి. తాజాగా ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరగడంతో ఆ కంపెనీ రికార్డు ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఐఫోన్-7కు భారీ డిమాండ్ ఏర్పడటంతో గడిచిన త్రైమాసికంలో యాపిల్ ఆదాయం గణనీయంగా పెరిగింది. గడిచిన త్రైమాసికంలో యాపిల్ 78.4 బిలియన్ డాలర్ల (రూ. 5.30 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుమునుపు ఏడాది ఇదే త్రైమాసికానికి ఆపిల్ రెవెన్యూ 75.9 డాలర్లు (రూ. రూ. 5.13 లక్షల కోట్లు) మాత్రమే.
అయితే, ఆపిల్ ఆదాయం పెరిగినప్పటికీ.. డిసెంబర్‌తో ముగిసే గడిచిన త్రైమాసికంలో లాభం 2.6శాతం తగ్గి.. 17.9 బిలియన్ డాలర్లు (రూ. 1.21 లక్షల కోట్లు) నమోదుచేసింది. గడిచిన హాలిడే త్రైమాసికంలో 7.83 కోట్ల ఐఫోన్లను ఆపిల్ అమ్మింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే ఇది ఐదుశాతం అధికం. ‘మా హాలిడే క్వార్టర్ లో గతంలో ఎన్నడూలేనంత అత్యధికస్థాయిలో ఆదాయం ఆర్జించి.. పలు రికార్డులు బద్దలుకొట్టడం ఆనందంగా ఉంద’ని రెవెన్యూ వివరాలు వెల్లడిస్తూ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ అన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఐఫోన్ అమ్మకాలు సాధించామని, దీంతో కంపెనీకి గణనీయమైన రెవెన్యూ వచ్చిందని ఆయన తెలిపారు. ఆపిల్ ఫలితాలు వెలువడటంతో ఆ కంపెనీ షేరు స్టాక్‌మార్కెట్‌లో మూడుశాతం పెరిగి 125.19 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.