
ధర్నా చేస్తే కేజ్రీవాల్, మంత్రుల అరెస్టు?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. నేరుగా కేంద్ర ప్రభుత్వంతో ఢీకొంటున్నారు. కానీ ధర్నా చేస్తే ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి.. నేరుగా కేంద్ర ప్రభుత్వంతో ఢీకొంటున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించడంతో పాటు, మంత్రులను కూడా ధిక్కరించినందుకు ఢిల్లీ పోలీసులపై చర్య తీసుకోవాలంటూ ఏకంగా కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయం ఎదుటే ధర్నా చేయనున్నారు. అయితే.. కేంద్రం కూడా ఢిల్లీ సర్కారుతో ఢీ అంటే ఢీ అనేలాగే ఉంది. అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు గనక ధర్నా చేస్తే, వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరు మంత్రులు చెప్పినా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను కొంతమంది పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోరవాలని స్వయంగా ముఖ్యమంత్రి అరవింద్ర కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరినా ఆయన ఏమాత్రం స్పందించలేదు. ఇందుకు నిరసనగా సీఎం కేజ్రీవాల్తో పాటు ఆయన మంత్రులు, మొత్తం ఆప్ ఎమ్మెల్యేలు షిండే కార్యాలయం ఎదురుగా ధర్నా చేయాలని నిర్ణయించారు.
దీంతో ఇప్పటికే నార్త్బ్లాక్ వద్దకు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను తరలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నాను విజయవంతం కాకుండా చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక యాసీన్ భత్కల్ను విడిపించుకోడానికి కేజ్రీవాల్ను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ప్రయత్నిస్తోందని కథనాలు వచ్చినా కూడా కేజ్రీవాల్ ఏమాత్రం లెక్కచేయకుండా ధర్నాకు దిగాలని నిర్ణయించారు.
కాగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా నేపథ్యంలో నార్త్ బ్లాక్కు సమీపంలో ఉన్న నాలుగు మెట్రో స్టేషన్లను ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూసేశారు. ఢిల్లీ పోలీసుల సూచన మేరకు పటేల్ చౌక్, కేంద్ర సచివాలయం, ఉద్యోగ భవన్, రేస్ కోర్స్ మెట్రో స్టేషన్లను మూసేశారు. కేంద్ర సచివాలయం వద్ద ఉన్న ఇంటర్ఛేంజ్ స్టేషన్ వద్ద మాత్రం కేవలం ఉద్యోగులనే, అది కూడా వాళ్ల ఐడీ కార్డులు చూశాక మాత్రమే అనుమతిస్తున్నారు.