
‘లలిత్ వీసాపై సమాచారం ఇవ్వలేం’
న్యూఢిల్లీ: ఆర్థిక నేరారోపణలున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వీసాకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద దాఖలైన దరఖాస్తును విదేశాంగ శాఖ తిరస్కరించింది. దరఖాస్తులోని 1-3 ప్రశ్నలు ఆర్టీఐ పరిధిలోకి రావని, 4-7 ప్రశ్నలకు సమాచారం తమ దగ్గర లేదంటూ సమాధానమిచ్చింది. దరఖాస్తును పాస్‌పోర్ట్ కాన్సులర్, ఆర్థిక, హోం శాఖలకు పంపిస్తామంది. హరియాణాకు చెందిన రాయో దాఖలుచేసిన ఈ దరఖాస్తులోని ప్రశ్నలు ఇవీ..
1. లలిత్ పాస్‌పోర్టును పునరుద్ధరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లరాదని ఎవరు నిర్ణయించారు.
2. లలిత్ పోర్చుగల్ వెళ్లేందుకు మానవతా దృక్పథంతో సాయం చేయాలనుకున్న సుష్మ ఆయనను లండన్‌లోని భారత హైకమిషన్‌కు దరఖాస్తు చేసుకోమని ఎందుకు సూచించలేదు? 3. తాత్కాలిక ట్రావెల్ డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు ఆయనను భారత్‌కు తిరిగి రావాలని సుష్మ ఎందుకు షరతు విధించలేదు?
4. బ్రిటన్‌లో లలిత్ ఆశ్రయంపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసిందా?
5. లలిత్‌కు తాజా వీసా అందిన తర్వాత, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ జారీ చేసిన సమన్లు అందించేందుకు తీసుకున్న చర్యలేంటి?
6. పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరిన ఈడీ ఆ విషయంపై కోర్టును సంప్రదించిందా?
7. భారత్‌కు తిరిగొస్తే తన ప్రాణాలకు ముప్పుంటుందన్న లలిత్ వాదనపై ప్రభుత్వ స్పందన ఏమిటి?.