క్రికెటర్ కావాలనుకుని.. ఉగ్రవాదయ్యాడు
తెలివితేటలు ఉన్న కుర్రాడు సమున్నత లక్ష్యాన్ని వదిలి దారితప్పితే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో.. ఎన్కౌంటర్లో హతమైన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీ ఉదంతమే నిదర్శనం. రెండుపదుల వయసులోనే కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిన వనీ.. ఇలా మారుతాడని చిన్నతనంలో ఊహించలేదు. 10 ఏళ్ల వయసులో అతను కన్న కలలు వేరు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్నది వనీ ఆశయమని అతని తండ్రి ముజఫర్ వనీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే కశ్మీర్ క్రికెటర్ పర్వేజ్ రసూల్ మాదిరి క్రికెటర్ కావాలని, దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకునేవాడని తెలిపాడు.
ముజఫర్ వనీ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్. పిల్లలు బాగా చదువుకుని కశ్మీర్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్, ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులు కావాలని ఆయన చెబుతుంటారు. తండ్రి మాటలకు ప్రేరణతో బుర్హన్ కూడా బాగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకున్నాడు. అయితే వక్రదారి పట్టడంతో అతని లక్ష్యం నెరవేరలేదు. ఉగ్రవాద భావజాలంతో అతని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కశ్మీర్ కల్లోలానికి కారణమయ్యాడు. భద్రత దళాల ఎన్కౌంటర్లో వనీ మరణించాక జరిగిన అల్లర్లలో దాదాపు 80 మరణించగా, రెండున్నర నెలల పాటు కశ్మీర్లో కర్ఫ్యూ వాతావారణం నెలకొంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్ధుమణుగుతున్నాయి.
2010 అక్టోబర్ 5న బుర్హన్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడని ముజఫర్ చెప్పాడు. స్నేహితులను కలిసేందుకు వెళుతున్నానని తన తల్లికి చెప్పి వెళ్లాడని, ఆ తర్వాత తిరిగిరాలేదని తెలిపాడు. ఉగ్రవాదుల్లో చేరాడని ఆ తర్వాత తెలిసిందని చెప్పాడు. ఎన్కౌంటర్లో చనిపోయే రెండు నెలల ముందు అతన్ని మార్చేందుకు ప్రయత్నించానని తెలిపాడు. గత ఐదేళ్లలో తాను బుర్హన్ను రెండు లేదా మూడు సార్లు కలిశానని, అది కూడా రెండు మూడు నిమిషాలకు మించి మాట్లాడలేదని చెప్పాడు. రెండున్నరేళ్ల క్రితం చివరిసారి కలిశానని, బుర్హన్ సొంత పంథాలో సాగాడని, తాను కుటుంబం కోసం ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నానన్నాడు. బుర్హన్కు ముందు తన మరో కుమారుడు ఖలీద్ గతేడాది ఏప్రిల్లో భద్రత దళాల కాల్పుల్లో మరణించాడని తెలిపాడు. తన మూడో కొడుకు నవీద్ అన్నల బాటలో నడవకుండా చదువుకోవాలని భావిస్తున్నాడని, తన కూతురు టీచర్ కావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
బుర్హన్ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో ఈ స్థాయిలో హింస జరుగుతుందని ఊహించలేదని ముజఫర్ చెప్పాడు. రెండు నెలలుగా ఎంతో నష్టపోయామని, మార్పు రావాలని కోరుకుంటున్నామని అన్నాడు. తాను ఇద్దరు కుమారులను కోల్పోయానని, ఎన్నో కుటుంబాలు సొంతవారిని పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్, పాకిస్థాన్ల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడం తప్పనిసరని, లేకుంటే దాడులు జరగవచ్చని చెప్పాడు.